న్యాయాధిపతులు 21:1-25
-
బెన్యామీను గోత్రం నాశనంకాకుండా కాపాడడం (1-25)
21 అప్పుడు ఇశ్రాయేలీయులు, తమలో ఎవ్వరూ తమ కూతుర్ని బెన్యామీనీయులకు ఇచ్చి పెళ్లిచేయకూడదు+ అని మిస్పాలో ఒట్టు పెట్టుకున్నారు.+
2 తర్వాత, ప్రజలు బేతేలుకు వచ్చి+ అక్కడ సత్యదేవుని ముందు సాయంత్రం వరకు కూర్చుని, పెద్దగా ఏడుస్తూ ఉన్నారు.
3 వాళ్లు ఇలా అన్నారు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలులో ఇలాంటిది ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలులో నుండి ఒక గోత్రం లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది?”
4 తర్వాతి రోజు, ప్రజలు ఉదయాన్నే లేచి దహనబలుల్ని, సమాధాన బలుల్ని+ అర్పించడానికి అక్కడ ఒక బలిపీఠం కట్టారు.
5 అప్పుడు ఇశ్రాయేలీయులు, “మనతోపాటు యెహోవా ఎదుట సమకూడడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో ఎవరెవరు రాలేదు?” అని అడిగారు. ఎందుకంటే తమతోపాటు మిస్పాలో యెహోవా దగ్గరికి రానివాళ్లు ఖచ్చితంగా చంపబడతారని వాళ్లు ఒట్టు పెట్టుకున్నారు.
6 తమ సహోదరులైన బెన్యామీనీయులకు జరిగింది చూసి ఇశ్రాయేలీయులు బాధపడ్డారు. వాళ్లు ఇలా అన్నారు: “ఈ రోజు ఇశ్రాయేలులో నుండి ఒక గోత్రం కొట్టివేయబడింది.
7 మన కూతుళ్లలో ఎవ్వర్నీ వాళ్లకు భార్యలుగా ఇవ్వకూడదని+ మనం యెహోవా పేరున ప్రమాణం చేశాం+ కదా, మరిప్పుడు వాళ్లలో మిగిలినవాళ్లకు మనం భార్యల్ని ఎలా తేవాలి?”
8 అప్పుడు వాళ్లు, “ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎవరెవరు మిస్పాలో యెహోవా ఎదుటికి రాలేదు?”+ అని అడిగారు. అయితే, యాబేష్గిలాదు నుండి ఎవ్వరూ సమాజం ఉన్న పాలేనికి రాలేదు.
9 ప్రజల్ని లెక్కపెట్టినప్పుడు అక్కడ యాబేష్గిలాదు నివాసుల్లో ఒక్కరు కూడా లేరని గమనించారు.
10 కాబట్టి ఇశ్రాయేలీయుల సమాజం అత్యంత బలవంతులైన 12,000 మందిని అక్కడికి పంపించారు. వాళ్లకు ఇలా ఆజ్ఞాపించారు: “మీరు వెళ్లి యాబేష్గిలాదు నివాసుల్ని కత్తితో చంపండి, స్త్రీలను, పిల్లల్ని కూడా విడిచిపెట్టొద్దు.+
11 మీరు ఏం చేయాలంటే, ఆ నగరంలోని ప్రతీ పురుషుణ్ణి, కన్య కాని ప్రతీ స్త్రీని చంపేయాలి.”
12 వాళ్లు యాబేష్గిలాదు నివాసుల్లో పురుషునితో ఎన్నడూ లైంగిక సంబంధాలు పెట్టుకోని 400 మంది కన్యల్ని కనుగొన్నారు. వాళ్లు ఆ అమ్మాయిల్ని కనాను దేశంలోని షిలోహులో+ ఉన్న పాలేనికి తీసుకొచ్చారు.
13 అప్పుడు సమాజమంతా, రిమ్మోను బండ దగ్గరున్న బెన్యామీనీయులతో+ శాంతి కుదుర్చుకుందామని వాళ్లకు సందేశం పంపించింది.
