మత్తయి సువార్త 16:1-28
16 అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, ఆయన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆకాశం నుండి తమకు ఒక సూచన చూపించమని అడిగారు.+
2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “సాయంకాలం అయినప్పుడు, ‘ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం పడదు’ అని మీరంటారు.
3 అలాగే ఉదయం పూట, ‘ఆకాశం ఎర్రగా ఉన్నా, మబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు చల్లగా ఉంటుంది, వర్షం పడుతుంది’ అని అంటారు. మీరు ఆకాశాన్ని చూసి వాతావరణం ఎలా ఉంటుందో అర్థంచేసుకోగలరు కానీ కాలాల సూచనల్ని అర్థంచేసుకోలేరు.
4 దుష్టులు, వ్యభిచారులు* అయిన ఈ తరంవాళ్లు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు. కానీ యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదు.”+ ఆయన ఈ మాట చెప్పి వాళ్లను విడిచి వెళ్లిపోయాడు.
5 అప్పుడు శిష్యులు సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నారు, కానీ వాళ్లు రొట్టెలు తీసుకురావడం మర్చిపోయారు.+
6 యేసు వాళ్లతో, “అప్రమత్తంగా ఉండండి; పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అన్నాడు.+
7 అప్పుడు వాళ్లు, “మనం రొట్టెలు తీసుకురావడం మర్చిపోయాం కదా” అని ఒకరితో ఒకరు అనుకోవడం మొదలుపెట్టారు.
8 అది తెలిసి యేసు ఇలా అన్నాడు: “అల్పవిశ్వాసులారా, మీ దగ్గర రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు?
9 మీకు ఇంకా విషయం అర్థంకాలేదా? ఐదు రొట్టెలతో 5,000 మందికి* ఆహారం పెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపల్లోకి ఎత్తారో మీకు గుర్తులేదా?+
10 ఏడు రొట్టెలతో 4,000 మందికి* ఆహారం పెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని పెద్ద గంపల్లోకి ఎత్తారో మీకు గుర్తులేదా?+
11 అలాంటిది, నేను మీతో మాట్లాడింది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కావట్లేదు? నేను చెప్పేది ఏమిటంటే పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి.”+
12 ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పింది, రొట్టెలు చేయడానికి ఉపయోగించే పులిసిన పిండి గురించి కాదుగానీ పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధ గురించని అప్పుడు వాళ్లకు అర్థమైంది.
13 యేసు ఫిలిప్పీ కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యుల్ని, “మానవ కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగాడు.+
14 అందుకు వాళ్లు, “కొంతమంది బాప్తిస్మమిచ్చే యోహాను అని,+ ఇంకొంతమంది ఏలీయా అని,+ మరికొంతమంది యిర్మీయా అని లేదా ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు” అని అన్నారు.
15 అప్పుడు ఆయన, “మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు.
16 అందుకు సీమోను పేతురు, “నువ్వు క్రీస్తువి,+ జీవంగల దేవుని కుమారుడివి”+ అన్నాడు.
17 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “యోనా కుమారుడివైన సీమోనూ, నువ్వు ధన్యుడివి.* ఈ విషయాన్ని మనుషులు కాదుగానీ పరలోకంలో ఉన్న నా తండ్రే నీకు తెలియజేశాడు.*+
18 నేను నీతో చెప్తున్నాను, నువ్వు పేతురువి. ఈ బండమీద+ నా సంఘాన్ని కడతాను; సమాధి* ద్వారాలు దాన్ని జయించలేవు.
19 పరలోక రాజ్యం తాళంచెవుల్ని నేను నీకు ఇస్తాను. నువ్వు భూమ్మీద దేన్నైనా బంధిస్తే అది అప్పటికే పరలోకంలో బంధించబడి ఉంటుంది; అలాగే నువ్వు భూమ్మీద దేన్నైనా విప్పితే అది అప్పటికే పరలోకంలో విప్పబడి ఉంటుంది.”
20 తర్వాత ఆయన, తాను క్రీస్తుననే విషయం ఎవరికీ చెప్పొద్దని శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+
21 అప్పటినుండి యేసు, తాను యెరూషలేముకు వెళ్లాలని, తాను పెద్దల, ముఖ్య యాజకుల, శాస్త్రుల చేతుల్లో ఎన్నో బాధలు అనుభవించి చంపబడాలని, మూడో రోజున బ్రతికించబడాలని తన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టాడు.+
22 అప్పుడు పేతురు ఆయన్ని పక్కకు తీసుకెళ్లి, “ప్రభువా, అలా మాట్లాడొద్దు. నీకు అలా జరగనే జరగదు” అని అంటూ ఆయన్ని మందలించడం మొదలుపెట్టాడు.+
23 కానీ యేసు వెనక్కి తిరిగి పేతురుతో, “సాతానా! నా వెనక్కి వెళ్లు. నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు” అన్నాడు.+
24 అప్పుడు యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, తన హింసాకొయ్యను* మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి.+
25 ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.+
26 నిజానికి, ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అతనికి ఏం లాభం?+ ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏం ఇవ్వగలడు?+
27 ఎందుకంటే మానవ కుమారుడు తన తండ్రి మహిమతో, తన దూతలతోపాటు వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇస్తాడు.+
28 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది మానవ కుమారుడు తన రాజ్యంలో రావడం చూసేవరకు చనిపోరు.”+
అధస్సూచీలు
^ లేదా “నమ్మకద్రోహులు.”
^ లేదా “పురుషులకు.”
^ లేదా “పురుషులకు.”
^ లేదా “బయల్పర్చాడు.”
^ లేదా “సంతోషంగా ఉంటావు.”