మత్తయి సువార్త 12:1-50
-
యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-8)
-
చెయ్యి ఎండిపోయిన ఒకతను బాగవ్వడం (9-14)
-
దేవుని ప్రియమైన సేవకుడు (15-21)
-
పవిత్రశక్తితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం (22-30)
-
క్షమాపణ లేని పాపం (31, 32)
-
చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టి తెలుస్తుంది (33-37)
-
యోనాకు సంబంధించిన సూచన (38-42)
-
అపవిత్ర దూత తిరిగొచ్చినప్పుడు (43-45)
-
యేసు తల్లి, తమ్ముళ్లు (46-50)
12 ఒకసారి విశ్రాంతి రోజున* యేసు పంటచేలలో నుండి నడిచి వెళ్తున్నాడు. ఆయన శిష్యులకు ఆకలి వేయడంతో, ధాన్యం వెన్నులు తుంచి తినడం మొదలుపెట్టారు.+
2 అది చూసి పరిసయ్యులు ఆయనతో, “ఇదిగో! నీ శిష్యులు విశ్రాంతి రోజున చేయకూడని పని+ చేస్తున్నారు” అని అన్నారు.
3 దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దావీదుకు, అతని మనుషులకు ఆకలేసినప్పుడు దావీదు ఏమి చేశాడో మీరు చదవలేదా?+
4 అతను దేవుని మందిరంలోకి వెళ్లాడని, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప తాము తినకూడని+ సముఖపు రొట్టెల్ని*+ అతనూ, అతని మనుషులూ తిన్నారని మీరు చదవలేదా?
5 అంతేకాదు, విశ్రాంతి రోజున యాజకులు ఆలయంలో పని చేస్తారని, అయినా వాళ్లు తప్పు చేసినట్టు అవదని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?+
6 అయితే నేను మీతో చెప్తున్నాను, ఆలయంకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.+
7 ‘నేను కరుణనే కోరుకుంటున్నాను+ కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏంటో మీకు తెలిసుంటే,+ ఏ తప్పూ చేయనివాళ్లను దోషులని అనేవాళ్లు కాదు.
8 ఎందుకంటే, మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు.”+
9 యేసు అక్కడి నుండి వచ్చేశాక వాళ్ల సమాజమందిరంలోకి వెళ్లాడు.
10 ఇదిగో! చెయ్యి ఎండిపోయిన* ఒకతను అక్కడ ఉన్నాడు.+ కాబట్టి యేసు మీద నింద వేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఆయన్ని, “విశ్రాంతి రోజున బాగుచేయడం సరైనదేనా?” అని అడిగారు.+
11 ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి రోజున గుంటలో పడిపోతే, మీరు దాన్ని పట్టుకొని పైకి తీయరా?+
12 గొర్రె కన్నా మనిషి ఇంకెంత విలువైనవాడు! కాబట్టి విశ్రాంతి రోజున మంచిపని చేయడం సరైనదే.”
13 తర్వాత యేసు అతనితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతను చెయ్యి చాపాడు, అది బాగైంది.
14 కానీ పరిసయ్యులు బయటికి వెళ్లి, యేసును చంపడానికి ఆయన మీద కుట్రపన్నారు.
15 యేసు ఈ విషయం తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. చాలామంది ఆయన వెంట వెళ్లారు,+ ఆయన వాళ్లందర్నీ బాగుచేశాడు.
16 కానీ తానెవరో ఇతరులకు చెప్పొద్దని ఆయన వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+
17 యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరేలా ఆయన అలా చేశాడు:
18 “ఇదిగో! నేను ఎంచుకున్న నా ప్రియమైన సేవకుడు;+ ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను!*+ ఈయన మీద నా పవిత్రశక్తిని ఉంచుతాను,+ ఈయన న్యాయమంటే ఏమిటో దేశాలకు స్పష్టం చేస్తాడు.
19 ఈయన గొడవపడడు,+ గట్టిగా అరవడు, ఈయన స్వరం ముఖ్య వీధుల్లో వినిపించదు.
20 న్యాయాన్ని గెలిపించేవరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు.+
21 నిజానికి దేశాలు ఈయన పేరుమీద నమ్మకం పెట్టుకుంటాయి.”+
22 అప్పుడు వాళ్లు చెడ్డదూత* పట్టిన ఒకతన్ని యేసు దగ్గరికి తీసుకొచ్చారు. అతను చూడలేడు, మాట్లాడలేడు. యేసు అతన్ని బాగుచేసినప్పుడు అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి.
23 అప్పుడు ప్రజలంతా చాలా ఆశ్చర్యపోయి, “బహుశా ఈయనే దావీదు కుమారుడు అయ్యుంటాడా?” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు.
24 పరిసయ్యులు అది విని, “ఇతను చెడ్డదూతల నాయకుడైన బయెల్జెబూలు* సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.+
25 యేసు వాళ్ల ఆలోచనల్ని పసిగట్టి ఇలా అన్నాడు: “ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే, అది నాశనమౌతుంది. అలాగే ఒక నగరంలోని లేదా ఒక ఇంట్లోని వాళ్లే ఒకరిమీద ఒకరు తిరగబడి విడిపోతే, అది నిలవదు.
26 అదేవిధంగా సాతానే సాతానును వెళ్లగొడుతుంటే, అతను తన మీద తానే తిరగబడి విడిపోతున్నాడు; అప్పుడు అతని రాజ్యం ఎలా నిలుస్తుంది?
27 అంతేకాదు, ఒకవేళ నేను బయెల్జెబూలు వల్ల చెడ్డదూతల్ని వెళ్లగొడుతుంటే, మరి మీవాళ్లు ఎవరి వల్ల వెళ్లగొడుతున్నారు? అందుకే, వాళ్లే మీకు న్యాయమూర్తులుగా ఉంటారు.