14 కాబట్టి బెన్యామీనీయులు ఆ సమయంలో వెనక్కి వచ్చారు. ఇశ్రాయేలీయులు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవాళ్లను+ బెన్యామీనీయులకు ఇచ్చారు, అయితే ఆ స్త్రీలు వాళ్లందరికీ సరిపోలేదు.
15 బెన్యామీనీయులకు జరిగినదాన్ని చూసి ప్రజలు బాధపడ్డారు.+ ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలులోని మిగతా గోత్రాల నుండి ఆ గోత్రాన్ని వేరు చేశాడు.
16 అప్పుడు సమాజ పెద్దలు, “బెన్యామీనులో స్త్రీలందరూ నాశనమయ్యారు కదా, మరి మిగిలినవాళ్లకు భార్యల్ని ఇవ్వడానికి మనమేం చేయాలి?” అన్నారు.
17 తర్వాత వాళ్లు ఇలా అన్నారు: “ఇశ్రాయేలు నుండి ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండా మిగిలిన బెన్యామీనీయులకు స్వాస్థ్యం ఉండాలి.
18 కానీ మనం మన కూతుళ్లను వాళ్లకు భార్యలుగా ఇవ్వలేం; ఎందుకంటే, ‘బెన్యామీనీయులకు భార్యను ఇచ్చేవాడు శపించబడినవాడు’ అని ఇశ్రాయేలీయులు ఒట్టు పెట్టుకున్నారు.”+
19 అప్పుడు వాళ్లు ఇలా అన్నారు: “ఇదిగో! బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే రహదారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో+ ప్రతీ సంవత్సరం యెహోవాకు ఒక పండుగ జరుగుతుంది.”
20 కాబట్టి వాళ్లు బెన్యామీనీయుల్ని ఇలా ఆజ్ఞాపించారు: “మీరు వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కొని ఉండండి.
21 షిలోహు యువతులు వచ్చి నాట్యం* చేయడం మీరు చూసినప్పుడు, మీలో ప్రతీ ఒక్కరు ద్రాక్షతోటల్లో నుండి బయటికి వచ్చి షిలోహు యువతుల్లో ఒకర్ని భార్యగా పట్టుకోవాలి, తర్వాత మీరు బెన్యామీను ప్రాంతానికి వెళ్లిపోవాలి.
22 వాళ్ల తండ్రులు గానీ సహోదరులు గానీ ఫిర్యాదు చేయడానికి మా దగ్గరికి వస్తే, మేము వాళ్లకు ఇలా చెప్తాం: ‘మేము యుద్ధం చేసి వాళ్లలో ప్రతీ ఒక్కరికి భార్యను ఇవ్వలేకపోయాం,+ కాబట్టి వాళ్ల విషయంలో మామీద దయ చూపించండి; పైగా మీ అంతట మీరే మీ కూతుళ్లను వాళ్లకు ఇస్తే, మీరు ఒట్టు మీరినట్టు అవుతుంది.’ ”+
23 వాళ్లు చెప్పినట్టే బెన్యామీనీయులు చేశారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు నాట్యం చేస్తున్న స్త్రీలలో నుండి ఒకర్ని భార్యగా ఎత్తుకెళ్లారు. తర్వాత వాళ్లు తమ స్వాస్థ్యానికి తిరిగెళ్లి, తమ నగరాల్ని మళ్లీ కట్టుకుని+ వాటిలో స్థిరపడ్డారు.
24 అప్పుడు ఇశ్రాయేలీయుల్లో ప్రతీ ఒక్కరు అక్కడి నుండి వాళ్లవాళ్ల గోత్రాలకు, వాళ్లవాళ్ల కుటుంబాలకు వెళ్లిపోయారు. ప్రతీ ఒక్కరు అక్కడి నుండి తమ స్వాస్థ్యానికి బయల్దేరారు.
25 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు.+ ప్రతీ ఒక్కరు తమ దృష్టికి ఏది సరైనది అనిపిస్తే అది చేస్తున్నారు.
అధస్సూచీలు
^ లేదా “గుండ్రంగా తిరుగుతూ నాట్యం.”