న్యాయాధిపతులు 20:1-48

  • బెన్యామీనీయులతో యుద్ధం (1-48)

20  దాంతో, దాను+ నుండి బెయేర్షెబా వరకు, అలాగే గిలాదు ప్రాంతంలో+ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వచ్చారు. సమాజమంతా మిస్పాలో యెహోవా ఎదుట ఐక్యంగా* సమావేశమైంది.+  ప్రజలందరి ప్రధానులు, అంటే ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులందరూ దేవుని ప్రజల సమాజంలో తమతమ స్థానాల్లోకి వచ్చారు. అలాగే కత్తి ధరించిన 4,00,000 మంది సైనికులు+ కూడా ఉన్నారు.  ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ ఘోరం ఎలా జరిగిందో చెప్పు”+ అని అడిగారు.  అందుకు ఆ లేవీయుడు,+ అంటే చంపబడిన స్త్రీ భర్త ఇలా చెప్పాడు: “నేను రాత్రి బస చేయడానికి నా ఉపపత్నితో కలిసి బెన్యామీనీయులకు చెందిన గిబియాకు వచ్చాను.+  రాత్రిపూట గిబియా నివాసులు* నా మీదికి వచ్చి, ఇంటిని చుట్టుముట్టారు. వాళ్లు నన్ను చంపాలనుకున్నారు, కానీ నా ఉపపత్ని మీద అత్యాచారం చేశారు, ఆమె చనిపోయింది.+  దాంతో నేను ఆమె శవాన్ని ముక్కలుముక్కలుగా కోసి, వాటిని ఇశ్రాయేలు స్వాస్థ్యంలోని ప్రతీ ప్రాంతానికి పంపించాను;+ ఎందుకంటే వాళ్లు ఇశ్రాయేలులో అవమానకరమైన, నీచమైన పని చేశారు.  కాబట్టి ఇశ్రాయేలీయులైన మీరందరూ సలహా ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి.”+  అప్పుడు ప్రజలందరూ ఏకాభిప్రాయంతో* లేచి ఇలా అన్నారు: “మనలో ఒక్కడు కూడా తన డేరాకు గానీ తన ఇంటికి గానీ తిరిగెళ్లడు.  మనం ఇప్పుడు గిబియాకు ఇలా చేద్దాం: దాని మీదికి ఎవరు వెళ్లాలో మనం చీట్లు* వేసుకుందాం.+ 10  సైన్యానికి ఆహారం సమకూర్చడం కోసం ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి 100 మందిలో 10 మందిని, 1,000 మందిలో 100 మందిని, 10,000 మందిలో 1,000 మందిని తీసుకుందాం. బెన్యామీనుకు చెందిన గిబియావాళ్లు ఇశ్రాయేలులో నీచమైన పని చేశారు కాబట్టి వాళ్లమీద ఆ సైన్యం చర్య తీసుకుంటుంది.” 11  అలా ఇశ్రాయేలీయులందరూ ఆ నగరానికి వ్యతిరేకంగా ఐక్యంగా* సమకూడారు. 12  అప్పుడు ఇశ్రాయేలు గోత్రాల వాళ్లు, బెన్యామీను గోత్రం వాళ్లందరికీ మనుషుల ద్వారా ఇలా సందేశం పంపించారు: “మీ మధ్య ఇంత ఘోరం ఎలా జరిగింది? 13  గిబియాలోని ఆ పనికిమాలినవాళ్లను+ అప్పగించండి. మేము వాళ్లను చంపి ఇశ్రాయేలులో నుండి చెడుతనాన్ని తీసేస్తాం.”+ కానీ బెన్యామీనీయులు తమ సహోదరులైన ఇశ్రాయేలీయుల మాట వినలేదు. 14  అప్పుడు బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వాళ్లవాళ్ల నగరాల్లో నుండి వచ్చి గిబియాలో సమకూడారు. 15  ఆ రోజున బెన్యామీనీయులు కత్తులు ధరించిన 26,000 మందిని తమ నగరాల్లో నుండి పోగుచేశారు, వాళ్లు కాకుండా 700 మంది ఎంపికచేయబడిన గిబియావాళ్లు ఉన్నారు. 16  ఆ సైన్యంలో, 700 మంది ఎడమచేతి వాటం గల ఎంపిక చేయబడిన సైనికులు ఉన్నారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు వడిసెల రాయితో తలవెంట్రుకను కూడా గురి తప్పకుండా కొట్టగలరు. 17  ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్ని కాకుండా, కత్తులు ధరించిన 4,00,000 మందిని పోగుచేశారు,+ వాళ్లలో ప్రతీ ఒక్కరు అనుభవంగల యోధులు. 