న్యాయాధిపతులు 14:1-20

  • న్యాయాధిపతి సమ్సోను ఒక ఫిలిష్తీయ స్త్రీని పెళ్లిచేసుకోవాలని అనుకోవడం (1-4)

  • సమ్సోను యెహోవా పవిత్రశక్తితో సింహాన్ని చంపడం (5-9)

  • పెళ్లిలో సమ్సోను పొడుపుకథ (10-19)

  • సమ్సోను భార్య వేరే వ్యక్తికి ఇవ్వబడింది (20)

14  అప్పుడు సమ్సోను తిమ్నాకు వెళ్లి అక్కడ ఒక ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడు.  కాబట్టి అతను తన తల్లిదండ్రులతో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాను, మీరు ఆమెను తెచ్చి నాకు పెళ్లి చేయండి” అన్నాడు.  కానీ అతని తల్లిదండ్రులు, “నీ బంధువుల్లో, మన ప్రజలందరిలో నీకు అమ్మాయే దొరకలేదా?+ నువ్వు వెళ్లి సున్నతిలేని ఫిలిష్తీయుల్లో నుండి భార్యను తెచ్చుకోవాలా?” అన్నారు. కానీ సమ్సోను తన తండ్రితో, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరైనది” అన్నాడు.  యెహోవాయే అలా నడిపిస్తున్నాడని అతని తల్లిదండ్రులకు అర్థంకాలేదు, ఎందుకంటే ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి సమ్సోను ఫిలిష్తీయులతో పోరాడే అవకాశం కోసం చూస్తున్నాడు.+  సమ్సోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాకు వెళ్లాడు. అతను తిమ్నా ద్రాక్షతోటల దగ్గరికి వచ్చేసరికి, ఇదిగో! ఒక కొదమ సింహం గర్జిస్తూ అతనికి ఎదురొచ్చింది.  అప్పుడు యెహోవా పవిత్రశక్తి అతన్ని శక్తిమంతుణ్ణి చేయడంతో+ ఒక వ్యక్తి వట్టిచేతులతో మేకపిల్లను రెండుగా చీల్చినట్టు సమ్సోను ఆ సింహాన్ని రెండుగా చీల్చేశాడు. అయితే తాను చేసినదాని గురించి అతను తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.  తర్వాత అతను తిమ్నాకు వెళ్లి ఆ స్త్రీతో మాట్లాడాడు, ఆమె సమ్సోను దృష్టికి ఇంకా సరైనదిగానే అనిపించింది.+  ఆ తర్వాత, సమ్సోను ఆమెను ఇంటికి తీసుకురావడానికి+ తిరిగెళ్తూ, సింహం కళేబరాన్ని చూద్దామని అటువైపు తిరిగాడు. అక్కడ సింహం కళేబరంలో తేనెటీగల గుంపు, తేనె ఉండడం చూశాడు.  దాంతో అతను కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని నడుస్తూ తిన్నాడు. అతను తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నప్పుడు వాళ్లు తినడానికి కొంచెం తేనె ఇచ్చాడు, అయితే దాన్ని సింహం కళేబరంలో నుండి తీసినట్టు వాళ్లకు చెప్పలేదు. 10  సమ్సోను తండ్రి ఆ స్త్రీని చూడడానికి వెళ్లాడు. అక్కడ సమ్సోను ఒక విందు ఏర్పాటు చేశాడు; ఎందుకంటే, ఆ రోజుల్లో యువకులు అలా చేయడం ఆనవాయితీ. 11  ఫిలిష్తీయులు సమ్సోనును చూసినప్పుడు పెళ్లికుమారుడితో పాటు ఉండడానికి 30 మంది యువకుల్ని తీసుకొచ్చారు. 12  అప్పుడు సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “దయచేసి మీకు ఒక పొడుపుకథ చెప్పనివ్వండి. విందు జరిగే ఏడురోజుల్లో మీరు దాన్ని విప్పి జవాబు చెప్తే నేను 30 నార దుస్తులు, 30 జతల బట్టలు మీకు ఇస్తాను. 13  ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే మీరు నాకు 30 నార దుస్తులు, 30 జతల బట్టలు ఇవ్వాలి.” అందుకు వాళ్లు, “నీ పొడుపుకథను చెప్పు, మేము వినాలనుకుంటున్నాం” అన్నారు. 14  అప్పుడు సమ్సోను వాళ్లకిలా చెప్పాడు: “తినే దానిలో నుండి తిండి వచ్చింది,బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.”+ వాళ్లు ఆ పొడుపుకథను మూడు రోజుల పాటు విప్పలేకపోయారు. 15  నాలుగో రోజున వాళ్లు సమ్సోను భార్యతో, “నీ భర్త పొడుపుకథ అర్థాన్ని మాకు చెప్పేలా అతన్ని మాయ చేయి.+ లేకపోతే మేము నిన్ను, నీ తండ్రి ఇంటివాళ్లను తగలబెడతాం. మా ఆస్తుల్ని లాక్కోవడానికే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారా?” అని అన్నారు. 16  కాబట్టి సమ్సోను భార్య అతని ముందు ఏడుస్తూ, “నేనంటే నీకు ప్రేమ లేదు, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు.+ నువ్వు నా ప్రజలకు ఒక పొడుపుకథ చెప్పావు, కానీ దాని అర్థాన్ని నాకు చెప్పలేదు” అని అంది. అందుకు సమ్సోను ఆమెతో, “నేను దాన్ని మా అమ్మానాన్నలకే చెప్పలేదు, అలాంటిది నీకు చెప్పాలా?” అన్నాడు. 17  కానీ ఆమె ఆ ఏడురోజుల విందులో మిగతా రోజులన్నీ అతని ముందు ఏడుస్తూనే ఉంది. ఆమె సమ్సోనును బాగా విసిగించడంతో చివరికి ఏడో రోజున అతను దాని అర్థాన్ని ఆమెకు చెప్పాడు. తర్వాత ఆమె దాన్ని తన ప్రజలకు చెప్పింది.+ 18  ఏడో రోజున సూర్యాస్తమయానికి ముందు* ఆ నగర ప్రజలు సమ్సోనుకు ఇలా చెప్పారు: “తేనె కన్నా తియ్యనిది ఏది?సింహం కన్నా బలమైనది ఏది?”+ అప్పుడు సమ్సోను వాళ్లతో, “మీరు నా పెయ్యతో దున్నకపోయుంటే,+నా పొడుపుకథను విప్పేవాళ్లు కాదు” అని అన్నాడు. 19  అప్పుడు యెహోవా పవిత్రశక్తి సమ్సోనును శక్తిమంతుణ్ణి చేసింది.+ అతను అష్కెలోనుకు+ వెళ్లి, అక్కడ 30 మంది పురుషుల్ని చంపి, వాళ్ల బట్టలు తీసుకుని పొడుపుకథ విప్పినవాళ్లకు ఇచ్చాడు.+ సమ్సోను ఎంతో కోపంతో తన తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు. 20  అప్పుడు సమ్సోను భార్య+ అతనితో ఉన్న యువకుల్లో ఒకతనికి ఇవ్వబడింది.+

అధస్సూచీలు

లేదా “అతను లోపలి గదిలోకి వెళ్లడానికి ముందు” అయ్యుంటుంది.