న్యాయాధిపతులు 2:1-23

  • యెహోవా దూత హెచ్చరించడం (1-5)

  • యెహోషువ చనిపోవడం (6-10)

  • ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి న్యాయాధి​పతుల్ని ఇవ్వడం (11-23)

2  తర్వాత యెహోవా దూత+ గిల్గాలు+ నుండి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఐగుప్తులో* నుండి మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోకి తీసుకొచ్చాను.+ అంతేకాదు నేను ఇలా అన్నాను, ‘నేను మీతో చేసిన ఒప్పందాన్ని* ఎప్పుడూ మీరను.+  అయితే మీరు ఈ దేశ ప్రజలతో ఒప్పందం చేసుకోకూడదు,+ మీరు వాళ్ల బలిపీఠాల్ని కూలగొట్టాలి.’+ కానీ మీరు నా మాట వినలేదు.+ మీరెందుకు అలా చేశారు?  అందుకే, ‘నేను వాళ్లను మీ ఎదుట నుండి వెళ్లగొట్టను;+ వాళ్లు మిమ్మల్ని ఉచ్చులో పడేస్తారు,+ వాళ్ల దేవుళ్లు మిమ్మల్ని ప్రలోభపెట్టి నా నుండి దూరంగా లాక్కెళ్తారు’+ అని కూడా చెప్పాను.”  యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు అన్నప్పుడు ప్రజలు బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టారు.  కాబట్టి వాళ్లు ఆ చోటికి బోకీము* అని పేరు పెట్టారు, వాళ్లు అక్కడ యెహోవాకు బలులు అర్పించారు.  యెహోషువ ప్రజల్ని పంపించేసినప్పుడు, ఇశ్రాయేలీయుల్లో ప్రతీ ఒక్కరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి తమ స్వాస్థ్యానికి వెళ్లారు.  యెహోషువ బ్రతికున్నంత కాలం, అలాగే యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేసిన గొప్ప పనులన్నీ చూసి, యెహోషువ కన్నా ఎక్కువకాలం జీవించిన పెద్దలు బ్రతికున్నంత కాలం ప్రజలు యెహోవాను సేవిస్తూ వచ్చారు.+  ఆ తర్వాత, నూను కుమారుడూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ 110 ఏళ్ల వయసులో చనిపోయాడు.+  అతన్ని తిమ్నత్హెరెసులో అతని స్వాస్థ్యంలో+ పాతిపెట్టారు. అది ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలో గాయషు పర్వతానికి ఉత్తరాన ఉంది.+ 10  ఆ తరం వాళ్లందరూ తమ పూర్వీకుల దగ్గరికి చేర్చబడ్డారు;* వాళ్ల తర్వాత, యెహోవా గురించి గానీ, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసినవాటి గురించి గానీ తెలియని ఇంకో తరం పుట్టింది. 11  కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించి, బయలు దేవుళ్లను సేవించారు.*+ 12  అలా వాళ్లు తమను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చిన తమ తండ్రుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు.+ వాళ్లు వేరే దేవుళ్లను, అంటే తమ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్లను సేవించారు,+ వాళ్లు ఆ దేవుళ్లకు మొక్కి యెహోవాకు కోపం తెప్పించారు.+ 13  వాళ్లు యెహోవాను విడిచిపెట్టి బయలును, అష్తారోతు విగ్రహాల్ని సేవించారు.+ 14  దాంతో యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది, ఆయన వాళ్లను దోచుకునేవాళ్లకు అప్పగించాడు;+ వాళ్లు ఇశ్రాయేలీయుల్ని దోచుకున్నారు. ఆయన ఇశ్రాయేలీయుల్ని వాళ్ల చుట్టూ ఉన్న శత్రువుల చేతికి అప్పగించాడు;*+ వాళ్లు ఇక ఏ మాత్రం తమ శత్రువుల్ని ఎదిరించలేకపోయారు.+ 15  యెహోవా చెప్పినట్టు, యెహోవా వాళ్లకు ఒట్టేసినట్టు,+ వాళ్లు వెళ్లిన ప్రతీ చోట యెహోవా చెయ్యి వాళ్లకు వ్యతిరేకంగా ఉంటూ వాళ్లమీద విపత్తు తీసుకొస్తూ ఉంది.+ దాంతో వాళ్లు తీవ్రమైన కష్టాల్లో చిక్కుకున్నారు.+ 16  అప్పుడు యెహోవా వాళ్ల కోసం న్యాయాధిపతుల్ని ఇచ్చేవాడు, వాళ్లు దోచుకునేవాళ్ల చేతి నుండి ప్రజల్ని రక్షించేవాళ్లు.+ 17  కానీ వాళ్లు న్యాయాధిపతుల మాట కూడా వినకుండా వేరే దేవుళ్లను పూజిస్తూ,* వాటికి వంగి నమస్కారం చేస్తూ వచ్చారు. వాళ్లు తమ పూర్వీకులు నడిచిన మార్గం నుండి త్వరగా పక్కకు మళ్లారు. వాళ్ల పూర్వీకులు యెహోవా ఆజ్ఞల్ని పాటించారు కానీ వాళ్లు పాటించలేదు. 18  యెహోవా ప్రజల కోసం న్యాయాధిపతుల్ని ఇచ్చినప్పుడల్లా, యెహోవా ఆ న్యాయాధిపతికి తోడుగా ఉంటూ అతను బ్రతికున్నంత కాలం ప్రజల్ని వాళ్ల శత్రువుల చేతుల్లో నుండి రక్షించేవాడు; ఎందుకంటే తమను అణచివేస్తున్నవాళ్ల+ కారణంగా, తమతో క్రూరంగా ప్రవర్తిస్తున్నవాళ్ల కారణంగా ప్రజలు మూల్గుతుండడం చూసి యెహోవా జాలిపడ్డాడు.*+ 19  కానీ ఆ న్యాయాధిపతి చనిపోయాక వాళ్లు వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాళ్లను సేవిస్తూ, వాళ్లకు మొక్కుతూ మళ్లీ తమ తండ్రుల కన్నా ఇంకా చెడ్డగా ప్రవర్తించేవాళ్లు.+ వాళ్లు తమ పద్ధతుల్ని, తమ మొండి ప్రవర్తనను మానుకోలేదు. 20  చివరికి యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది;+ ఆయనిలా అన్నాడు: “నేను వాళ్ల పూర్వీకులతో చేసిన నా ఒప్పందాన్ని+ ఈ ప్రజలు మీరారు, వాళ్లు నాకు లోబడలేదు+ కాబట్టి, 21  యెహోషువ చనిపోయినప్పుడు మిగిలివున్న దేశాల ప్రజల్లో ఒక్కర్ని కూడా నేను వీళ్ల ఎదుట నుండి వెళ్లగొట్టను. 22  అలా, ఇశ్రాయేలీయులు తమ తండ్రుల్లా యెహోవా మార్గాన్ని పాటిస్తారో లేదో పరీక్షిస్తాను.”+ 23  కాబట్టి యెహోవా ఈ దేశాల ప్రజల్ని ఉండనిచ్చాడు. ఆయన వాళ్లను త్వరగా వెళ్లగొట్టలేదు, ఆయన వాళ్లను యెహోషువ చేతికి అప్పగించలేదు.

అధస్సూచీలు

లేదా “ఈజిప్టులో.”
లేదా “నిబంధనను.”
“ఏడ్చేవాళ్లు” అని అర్థం.
మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.
లేదా “పూజించారు.”
అక్ష., “అమ్మేశాడు.”
లేదా “దేవుళ్లతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తూ.”
లేదా “విచారపడ్డాడు.”