18  ఇశ్రాయేలీయులు లేచి దేవుని దగ్గర విచారణ చేయడానికి+ బేతేలుకు వెళ్లారు. వాళ్లు, “బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు నాయకత్వం వహించాలి?” అని అడిగారు. అందుకు యెహోవా, “యూదావాళ్లు నాయకత్వం వహించాలి” అని చెప్పాడు. 19  ఆ తర్వాత ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి గిబియాకు ఎదురుగా మకాం వేశారు. 20  అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి, బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి గిబియా దగ్గర యుద్ధ పంక్తులు తీరారు. 21  బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి, ఆ రోజు 22,000 మంది ఇశ్రాయేలీయుల్ని చంపారు. 22  అయితే ఇశ్రాయేలు సైన్యం ధైర్యాన్ని చూపిస్తూ, మొదటి రోజు యుద్ధ పంక్తులు తీరిన చోటే మళ్లీ యుద్ధ పంక్తులు తీరారు. 23  అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి, సాయంత్రం వరకు యెహోవా ఎదుట ఏడ్చారు; వాళ్లు, “మేము మా సహోదరులైన బెన్యామీనీయులతో మళ్లీ యుద్ధం చేయడానికి వెళ్లాలా?” అని యెహోవా దగ్గర విచారణ చేశారు.+ అందుకు యెహోవా, “వెళ్లండి” అని చెప్పాడు. 24  కాబట్టి ఇశ్రాయేలీయులు రెండో రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లారు. 25  రెండో రోజు కూడా బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి గిబియాలో నుండి బయటికి వచ్చి, కత్తులు ధరించిన 18,000 మంది ఇశ్రాయేలీయుల్ని చంపారు.+ 26  దాంతో ఇశ్రాయేలీయులందరూ బేతేలుకు వెళ్లారు. వాళ్లు అక్కడ యెహోవా ఎదుట కూర్చుని ఏడ్చారు;+ వాళ్లు ఆ రోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉండి+ యెహోవా ఎదుట దహనబలుల్ని,+ సమాధాన బలుల్ని+ అర్పించారు. 27  ఆ తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు,+ ఎందుకంటే ఆ రోజుల్లో సత్యదేవుని ఒప్పంద మందసం* అక్కడ ఉండేది. 28  అహరోను మనవడూ ఎలియాజరు కుమారుడూ అయిన ఫీనెహాసు+ ఆ రోజుల్లో మందసం ఎదుట సేవ చేస్తున్నాడు.* ఇశ్రాయేలీయులు, “మేము మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి మళ్లీ వెళ్లాలా, వద్దా?” అని అడిగారు.+ అందుకు యెహోవా, “వెళ్లండి, రేపు నేను వాళ్లను మీ చేతికి అప్పగిస్తాను” అని చెప్పాడు. 29  అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మనుషుల్ని మాటు వేయించారు.+ 30  ఇశ్రాయేలీయులు మూడో రోజు బెన్యామీనీయుల మీదికి వెళ్లారు. వాళ్లు అంతకుముందులాగే గిబియా ఎదురుగా యుద్ధ పంక్తులు తీరారు.+ 31  వీళ్లతో యుద్ధం చేయడానికి బెన్యామీనీయులు బయటికి వచ్చినప్పుడు, వాళ్లు నగరం నుండి దూరంగా తీసుకెళ్లబడ్డారు.+ అప్పుడు బెన్యామీనీయులు ఇంతకుముందులాగే రహదారుల్లో దాడిచేస్తూ, కొంతమందిని చంపడం మొదలుపెట్టారు. వాటిలో ఒక రహదారి బేతేలుకు వెళ్లేది, మరొకటి గిబియాకు వెళ్లేది. పొలంలో వాళ్లు దాదాపు 30 మంది ఇశ్రాయేలీయుల్ని చంపారు.+ 32  కాబట్టి బెన్యామీనీయులు, “వాళ్లు ఇంతకుముందులాగే మన ఎదుట ఓడిపోతున్నారు”+ అని అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు, “మనం పారిపోయి, వాళ్లను నగరం నుండి దూరంగా రహదారుల్లోకి రప్పిద్దాం” అని చెప్పుకున్నారు. 33  కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ స్థానాల్లో నుండి లేచి బయల్తామారు దగ్గర యుద్ధ పంక్తులు తీరారు. అదే సమయంలో మాటు వేసిన ఇశ్రాయేలీయులు గిబియా సమీపంలో తామున్న చోటు నుండి బయటికి దూసుకొచ్చారు. 