న్యాయాధిపతులు 13:1-25
13 ఇశ్రాయేలీయులు మళ్లీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించారు,+ దాంతో యెహోవా వాళ్లను 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు.+
2 ఆ కాలంలో దాను+ వంశానికి చెందిన ఒకతను జొర్యాలో+ నివసిస్తుండేవాడు, అతని పేరు మానోహ.+ అతని భార్య గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు.+
3 కొంతకాలానికి యెహోవా దూత ఆమెకు కనిపించి ఆమెతో ఇలా అన్నాడు: “ఇదిగో, నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు. అయితే నువ్వు గర్భవతివై ఒక కుమారుణ్ణి కంటావు.+
4 ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి; నువ్వు ద్రాక్షారసాన్ని గానీ ఎలాంటి మద్యాన్ని గానీ తాగొద్దు,+ అపవిత్రమైనదేదీ తినొద్దు.+
5 ఇదిగో! నువ్వు గర్భవతివై ఒక కుమారుణ్ణి కంటావు. అతని తలమీద అస్సలు మంగలికత్తే పడకూడదు,+ ఎందుకంటే ఆ బాబు పుట్టినప్పటి* నుండి దేవునికి నాజీరుగా ఉంటాడు; అతను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తుంటాడు.”+
6 అప్పుడు ఆ స్త్రీ వెళ్లి తన భర్తతో ఇలా చెప్పింది: “సత్యదేవుని సేవకుడు ఒకతను నా దగ్గరికి వచ్చాడు, అతని రూపం సత్యదేవుని దూతలా ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. అతను ఎక్కడి నుండి వచ్చాడో నేను అడగలేదు, అతను కూడా తన పేరు నాకు చెప్పలేదు.+
7 కానీ అతను, ‘నువ్వు గర్భవతివై ఒక కుమారుణ్ణి కంటావు. ఇప్పుడు నువ్వు ద్రాక్షారసాన్ని గానీ ఎలాంటి మద్యాన్ని గానీ తాగొద్దు, అపవిత్రమైనదేదీ తినొద్దు. ఎందుకంటే ఆ బాబు పుట్టినప్పటి* నుండి చనిపోయేవరకు దేవునికి నాజీరుగా ఉంటాడు’ అని చెప్పాడు.”
8 అప్పుడు మానోహ యెహోవాను ఇలా వేడుకున్నాడు: “యెహోవా, పుట్టబోయే ఆ బాబును మేము ఎలా పెంచాలో మాకు చెప్పడానికి, నువ్వు ఇందాక పంపించిన సత్యదేవుని సేవకుణ్ణి దయచేసి మళ్లీ పంపించు.”
9 సత్యదేవుడు మానోహ ప్రార్థనను విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూర్చొని ఉన్నప్పుడు సత్యదేవుని దూత మళ్లీ ఆమె దగ్గరికి వచ్చాడు; ఆమె భర్త మానోహ అప్పుడు ఆమెతోపాటు లేడు.
10 ఆమె వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి తన భర్తతో, “ఇదిగో! ఆ రోజు నా దగ్గరికి వచ్చిన అతను నాకు కనిపించాడు” అని చెప్పింది.+
11 మానోహ లేచి తన భార్యతోపాటు వెళ్లాడు. మానోహ అతని దగ్గరికి వచ్చి, “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా?” అని అడిగాడు, అతను “నేనే” అన్నాడు.
12 అప్పుడు మానోహ, “నీ మాటలు నిజం కావాలి! ఆ బాబు జీవితం ఎలా ఉంటుంది? అతను ఏం చేస్తాడు?” అని అడిగాడు.+
13 అందుకు యెహోవా దూత మానోహకు ఇలా చెప్పాడు: “నేను నీ భార్యతో చెప్పిన వాటన్నిటికీ ఆమె దూరంగా ఉండాలి.+
14 ఆమె ద్రాక్షవల్లి నుండి వచ్చే దేన్నీ తినకూడదు, ద్రాక్షారసాన్ని గానీ ఎలాంటి మద్యాన్ని గానీ తాగకూడదు;+ అపవిత్రమైనదేదీ తినకూడదు.+ నేను ఆమెకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఆమె పాటించాలి.”
15 అప్పుడు మానోహ యెహోవా దూతతో, “దయచేసి ఇక్కడే ఉండు, మేము నీ కోసం ఒక మేకపిల్లను సిద్ధం చేస్తాం” అన్నాడు.+
16 కానీ యెహోవా దూత మానోహతో, “నేను ఒకవేళ ఉన్నా నీ ఆహారం తినను; నువ్వు యెహోవాకు ఒక దహనబలి అర్పించాలనుకుంటే అర్పించవచ్చు” అని చెప్పాడు. అతను యెహోవా దూత అని మానోహకు తెలీదు.
17 అప్పుడు మానోహ యెహోవా దూతను, “నీ మాటలు నిజమైనప్పుడు మేము నిన్ను గౌరవించేలా నీ పేరేమిటో చెప్పు”+ అని అడిగాడు.
18 కానీ యెహోవా దూత అతనితో, “నా పేరు అడగొద్దు, ఎందుకంటే అది అద్భుతమైనది” అని అన్నాడు.
19 అప్పుడు మానోహ మేకపిల్లను, అలాగే ధాన్యార్పణను తీసుకుని ఒక రాయి మీద వాటిని యెహోవాకు అర్పించాడు. మానోహ, అతని భార్య చూస్తుండగా దేవుడు ఒక ఆశ్చర్యకరమైన పని చేశాడు.
20 బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తుండగా, యెహోవా దూత బలిపీఠం నుండి లేస్తున్న ఆ మంటల్లో పైకి వెళ్లాడు. మానోహ, అతని భార్య చూస్తుండగా ఇదంతా జరిగింది. వెంటనే వాళ్లిద్దరు నేలమీద సాష్టాంగపడ్డారు.
21 యెహోవా దూత మళ్లీ మానోహకు, అతని భార్యకు కనిపించలేదు. అతను యెహోవా దూత అని మానోహకు అప్పుడు అర్థమైంది.+
22 అప్పుడు మానోహ తన భార్యతో, “మనం దేవుణ్ణి చూశాం, మనం ఖచ్చితంగా చనిపోతాం”+ అన్నాడు.
23 కానీ మానోహ భార్య అతనితో ఇలా అంది: “యెహోవా మనల్ని చంపాలనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని, ధాన్యార్పణను అంగీకరించేవాడు కాదు.+ మనకు ఇవన్నీ చూపించేవాడు కాదు, ఈ విషయాల్లో దేన్నీ మనకు చెప్పేవాడు కాదు.”
24 తర్వాత ఆ స్త్రీ ఒక కుమారుణ్ణి కని, అతనికి సమ్సోను+ అని పేరు పెట్టింది. ఆ బాబు ఎదుగుతుండగా యెహోవా అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు.
25 కొంతకాలానికి అతను జొర్యా, ఎష్తాయోలు+ మధ్య మహనెదానులో+ ఉన్నప్పుడు యెహోవా పవిత్రశక్తి అతన్ని ప్రేరేపించడం+ మొదలుపెట్టింది.