పరమగీతం 3:1-11

  • యువతి (1-5)

    • ‘రాత్రివేళ నా ప్రియుడి కోసం వెదికాను’ (1)

  • సీయోను కూతుళ్లు (6-11)

    • సొలొమోను ఊరేగింపు వర్ణన

3  “రాత్రివేళ నేను పడుకుని నా ప్రాణ ప్రియుడి+ గురించి ఆలోచించాను.నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.+   నేను ఇలా అనుకున్నాను:‘నేను లేచి నగరమంతా తిరుగుతాను;వీధుల్లో, సంతవీధుల్లో నా ప్రాణ ప్రియుడి కోసం వెదుకుతాను.’ నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.   నగరంలో గస్తీ తిరుగుతున్న కావలివాళ్లు నాకు ఎదురుపడ్డారు.+ ‘మీరు నా ప్రాణ ప్రియుణ్ణి చూశారా?’ అని వాళ్లను అడిగాను.   నేను వాళ్లను అలా దాటానో లేదోనా ప్రాణ ప్రియుడు నాకు కనిపించాడు. నేను అతన్ని వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకుని,మా అమ్మ ఇంట్లోకి,నన్ను కన్న తల్లి గదిలోకి తీసుకొచ్చాను.+   యెరూషలేము కూతుళ్లారా,కొండజింకల మీద, మైదానంలోని లేళ్ల మీద మీతో ఒట్టు వేయిస్తున్నాను: ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.”+   “పొగ స్తంభాల్లా ఎడారి* నుండి వస్తున్న అది ఏమిటి?బోళంతో, సాంబ్రాణితో, వ్యాపారస్థులు అమ్మే పరిమళ చూర్ణాలన్నిటితో+గుబాళిస్తూ వస్తున్న అది ఏమిటి?”   “అది సొలొమోను పల్లకి! ఇశ్రాయేలు శూరుల్లో అరవై మంది యోధులు+ దాని చుట్టూ ఉన్నారు,   వాళ్లంతా ఖడ్గం ధరించివున్నారు,వాళ్లు యుద్ధంలో రాటుదేలినవాళ్లు,రాత్రివేళ కలిగే అపాయాల నుండి కాపాడడానికివాళ్లలో ప్రతీ ఒక్కరు ఖడ్గం ధరించివున్నారు.”   “అది సొలొమోను రాజు లెబానోను చెట్ల మ్రానుతో+తనకోసం చేయించుకున్న రాచపల్లకి. 10  దాని స్తంభాలు వెండివి,దాని ఆధారాలు బంగారువి. దాని ఆసనం ఊదారంగు ఉన్నితో చేయబడింది;దాని లోపలి భాగాన్ని యెరూషలేము కూతుళ్లు ప్రేమతో అలంకరించారు.” 11  “సీయోను కూతుళ్లారా, వెళ్లి,కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడండి;అది అతని పెళ్లి రోజున,అతని హృదయం సంతోషంగా ఉన్న రోజునవాళ్ల అమ్మ+ పెట్టిన పెళ్లి కిరీటం.”*

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “పూల కిరీటం.”