మలాకీ 1:1-14

  • తన ప్రజల పట్ల యెహోవాకున్న ప్రేమ (1-5)

  • యాజకులు లోపమున్నవాటిని అర్పించారు (6-14)

    • దేశాల మధ్య దేవుని పేరు గొప్పదిగా ఉంటుంది (11)

1  ఒక సందేశం: మలాకీ* ద్వారా ఇశ్రాయేలీయులకు వచ్చిన యెహోవా వాక్యం:  “నేను మీ మీద ప్రేమ చూపించాను”+ అని యెహోవా అంటున్నాడు. కానీ మీరు, “నువ్వు మా మీద ఎలా ప్రేమ చూపించావు?” అని అడుగుతున్నారు. యెహోవా ఇలా అంటున్నాడు: “ఏశావు యాకోబుకు అన్న+ కాదా? కానీ నేను యాకోబును ప్రేమించాను,  ఏశావును ద్వేషించాను;+ అతని పర్వతాల్ని నిర్మానుష్యం చేశాను,+ అతని స్వాస్థ్యాన్ని ఎడారిలోని* నక్కలకు విడిచిపెట్టాను.”+  “ ‘మేము చెదరగొట్టబడ్డాం, కానీ మళ్లీ వచ్చి నాశనమైపోయిన వాటిని తిరిగి కట్టుకుంటాం’ అని ఎదోము చెప్పినా, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు కట్టుకుంటారు, కానీ నేను కూలగొడతాను, వాళ్ల ప్రదేశం “దుష్టత్వం నిండిన ప్రదేశం” అని పిలవబడుతుంది. వాళ్లు “యెహోవా శాశ్వతంగా శిక్ష విధించిన ప్రజలు” అని పిలవబడతారు.+  మీరు దాన్ని కళ్లారా చూస్తారు, “ఇశ్రాయేలీయుల ప్రాంతంలో యెహోవా ఘనత పొందాలి” అని అంటారు.’ ”  “ ‘కుమారుడు తండ్రిని గౌరవిస్తాడు,+ సేవకుడు యజమానిని గౌరవిస్తాడు. ఒకవేళ నేను మీకు తండ్రినైతే,+ నాకు దక్కాల్సిన గౌరవం ఏది?+ నేను మీకు యజమానినైతే* నాకు దక్కాల్సిన గౌరవం ఏది?’ అని సైన్యాలకు అధిపతినైన యెహోవా అనే నేను నా పేరును నీచంగా చూస్తున్న యాజకులైన+ మిమ్మల్ని అడుగుతున్నాను. “ ‘అయితే మీరు, “మేము నీ పేరును ఎలా నీచంగా చూశాం?” అని అంటున్నారు.’  “ ‘మీరు నా బలిపీఠం మీద కలుషితమైన ఆహారాన్ని అర్పించడం ద్వారా అలా చేశారు.’ “ ‘అయినా మీరు, “మేము నిన్ను ఎలా కలుషితం చేశాం?” అని అడుగుతున్నారు.’ “ ‘ “యెహోవా బల్ల+ నీచమైనది” అని చెప్పడం ద్వారా మీరు అలా చేశారు.  గుడ్డి జంతువును బలిగా అర్పించినప్పుడు, “ఇది తప్పేమీ కాదు” అని మీరు అంటున్నారు. అలాగే మీరు కుంటిదాన్ని గానీ జబ్బుగలదాన్ని గానీ బలిగా అర్పించినప్పుడు, “ఇది తప్పేమీ కాదు” అని అంటున్నారు.’ ”+ “దయచేసి, వాటిని మీ అధిపతికి ఇచ్చి చూడండి. అతను మిమ్మల్ని చూసి సంతోషిస్తాడా? మీపై అనుగ్రహం చూపిస్తాడా?” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అడుగుతున్నాడు.  “దేవుడు మనపై అనుగ్రహం చూపించేలా దయచేసి ఇప్పుడు ఆయన్ని వేడుకోండి. మీరు మీ చేతులతో అలాంటి బలుల్ని అర్పిస్తే, ఆయన మీపై అనుగ్రహం చూపిస్తాడా?” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అడుగుతున్నాడు. 10  “డబ్బులు తీసుకోకుండా మందిరం తలుపులు మూయడానికి+ గానీ, నా బలిపీఠం మీద నిప్పు రాజేయడానికి గానీ మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు?+ మిమ్మల్ని చూసి నేను సంతోషించట్లేదు. మీ చేతులతో అర్పిస్తున్న ఏ కానుకనూ నేను ఇష్టపడట్లేదు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.+ 11  “తూర్పు నుండి పడమర* వరకు దేశాల మధ్య నా పేరు గొప్పదిగా ఉంటుంది.+ ప్రతీచోట బలులు అర్పించి పొగ పైకిలేచేలా చేస్తారు, నా పేరుకు అర్పణలు అర్పిస్తారు, స్వచ్ఛమైన కానుకలుగా వాటిని అర్పిస్తారు; ఎందుకంటే దేశాల మధ్య నా పేరు గొప్పదిగా ఉంటుంది”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. 12  “అయితే మీరు, ‘యెహోవా బల్ల కలుషితమైనది, దాని మీదున్న పండ్లు, ఆహారం నీచమైనవి’ అని అంటూ దాన్ని* అపవిత్రం చేస్తున్నారు.+ 13  అంతేకాదు, ‘అబ్బ! ఎంత ఆయాసం!’ అని అంటూ దాన్ని చూసి తిరస్కార భావంతో నిట్టూరుస్తున్నారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. “అంతేకాదు మీరు దొంగిలించిన జంతువుల్ని, కుంటి వాటిని, జబ్బుగల వాటిని తీసుకొస్తున్నారు. అవును, అలాంటి వాటిని మీరు కానుకలుగా తీసుకొస్తున్నారు! మీ చేతుల్లో నుండి నేను వాటిని అంగీకరించాలా?”+ అని యెహోవా అడుగుతున్నాడు. 14  “తన మందలో ఏ లోపంలేని మగ జంతువు ఉండి కూడా, మొక్కుబడి చేసుకొని లోపం ఉన్నదాన్ని యెహోవాకు బలిగా అర్పించే మోసగాడు శపించబడతాడు. ఎందుకంటే, నేను మహారాజును.+ దేశాల మధ్య నా పేరు సంభ్రమాశ్చర్యాలు పుట్టించేదిగా ఉంటుంది”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.

అధస్సూచీలు

“నా సందేశకుడు” అని అర్థం.
పదకోశం చూడండి.
లేదా “మహాగొప్ప యజమానినైతే.”
లేదా “సూర్యోదయం నుండి సూర్యాస్తమయం.”
లేదా “నన్ను” అయ్యుంటుంది.