28 కానీ నేను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నది దేవుని పవిత్రశక్తితో అయితే, నిజంగా దేవుని రాజ్యం మిమ్మల్ని దాటివెళ్లినట్టే.+
29 అలాగే, ఎవరైనా ఒక బలవంతుని ఇంట్లో దూరి అతని వస్తువులు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుణ్ణి కట్టేయాలి కదా? అప్పుడే అతను ఆ ఇల్లంతా దోచుకోగలడు.
30 నావైపు ఉండనివాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొడుతున్నాడు.+
31 “అందుకే నేను మీతో చెప్తున్నాను, మనుషులు చేసే అన్నిరకాల పాపాలకు, దూషణలకు క్షమాపణ ఉంటుంది. అయితే పవిత్రశక్తిని దూషిస్తే మాత్రం క్షమాపణ ఉండదు.+
32 ఉదాహరణకు, మానవ కుమారునికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడేవాళ్లకు క్షమాపణ ఉంటుంది;+ కానీ పవిత్రశక్తికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు ఈ వ్యవస్థలోనే* కాదు రాబోయే వ్యవస్థలో కూడా క్షమాపణ ఉండదు.+
33 “మీరు మంచి చెట్టయితే మీ పండ్లు కూడా మంచిగానే ఉంటాయి, మీరు చెడ్డ చెట్టయితే మీ పండ్లు కూడా చెడ్డగానే ఉంటాయి. చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టే తెలుస్తుంది.+
34 సర్పసంతానమా,+ చెడ్డవాళ్లయిన మీరు మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.+
35 మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు. అయితే చెడ్డ వ్యక్తి తన చెడ్డ ఖజానాలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు.+
36 నేను మీతో చెప్తున్నాను, మనుషులు తాము మాట్లాడే ప్రతీ పనికిరాని మాట విషయంలో తీర్పు రోజున లెక్క చెప్పాల్సి ఉంటుంది;+
37 నీ మాటల్ని బట్టే నువ్వు నీతిమంతుడివని తీర్పు పొందుతావు, నీ మాటల్ని బట్టే నువ్వు చెడ్డవాడివని తీర్పు పొందుతావు.”
38 అప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా, నువ్వు ఒక సూచన చేస్తే చూడాలనుంది” అన్నారు.+
39 దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దుష్టులు, వ్యభిచారులు* అయిన ఈ తరంవాళ్లు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు. కానీ యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదు.+
40 యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నట్టే,+ మానవ కుమారుడు కూడా భూగర్భంలో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉంటాడు.+
41 తీర్పు సమయంలో నీనెవె ప్రజలు ఈ తరంవాళ్లతో పాటు లేచి, వీళ్లమీద నేరం మోపుతారు. ఎందుకంటే యోనా ప్రకటించినప్పుడు నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు.+ అయితే ఇదిగో! యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.+
42 తీర్పు సమయంలో దక్షిణ దేశపు రాణి ఈ తరంవాళ్లతో పాటు లేచి వీళ్లమీద నేరం మోపుతుంది. ఎందుకంటే సొలొమోను తెలివిగల మాటల్ని వినడానికి ఆమె చాలాదూరం నుండి వచ్చింది.+ అయితే ఇదిగో! సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.+
43 “అపవిత్ర దూత* ఒక మనిషిలో నుండి బయటికి వచ్చినప్పుడు, విశ్రాంతి స్థలం కోసం నీళ్లులేని ప్రదేశాల గుండా తిరుగుతాడు; కానీ ఒక్కటి కూడా దొరకదు.+
44 అప్పుడు ఆ అపవిత్ర దూత, ‘నేను వదిలిపెట్టి వచ్చిన ఇంటికే మళ్లీ వెళ్తాను’ అనుకుంటాడు. తిరిగొచ్చినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా, శుభ్రంగా ఊడ్వబడి, అలంకరించబడి ఉండడం చూసి,
45 వెళ్లి, తన కన్నా చెడ్డవాళ్లయిన ఇంకో ఏడుగురు దూతల్ని తీసుకొస్తాడు. వాళ్లు ఆ మనిషిలోకి వెళ్లి అక్కడే నివసిస్తారు; అప్పుడు ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి పరిస్థితి కన్నా ఘోరంగా తయారౌతుంది.+ ఈ చెడ్డ తరంవాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.”
46 యేసు ఇంకా ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన తల్లి, తమ్ముళ్లు+ ఆయనతో మాట్లాడాలని బయట నిలబడ్డారు.
47 కాబట్టి ఎవరో ఆయనతో, “ఇదిగో! మీ అమ్మ, తమ్ముళ్లు నీతో మాట్లాడాలని బయట నిలబడ్డారు” అని చెప్పారు.
48 ఆ మాట చెప్పిన అతనితో యేసు ఇలా అన్నాడు: “మా అమ్మ ఎవరు? నా తమ్ముళ్లు ఎవరు?”
49 ఆ తర్వాత ఆయన తన శిష్యులవైపు చెయ్యి చూపిస్తూ ఇలా అన్నాడు: “ఇదిగో! మా అమ్మ, నా తమ్ముళ్లు!+
50 పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి.”+
అధస్సూచీలు
^ లేదా “సబ్బాతు రోజున.”
^ లేదా “సన్నిధి రొట్టెల్ని.”
^ లేదా “చచ్చుబడిన.”
^ అక్ష., “ఈయన్ని నేను ఆమోదించాను!”
^ లేదా “బయెల్జెబూబు.” సాతానుకు ఉన్న ఒక బిరుదు.
^ లేదా “నమ్మకద్రోహులు.”
^ పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.