మత్తయి సువార్త 28:1-20
28 విశ్రాంతి రోజు గడిచిపోయి, వారం మొదటి రోజు* తెల్లవారుతున్నప్పుడు మగ్దలేనే మరియ, ఇంకో మరియ సమాధిని చూడడానికి వచ్చారు.+
2 అప్పటికే అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది! ఎందుకంటే యెహోవా* దూత పరలోకం నుండి వచ్చి సమాధికి అడ్డంగా ఉన్న రాయిని దొర్లించి, దాని మీద కూర్చున్నాడు.+
3 ఆ దూత మెరుపులా తళతళ మెరిసిపోతున్నాడు, అతని వస్త్రాలు మంచు అంత తెల్లగా ఉన్నాయి.+
4 కాపలా కాస్తున్న వాళ్లు అతనికి భయపడి వణికిపోయారు, వాళ్లు చచ్చినవాళ్లలా అయ్యారు.
5 దేవదూత ఆ స్త్రీలకు ఇలా చెప్పాడు: “భయపడకండి, కొయ్యపై మరణశిక్ష వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు.+
6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే+ ఆయన బ్రతికించబడ్డాడు. వచ్చి, ఆయన్ని ఉంచిన చోటును చూడండి.
7 త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. అలాగే వాళ్లతో, ‘ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ అక్కడ మీరు ఆయన్ని చూస్తారు’ అని చెప్పండి. మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను.”+
8 కాబట్టి వాళ్లు వెంటనే ఆ విషయం శిష్యులకు చెప్పడానికి భయంతో, ఎంతో సంతోషంతో పరుగెత్తుకుంటూ ఆ సమాధి* దగ్గర నుండి వెళ్లారు.+
9 అప్పుడు ఇదిగో! యేసు ఆ స్త్రీలను కలిసి పలకరించాడు. వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు వంగి నమస్కారం చేశారు.
10 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి! మీరు వెళ్లి నా సహోదరుల్ని గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వాళ్లు నన్ను చూస్తారు.”
11 ఆ స్త్రీలు వెళ్తుండగా, కాపలా ఉన్న సైనికుల్లో కొందరు+ నగరంలోకి వెళ్లి జరిగిన వాటన్నిటి గురించి ముఖ్య యాజకులకు చెప్పారు.
12 వాళ్లు పెద్దలతో సమావేశమై మాట్లాడుకున్న తర్వాత, ఆ సైనికులకు పెద్ద మొత్తంలో వెండి నాణేలు ఇచ్చి,
13 ఇలా అన్నారు: “ ‘రాత్రిపూట ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన్ని ఎత్తుకెళ్లిపోయారు’ అని చెప్పండి.+
14 ఇది అధిపతి చెవిలో పడితే అతన్ని ఒప్పించే పూచీ మాది, మీరు కంగారుపడాల్సిన అవసరం ఉండదు.”
15 సైనికులు ఆ వెండి నాణేలు తీసుకొని వాళ్లు చెప్పినట్టే చేశారు. వాళ్లు చెప్పిన కథ యూదుల్లో బాగా వ్యాప్తిచెంది ఈ రోజు వరకు ప్రాచుర్యంలో ఉంది.
16 అయితే, ఆ 11 మంది శిష్యులు మాత్రం గలిలయలో+ యేసు తమను కలుస్తానని చెప్పిన కొండ దగ్గరికి వెళ్లారు.+
17 ఆయన్ని చూసినప్పుడు వాళ్లు వంగి నమస్కారం చేశారు, కొందరు మాత్రం సందేహపడ్డారు.
18 యేసు వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.+
19 కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి;+ తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి;+
20 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.*+ ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు+ వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”
అధస్సూచీలు
^ అంటే, ఆదివారం. యూదులకు ఇది వారంలో మొదటి రోజు.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “స్మారక సమాధి.”
^ లేదా “బోధించండి.”