ఫిలేమోను 1:1-25

  • శుభాకాంక్షలు (1-3)

  • ఫిలేమోను ప్రేమ, విశ్వాసం (4-7)

  • ఒనేసిము కోసం పౌలు విన్నపం (8-22)

  • చివర్లో శుభాకాంక్షలు (23-25)

 క్రీస్తుయేసు కోసం ఖైదీగా ఉన్న పౌలు+ అనే నేను, మన సహోదరుడు తిమోతి+ మా ప్రియమైన తోటి పనివాడు ఫిలేమోనుకు,  మా సహోదరి అప్ఫియకు, మా తోటి సైనికుడు అర్ఖిప్పుకు,+ మీ ఇంట్లో సమకూడే సంఘానికి+ రాస్తున్న ఉత్తరం:  మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  నేను నా ప్రార్థనల్లో నిన్ను గుర్తుచేసుకున్న ప్రతీసారి నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను.+  ఎందుకంటే నీ విశ్వాసం గురించీ ప్రభువైన యేసు మీద, పవిత్రులందరి మీద నీకున్న ప్రేమ గురించీ నేను వింటూ ఉన్నాను.  నువ్వు ఏ విశ్వాసంలో అయితే ఇతరులతోపాటు భాగస్థుడిగా ఉన్నావో ఆ విశ్వాసం, క్రీస్తు ద్వారా మనం పొందిన ప్రతీ దీవెనను గుర్తించేలా నిన్ను కదిలించాలని ప్రార్థిస్తున్నాను.  ఎందుకంటే సహోదరుడా, నీవల్ల పవిత్రుల హృదయాలు సేదదీరాయి; కాబట్టి నీ ప్రేమ గురించి విన్నప్పుడు నాకెంతో ఆనందం, ఊరట కలిగాయి.  అందుకే, సరైనది చేయమని క్రీస్తు పేరున నిన్ను ఆజ్ఞాపించే అధికారం* నాకున్నా సరే,  నేను ప్రేమతో నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే, పౌలు అనే నేను వృద్ధుణ్ణి, ఇప్పుడు క్రీస్తుయేసు కోసం ఖైదీగా ఉన్నాను. 10  నా కుమారుడైన ఒనేసిము+ కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. చెరసాలలో* ఉన్నప్పుడు నేను అతనికి తండ్రినయ్యాను.+ 11  గతంలో అతను నీకు పనికిరానివాడే; కానీ ఇప్పుడు నీకు, నాకు పనికొచ్చేవాడు. 12  అతన్ని, అవును నా ప్రాణాన్ని తిరిగి నీ దగ్గరికి పంపిస్తున్నాను. 13  మంచివార్త కోసం నేను ఖైదీగా ఉన్న సమయంలో+ అతను నీ స్థానంలో నాకు సేవలు చేసేలా అతన్ని నా దగ్గరే ఉంచుకోవాలనుంది. 14  కానీ, నిన్ను అడగకుండా నేను ఏదీ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే, నువ్వు చేసే మేలు బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా చేసేదై ఉండాలని+ నా ఉద్దేశం. 15  బహుశా ఎప్పటికీ నీ దగ్గర ఉండడానికేనేమో అతను కొంతకాలం* నీకు దూరమయ్యాడు. 16  అయితే అతను ఇకమీదట నీకు దాసుడిగా కాదుగానీ+ అంతకన్నా ఎక్కువైనవాడిగా, అంటే ప్రియమైన సహోదరుడిగా ఉంటాడు.+ ముఖ్యంగా నాకు అతను ప్రియమైనవాడు, కానీ ఒక దాసుడిగా, ప్రభువు శిష్యుడిగా నీకు ఇంకెంతో ప్రియమైనవాడు. 17  కాబట్టి, నేను నీ స్నేహితుణ్ణని నువ్వు అనుకుంటే, నన్ను ఎలా చేర్చుకుంటావో అతన్ని కూడా అలాగే దయతో చేర్చుకో. 18  అతను నీకేమైనా నష్టం చేసి ఉంటే లేదా బాకీ ఉంటే, అది నా ఖాతాలో రాయి. 19  పౌలు అనే నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను, అది నేను తీరుస్తాను. అయినా, నువ్వు నీ జీవితమే నాకు బాకీ ఉన్నావని వేరే చెప్పక్కర్లేదు. 20  అవును సహోదరుడా, ప్రభువు పేరున నీ నుండి ఈ సహాయం పొందాలని అనుకుంటున్నాను. క్రీస్తు పేరున నా హృదయాన్ని సేదదీర్చు. 21  నువ్వు నా మాట వింటావనే నమ్మకంతో రాస్తున్నాను, నేను అడిగినదాని కన్నా నువ్వు ఇంకా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. 22  అలాగే, నేను ఉండడానికి ఏర్పాట్లు చేయి. ఎందుకంటే, మీ ప్రార్థనలు ఫలించి నేను మీ దగ్గరికి వస్తానని* అనుకుంటున్నాను.+ 23  క్రీస్తుయేసు కోసం నా తోటి ఖైదీగా ఉన్న ఎపఫ్రా+ నీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. 24  అలాగే నా తోటి పనివాళ్లయిన మార్కు, అరిస్తార్కు,+ దేమా,+ లూకా+ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. 25  ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి.

అధస్సూచీలు

లేదా “ధైర్యం.”
అక్ష., “సంకెళ్లతో.”
అక్ష., “ఒక గంట.”
లేదా “మీకోసం విడుదలౌతానని.”