మత్తయి సువార్త 15:1-39

  • మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేయడం (1-9)

  • అపవిత్రమైనవి హృదయంలో నుండి వస్తాయి (10-20)

  • ఫేనీకే స్త్రీ గొప్ప విశ్వాసం (21-28)

  • యేసు చాలా రోగాల్ని బాగుచేయడం (29-31)

  • యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం (32-39)

15  తర్వాత యెరూషలేము నుండి కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు యేసు దగ్గరికి వచ్చి+ ఇలా అన్నారు:  “నీ శిష్యులు పూర్వీకుల ఆచారాన్ని ఎందుకు మీరుతున్నారు? ఉదాహరణకు, వాళ్లు భోంచేసే ముందు చేతులు కడుక్కోవట్లేదు.”*+  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ ఆచారం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు?+  ఉదాహరణకు, ‘మీ అమ్మానాన్నల్ని గౌరవించు’ అని, ‘అమ్మనైనా, నాన్ననైనా తిట్టేవాడికి* మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పాడు.+  మీరేమో, ‘ఒక వ్యక్తి వాళ్ల అమ్మతో గానీ, నాన్నతో గానీ, “నా వల్ల మీరు పొందగలిగే సహాయాన్ని నేను ఇప్పటికే దేవునికి అర్పించేశాను” అని చెప్తే+  అతను వాళ్ల అమ్మనాన్నల్ని గౌరవించాల్సిన అవసరమే లేదు’ అని అంటారు. అలా మీరు మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.+  వేషధారులారా, మీ గురించి యెషయా సరిగ్గానే ఇలా చెప్పాడు:+  ‘ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వీళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.  వీళ్లు మనుషుల ఆజ్ఞల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్లు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృథా.’ ”+ 10  యేసు ఆ మాటలు చెప్పాక, ప్రజల్ని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “నేను చెప్పేది వినండి, అర్థంచేసుకోండి.+ 11  నోట్లోకి వెళ్లేది మనిషిని అపవిత్రం చేయదు కానీ, నోటి నుండి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది.”+ 12  అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “నీ మాటలు పరిసయ్యులకు కోపం తెప్పించాయని నీకు తెలుసా?” అన్నారు.+ 13  దానికి యేసు ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతీ మొక్క పెరికేయబడుతుంది. 14  వాళ్లను పట్టించుకోకండి. వాళ్లే గుడ్డివాళ్లు, అలాంటిది వాళ్లు ఇతరులకు దారి చూపిస్తారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే, వాళ్లిద్దరూ గుంటలో పడతారు.”+ 15  అప్పుడు పేతురు, “నువ్వు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణను* మాకు వివరించు” అని అడిగాడు. 16  అందుకు యేసు ఇలా అన్నాడు: “మీకు కూడా ఇంకా అర్థంకాలేదా?+ 17  మీకు తెలీదా, నోట్లోకి వెళ్లే ప్రతీది కడుపులోకి వెళ్లి తర్వాత బయటికి వచ్చేస్తుంది. 18  అయితే నోటి నుండి వచ్చే ప్రతీది హృదయంలో నుండి వస్తుంది, అదే మనిషిని అపవిత్రం చేస్తుంది.+ 19  ఉదాహరణకు దుష్ట ఆలోచనలు, అంటే హత్యలు, అక్రమ సంబంధాలు, లైంగిక పాపాలు,* దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు హృదయంలో నుండే వస్తాయి.+ 20  ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి, అంతేగానీ చేతులు కడుక్కోకుండా* భోంచేయడం మనిషిని అపవిత్రం చేయదు.” 21  యేసు అక్కడి నుండి బయల్దేరి తూరు, సీదోనుల ప్రాంతానికి వెళ్లాడు.+ 22  అప్పుడు ఇదిగో! ఆ ప్రాంతంలో ఉంటున్న ఒక ఫేనీకే స్త్రీ వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. చెడ్డదూత* పట్టడంవల్ల మా అమ్మాయి విపరీతంగా బాధపడుతోంది” అని కేకలు వేసింది.