యోహానుకు ఇచ్చిన ప్రకటన 22:1-21
22 తర్వాత ఆ దేవదూత నాకు జీవజలాల నదిని+ చూపించాడు. ఆ నది స్ఫటికంలా స్పష్టంగా ఉంది. అది దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం నుండి ప్రవహిస్తోంది.
2 ఆ నది, నగర ముఖ్యవీధి మధ్యలో ప్రవహిస్తోంది. నదికి రెండువైపులా జీవవృక్షాలు ఉన్నాయి. అవి ప్రతీనెల ఫలిస్తూ సంవత్సరానికి 12 కాపులు కాస్తున్నాయి. ఆ వృక్షాల ఆకులు దేశాల్ని స్వస్థపర్చడం కోసం ఉన్నాయి.+
3 ఇక ఎప్పటికీ ఆ నగరం మీద శాపం అనేదే ఉండదు. అయితే దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం+ ఆ నగరంలో ఉంటుంది. దేవుని దాసులు ఆయనకు పవిత్రసేవ చేస్తారు.
4 వాళ్లు ఆయన ముఖం చూస్తారు,+ ఆయన పేరు వాళ్ల నొసళ్ల మీద ఉంటుంది.
5 అంతేకాదు, రాత్రి ఇక ఉండదు. దీపకాంతి గానీ సూర్యకాంతి గానీ వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే యెహోవా* దేవుడే వాళ్లమీద వెలుగు ప్రసరిస్తాడు.+ వాళ్లు యుగయుగాలు రాజులుగా పరిపాలిస్తారు.+
6 ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి,* సత్యమైనవి.+ అవును, ప్రవక్తల్ని ప్రేరేపించిన యెహోవా* దేవుడే,+ త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపించాడు.
7 ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను.+ ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని పాటించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”+
8 యోహాను అనే నేను ఈ విషయాలు విన్నాను, చూశాను. నేను వాటిని విన్నప్పుడు, చూసినప్పుడు నాకు వాటిని చూపించిన దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను.
9 అయితే అతను నాతో ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే, ప్రవక్తలైన నీ సహోదరుల్లాగే, ఈ గ్రంథపు చుట్టలోని మాటల్ని పాటిస్తున్న వాళ్లలాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు.”+
10 అతను నాతో ఇంకా ఇలా అన్నాడు: “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని రహస్యంగా ఉంచొద్దు. ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గర్లో ఉంది.
11 అన్యాయస్థుణ్ణి అన్యాయంగానే నడుచుకోనివ్వు, అపవిత్రుణ్ణి అపవిత్రంగానే నడుచుకోనివ్వు; అయితే, నీతిమంతుణ్ణి నీతిగానే నడుచుకోనివ్వు, పవిత్రుణ్ణి పవిత్రంగానే నడుచుకోనివ్వు.
12 “ ‘ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను. నేనిచ్చే బహుమతి నా దగ్గరే ఉంది. నేను ప్రతీ ఒక్కరికి వాళ్ల పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాను.+
13 నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ మొదటివాణ్ణి, చివరివాణ్ణి; ఆరంభాన్ని, ముగింపును.
14 తమ వస్త్రాలు ఉతుక్కున్న వాళ్లు+ సంతోషంగా ఉంటారు. వాళ్లకు జీవవృక్షాల దగ్గరికి వెళ్లే అధికారం ఉంటుంది,+ వాళ్లు గుమ్మాల+ ద్వారా నగరంలోకి వెళ్లగలుగుతారు.
15 అయితే కుక్కల లాంటివాళ్లు,* మంత్రతంత్రాలు చేసేవాళ్లు, లైంగిక పాపం* చేసేవాళ్లు, హంతకులు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాలాడే ప్రతీ ఒక్కరు నగరం బయట ఉంటారు.’+
16 “ ‘యేసు అనే నేను, సంఘాల ప్రయోజనం కోసం ఈ విషయాల గురించి మీకు సాక్ష్యమివ్వడానికి నా దూతను పంపించాను. నేను దావీదు వేరును, దావీదు సంతానాన్ని;+ ప్రకాశవంతమైన వేకువ చుక్కను.’ ”+
17 పవిత్రశక్తి, పెళ్లికూతురు,+ “రండి!” అని అంటూ ఉన్నారు. దాన్ని వింటున్నవాళ్లు ఎవరైనా సరే “రండి!” అని చెప్పాలి. దాహంగా ఉన్న ఎవరినైనా సరే రానివ్వండి.+ ఇష్టమున్న ఎవరినైనా ఉచితంగా జీవజలాలు తాగనివ్వండి.+
18 “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని వినే ప్రతీ ఒక్కరికి నేను సాక్ష్యమిస్తున్నాను: వీటికి ఎవరైనా ఏదైనా కలిపితే,+ ఈ గ్రంథపు చుట్టలో రాసివున్న తెగుళ్లను దేవుడు అతని మీదికి రప్పిస్తాడు.+
19 ఎవరైనా ఈ ప్రవచనానికి సంబంధించిన గ్రంథపు చుట్టలోని మాటల్లో నుండి ఏదైనా తీసేస్తే, దేవుడు అతన్ని ఈ గ్రంథపు చుట్టలో వర్ణించిన మంచివాటిని పొందనివ్వడు. అంటే దేవుడు అతన్ని జీవవృక్షాల పండ్లు+ తిననివ్వడు, పవిత్ర నగరంలో+ అడుగుపెట్టనివ్వడు.
20 “ఈ విషయాల గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తి ఇలా అంటున్నాడు: ‘అవును, నేను త్వరగా వస్తున్నాను.’ ”+
“ఆమేన్! ప్రభువైన యేసూ, రా.”
21 యేసు ప్రభువు అపారదయ పవిత్రులకు తోడుండాలి.
అధస్సూచీలు
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “నమ్మకమైనవి.”
^ అనుబంధం A5 చూడండి.
^ ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.
^ అంటే, ఎవరి పనులైతే దేవుని దృష్టికి అసహ్యంగా ఉన్నాయో వాళ్లు.