యోహానుకు ఇచ్చిన ప్రకటన 11:1-19

  • ఇద్దరు సాక్షులు (1-13)

    • గోనెపట్ట కట్టుకొని 1,260 రోజులు ప్రవచించడం (3)

    • చంపేసి, పాతిపెట్టకుండా వదిలేయడం (7-10)

    • మూడున్నర రోజుల తర్వాత మళ్లీ బ్రతికించబడడం (11, 12)

  • రెండో కష్టం పోయింది, మూడోది వస్తోంది (14)

  • ఏడో బూర (15-19)

    • మన దేవునికి, ఆయన క్రీస్తుకు చెందిన రాజ్యం (15)

    • భూమిని నాశనం చేస్తున్నవాళ్లు నాశనం చేయబడతారు (18)

11  ఆయన నాతో ఈ మాటలు అంటున్నప్పుడు, కొలవడానికి నాకొక రెల్లుకర్ర*+ ఇవ్వబడింది: “నువ్వు లేచి దేవుని ఆలయాన్ని, బలిపీఠాన్ని కొలువు; అందులో ఆరాధించేవాళ్లను లెక్కపెట్టు.  అయితే ఆలయం బయట ఉన్న ప్రాంగణాన్ని పూర్తిగా వదిలేయి, దాన్ని కొలవద్దు. ఎందుకంటే అది అన్యజనులకు ఇవ్వబడింది, వాళ్లు పవిత్ర నగరాన్ని+ 42 నెలల పాటు+ కాళ్లతో తొక్కుతారు.  నేను నా ఇద్దరు సాక్షుల్ని పంపిస్తాను, వాళ్లు గోనెపట్ట కట్టుకొని 1,260 రోజులు ప్రవచిస్తారు.”  ఆ ఇద్దరు సాక్షులు రెండు ఒలీవ చెట్లను,+ రెండు దీపస్తంభాల్ని+ సూచిస్తున్నారు, వాళ్లు భూమికి ప్రభువైన వ్యక్తి ముందు నిలబడి ఉన్నారు.+  ఎవరైనా ఆ ఇద్దరు సాక్షులకు హాని చేయాలనుకుంటే, వాళ్ల నోళ్లలో నుండి అగ్ని వచ్చి ఆ శత్రువుల్ని కాల్చేస్తుంది. వాళ్లకు హాని చేయాలని ఎవరైనా అనుకుంటే, అతను ఈ విధంగా చంపబడాలి.  వాళ్లు ప్రవచిస్తున్న రోజుల్లో అసలు వర్షమే పడకుండా+ ఆకాశాన్ని* మూసివేసే శక్తి+ వాళ్లకు ఉంది. అంతేకాదు, నీళ్లను రక్తంగా మార్చే+ శక్తి, తాము అనుకున్నప్పుడల్లా భూమ్మీదికి రకరకాల తెగుళ్లను రప్పించే శక్తి వాళ్లకు ఉంది.  ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యమివ్వడం పూర్తయినప్పుడు, అగాధం నుండి పైకి వచ్చిన క్రూరమృగం వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను జయిస్తుంది, వాళ్లను చంపుతుంది.+  వాళ్ల శవాలు మహానగర ప్రధాన వీధిలో పడివుంటాయి. ఆ నగరానికి అలంకారికంగా సొదొమ, ఐగుప్తు* అనే పేర్లు ఉన్నాయి. వాళ్ల ప్రభువు కూడా అక్కడే కొయ్య మీద మరణశిక్ష పొందాడు.  వేర్వేరు జాతులకు, తెగలకు, భాషలకు, దేశాలకు చెందిన ప్రజలు ఆ శవాల్ని మూడున్నర రోజుల పాటు+ చూస్తారు; వాళ్లు వాటిని పాతిపెట్టనివ్వరు. 10  ఆ ఇద్దరు ప్రవక్తలు తమ సందేశంతో భూమ్మీదున్న ప్రజలకు వేదన కలిగించారు కాబట్టి వాళ్లు చనిపోయినందుకు ప్రజలు సంతోషంతో వేడుకలు జరుపుకుంటారు, ఒకరికొకరు బహుమతులు పంపుకుంటారు. 11  ఆ మూడున్నర రోజుల తర్వాత, దేవుని దగ్గర నుండి జీవశక్తి వచ్చి ఆ ఇద్దరిలోకి ప్రవేశించింది.+ దాంతో వాళ్లు లేచి నిలబడ్డారు, వాళ్లను చూసిన ప్రజలు ఎంతో భయపడ్డారు. 12  ఆకాశం నుండి ఒక పెద్ద స్వరం, “ఇక్కడికి పైకి రండి” అని తమతో చెప్పడం వాళ్లు విన్నారు. కాబట్టి వాళ్లు మేఘంలో ఆకాశానికి వెళ్లారు, వాళ్ల శత్రువులు వాళ్లను చూశారు.* 13  ఆ క్షణమే* పెద్ద భూకంపం వచ్చింది, దానివల్ల ఆ నగరంలో పదోభాగం కూలిపోయింది. భూకంపం వల్ల 7,000 మంది చనిపోయారు. మిగిలినవాళ్లు చాలా భయపడిపోయి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపర్చారు. 14  రెండో కష్టం+ పోయింది. ఇదిగో! మూడో కష్టం త్వరగా వస్తోంది. 15  ఏడో దేవదూత తన బాకా ఊదాడు.+ అప్పుడు పరలోకంలో పెద్ద స్వరాలు ఇలా చెప్పాయి: “ఈ లోక రాజ్యం మన దేవునిది,+ ఆయన క్రీస్తుది+ అయింది. దేవుడు యుగయుగాలు రాజుగా పరిపాలిస్తాడు.”+ 16  అప్పుడు, దేవుని ముందు తమ సింహాసనాల్లో కూర్చొని ఉన్న ఆ 24 మంది పెద్దలు+ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ 17  ఇలా అన్నారు: “యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా, ఇప్పుడూ+ గతంలోనూ ఉన్నవాడా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే, నీ గొప్ప శక్తిని ఉపయోగించి నువ్వు రాజుగా పరిపాలించడం మొదలుపెట్టావు.+ 18  దేశాలు ఆగ్రహించినందువల్ల నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయినవాళ్లు తీర్పుపొందడానికి; నీ దాసులైన ప్రవక్తలకు,+ పవిత్రులకు, సామాన్యులే గానీ గొప్పవాళ్లే గానీ నీ పేరుకు భయపడేవాళ్లకు ప్రతిఫలం ఇవ్వడానికి;+ భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేయడానికి+ నిర్ణయించిన సమయం వచ్చింది.” 19  తర్వాత, పరలోకంలో ఉన్న దేవుని ఆలయం* తెరవబడింది. అక్కడున్న ఒప్పంద* మందసం* నాకు కనిపించింది.+ అప్పుడు మెరుపులు, ఉరుములు, భూకంపం, పెద్ద వడగండ్ల వర్షం వచ్చాయి; స్వరాలు వినిపించాయి.

అధస్సూచీలు

లేదా “కొలకర్ర.”
లేదా “పరలోకాన్ని.”
లేదా “ఈజిప్టు.”
లేదా “చూస్తూ ఉన్నారు.”
అక్ష., “ఆ గంటలోనే.”
అనుబంధం A5 చూడండి.
అంటే, ఆలయంలోని అతి పవిత్ర స్థలం.
లేదా “నిబంధన.”
లేదా “పెద్దపెట్టె.”