+ 23  అయితే యేసు ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆయన శిష్యులు వచ్చి, “ఆమెను పంపించేయి, ఆమె మన వెనకాలే వస్తూ కేకలు వేస్తోంది” అని ఆయన్ని బ్రతిమాలడం మొదలుపెట్టారు. 24  అందుకు యేసు, “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికి మాత్రమే దేవుడు నన్ను పంపించాడు” అని అన్నాడు.+ 25  అయితే ఆ స్త్రీ వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేసి, “ప్రభువా, నాకు సహాయం చేయి!” అని అడిగింది. 26  అందుకు యేసు, “పిల్లల రొట్టెలు తీసుకుని కుక్కపిల్లలకు వేయడం సరికాదు” అన్నాడు. 27  దానికి ఆ స్త్రీ, “నిజమే ప్రభువా, కానీ కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి కిందపడే ముక్కల్ని తింటాయి కదా” అంది.+ 28  అప్పుడు యేసు, “అమ్మా, నీ విశ్వాసం గొప్పది; నువ్వు కోరుకున్నట్టే నీకు జరగాలి” అన్నాడు. ఆ క్షణమే ఆమె కూతురు బాగైంది. 29  తర్వాత యేసు అక్కడి నుండి బయల్దేరి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు.+ ఆయన ఒక కొండ మీదికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. 30  అప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్లు కుంటివాళ్లను, చేతుల్లేనివాళ్లను, గుడ్డివాళ్లను, మూగవాళ్లను, ఇంకా చాలామంది రోగుల్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు, ఆయన వాళ్లను బాగుచేశాడు.+ 31  మూగవాళ్లు మాట్లాడడం, చేతుల్లేనివాళ్లు బాగవ్వడం, కుంటివాళ్లు నడవడం, గుడ్డివాళ్లు చూడడం చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోయి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపర్చారు.+ 32  అయితే యేసు శిష్యుల్ని దగ్గరికి పిలిచి, “ఈ ప్రజల్ని చూస్తే నాకు జాలేస్తోంది.+ గత మూడు రోజులుగా వాళ్లు నాతోనే ఉన్నారు, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు. వాళ్లను ఆకలితో పంపించేయడం నాకు ఇష్టంలేదు, అలా పంపించేస్తే వాళ్లు దారిలోనే కళ్లు తిరిగి పడిపోతారేమో” అన్నాడు.+ 33  కానీ శిష్యులు, “ఇంతమందికి సరిపడా ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మాకు ఎక్కడ దొరుకుతుంది?” అని ఆయనతో అన్నారు.+ 34  అందుకు యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు. 35  అప్పుడు ఆయన ప్రజల్ని నేలమీద కూర్చోమని చెప్పి, 36  ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకుని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, రొట్టెలు విరిచి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు; శిష్యులు వాటిని ప్రజలకు అందించారు.+ 37  వాళ్లంతా తృప్తిగా తిన్నారు, మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేసినప్పుడు ఏడు పెద్ద గంపలు నిండాయి.+ 38  ఆ సమయంలో స్త్రీలు, చిన్నపిల్లలు కాక దాదాపు 4,000 మంది పురుషులు ఆహారం తిన్నారు. 39  చివరికి యేసు ఆ ప్రజల్ని పంపించేసి, పడవ ఎక్కి మగదాను ప్రాంతంలోకి వెళ్లాడు.+

అధస్సూచీలు

అంటే, ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవట్లేదు.
లేదా “అమ్మ గురించైనా, నాన్న గురించైనా చెడుగా మాట్లాడేవాడికి.”
లేదా “ఉపమానాన్ని.”
ఇక్కడ గ్రీకులో పోర్నియా అనే పదానికి బహువచనం ఉపయోగించారు. పదకోశం చూడండి.
అంటే, ఆచార ప్రకారం శుద్ధి చేసుకోకుండా.
పదకోశం చూడండి.