మత్తయి సువార్త 1:1-25
1 ఇది యేసుక్రీస్తు* జీవిత చరిత్ర* గురించిన పుస్తకం. ఆయన దావీదు కుమారుడు,+ దావీదు అబ్రాహాము కుమారుడు.+
2 అబ్రాహాము ఇస్సాకును కన్నాడు;*+ఇస్సాకు యాకోబును కన్నాడు;+యాకోబు యూదాను,+ అతని సహోదరుల్ని కన్నాడు;
3 యూదా తామారు ద్వారా పెరెసును, జెరహును కన్నాడు;+పెరెసు ఎస్రోనును కన్నాడు;+ఎస్రోను రామును కన్నాడు;+
4 రాము అమ్మీనాదాబును కన్నాడు;అమ్మీనాదాబు నయస్సోనును కన్నాడు;+నయస్సోను శల్మానును కన్నాడు;
5 శల్మాను రాహాబు+ ద్వారా బోయజును కన్నాడు;బోయజు రూతు ద్వారా ఓబేదును కన్నాడు;+ఓబేదు యెష్షయిని కన్నాడు;+
6 యెష్షయి రాజైన దావీదును కన్నాడు.+
దావీదు ఊరియా భార్య ద్వారా సొలొమోనును కన్నాడు;+
7 సొలొమోను రెహబామును కన్నాడు;+రెహబాము అబీయాను కన్నాడు;అబీయా ఆసాను కన్నాడు;+
8 ఆసా యెహోషాపాతును కన్నాడు;+యెహోషాపాతు యెహోరామును కన్నాడు;+యెహోరాము ఉజ్జియాను కన్నాడు;
9 ఉజ్జియా యోతామును కన్నాడు;+యోతాము ఆహాజును కన్నాడు;+ఆహాజు హిజ్కియాను కన్నాడు;+
10 హిజ్కియా మనష్షేను కన్నాడు;+
మనష్షే ఆమోనును కన్నాడు;+ఆమోను యోషీయాను కన్నాడు;+
11 యూదులు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన కాలంలో+ యోషీయా+ యెకొన్యాను,+ అతని సహోదరుల్ని కన్నాడు.
12 బబులోనుకు వెళ్లిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కన్నాడు;షయల్తీయేలు జెరుబ్బాబెలును కన్నాడు;+
13 జెరుబ్బాబెలు అబీహూదును కన్నాడు;అబీహూదు ఎల్యాకీమును కన్నాడు;ఎల్యాకీము అజోరును కన్నాడు;
14 అజోరు సాదోకును కన్నాడు;సాదోకు ఆకీమును కన్నాడు;ఆకీము ఎలీహూదును కన్నాడు;
15 ఎలీహూదు ఎలియాజరును కన్నాడు;ఎలియాజరు మత్తానును కన్నాడు;మత్తాను యాకోబును కన్నాడు;
16 యాకోబు, మరియ భర్తయైన యోసేపును కన్నాడు; మరియకు యేసు పుట్టాడు.+ ఈ యేసే క్రీస్తు అయ్యాడు.+
17 అబ్రాహాము నుండి దావీదు వరకు 14 తరాలు; దావీదు నుండి యూదులు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం వరకు 14 తరాలు; బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడిన సమయం నుండి క్రీస్తు వరకు 14 తరాలు.
18 యేసుక్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లి మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయమైంది; కానీ వాళ్లకు ఇంకా పెళ్లి కాకముందే మరియ పవిత్రశక్తి* ద్వారా గర్భవతి అయ్యింది.+
19 అయితే ఆమె భర్త యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను అందరిముందు అవమానించడం ఇష్టంలేక, ఆమెకు రహస్యంగా విడాకులు ఇవ్వాలనుకున్నాడు.+
20 అతను ఈ విషయాల గురించి ఆలోచించి నిద్రపోయాక, ఇదిగో! యెహోవా* దూత కలలో అతనికి కనిపించి ఇలా అన్నాడు: “దావీదు కుమారుడివైన యోసేపూ, నీ భార్య మరియను ఇంటికి తెచ్చుకోవడానికి భయపడకు; ఎందుకంటే ఆమె పవిత్రశక్తి వల్లే గర్భవతి అయ్యింది.+
21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. నువ్వు ఆయనకు యేసు* అని పేరుపెట్టాలి,+ ఎందుకంటే ఆయన తన ప్రజల్ని వాళ్ల పాపాల నుండి రక్షిస్తాడు.”+
22 నిజానికి, యెహోవా* తన ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరడానికే ఇదంతా జరిగింది:
23 “ఇదిగో! కన్య గర్భవతి అయ్యి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.”+ ఆ పేరును అనువదిస్తే, “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.+
24 అప్పుడు యోసేపు నిద్రలేచి, యెహోవా* దూత తనకు చెప్పినట్టే చేశాడు, తన భార్యను ఇంటికి తెచ్చుకున్నాడు.
25 కానీ ఆమె కుమారుణ్ణి కనేంతవరకు+ యోసేపు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోలేదు. యోసేపు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు.+
అధస్సూచీలు
^ లేదా “వంశావళి.”
^ లేదా “మెస్సీయ.” “క్రీస్తు” అనేది ఒక బిరుదు, ఆ మాటకు “అభిషిక్తుడు” అని అర్థం.
^ లేదా “ఇస్సాకుకు తండ్రి అయ్యాడు.”
^ లేదా “చురుకైన శక్తి.”
^ ఈ అనువాదంలోని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, దేవుని పేరు అయిన “యెహోవా” 237 సార్లు కనిపిస్తుంది. వాటిలో ఇది మొదటిది. అనుబంధం A5 చూడండి.
^ హీబ్రూ భాషలో యేషూవ. ఆ పేరుకు, “యెహోవాయే రక్షణ” అని అర్థం.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.