34  అలా ఇశ్రాయేలు మొత్తంలో ఎంపికచేయబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చారు, అప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. కానీ విపత్తు పొంచివుందని బెన్యామీనీయులకు తెలీదు. 35  యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట బెన్యామీనీయుల్ని ఓడించాడు.+ ఆ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనులో 25,100 మందిని చంపారు, వాళ్లందరూ కత్తులు ధరించినవాళ్లే.+ 36  అయితే ఇశ్రాయేలీయులు తమ ఎదుట నుండి పారిపోతున్నప్పుడు, వాళ్లు ఓడిపోతారని బెన్యామీనీయులు అనుకొన్నారు.+ కానీ ఇశ్రాయేలీయులు, గిబియా దగ్గర మాటువేసి ఉంచిన వాళ్లమీద నమ్మకంతో పారిపోయారు.+ 37  మాటు వేసినవాళ్లు వెంటనే గిబియా వైపు దూసుకెళ్లారు. తర్వాత వాళ్లు అన్నివైపులా వెళ్లి, నగరంలోని ప్రజలందర్నీ కత్తితో చంపారు. 38  మాటు వేసినవాళ్లు నగరం నుండి పొగ పైకి వచ్చేలా చేసి తమకు సంకేతమిచ్చేలా ఇశ్రాయేలీయులు ముందే ఏర్పాటు చేసుకున్నారు. 39  ఇశ్రాయేలీయులు యుద్ధం నుండి పారిపోయినప్పుడు, బెన్యామీనీయులు దాడి చేయడం మొదలుపెట్టి, దాదాపు 30 మంది ఇశ్రాయేలీయుల్ని చంపారు.+ “ఇంతకుముందు యుద్ధంలోలాగే వాళ్లు మళ్లీ మన ముందు ఓడిపోతున్నారు చూడండి”+ అని వాళ్లు అనుకున్నారు. 40  అయితే దట్టమైన పొగ, సంకేతంలా నగరం నుండి పైకి లేవడం మొదలైంది. బెన్యామీనీయులు వెనక్కి తిరిగి చూసినప్పుడు, నగరమంతా తగలబడుతూ ఉంది, మంటలు ఆకాశం వైపు లేస్తున్నాయి. 41  అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి బెన్యామీనీయుల మీద దాడిచేయడం మొదలుపెట్టారు, దాంతో విపత్తు ముంచుకొచ్చిందని అర్థమై వాళ్లు భయపడ్డారు. 42  కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఎడారివైపు పారిపోయారు; కానీ ఇశ్రాయేలీయులు వాళ్లను తరిమారు. నగరాల్లో నుండి వస్తున్న ఇశ్రాయేలీయులు కూడా వాళ్లతో కలిసి బెన్యామీనీయుల్ని చంపారు. 43  వాళ్లు బెన్యామీనీయుల్ని అన్నివైపులా చుట్టుముట్టి, తరుముతూ ఉన్నారు. వాళ్లు తూర్పు వైపున గిబియాకు ఎదురుగా బెన్యామీనీయుల్ని తొక్కేశారు. 44  చివరికి 18,000 మంది బెన్యామీనీయులు చనిపోయారు, వాళ్లందరూ బలమైన యోధులు.+ 45  మిగిలిన బెన్యామీనీయులు తిరిగి, ఎడారిలోని రిమ్మోను బండ దగ్గరికి పారిపోయారు.+ ఇశ్రాయేలీయులు రహదారుల్లో 5,000 మంది బెన్యామీనీయుల్ని చంపారు; అంతేకాదు వాళ్లు బెన్యామీనీయుల్ని గిదోము దాకా తరుముకుంటూ వెళ్లి మరో 2,000 మందిని చంపారు. 46  ఆ రోజున 25,000 మంది బెన్యామీనీయులు చనిపోయారు, వాళ్లందరూ కత్తులు ధరించిన బలమైన యోధులు.+ 47  కానీ 600 మంది బెన్యామీనీయులు ఎడారిలోని రిమ్మోను బండ దగ్గరికి పారిపోయారు. వాళ్లు అక్కడే నాలుగు నెలలు నివసించారు. 48  ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి బెన్యామీనీయుల మీదికి వచ్చి, నగరంలో ఉన్న వాళ్లను కత్తితో చంపారు; మిగిలిన సమస్తాన్ని, అంటే మనుషుల్ని, పశువుల్ని చంపారు. అంతేకాదు వాళ్లు తమ మార్గంలో ఉన్న నగరాలన్నిటినీ తగలబెట్టారు.

అధస్సూచీలు

అక్ష., “ఒక్క మనిషిలా.”
లేదా “జమీందారులు” అయ్యుంటుంది.
అక్ష., “ఒక్క మనిషిలా.”
పదకోశం చూడండి.
అక్ష., “ఒక్క మనిషిలా.”
లేదా “పెద్దపెట్టె.”
అక్ష., “నిలబడుతున్నాడు.”