మలాకీ 2:1-17

  • ప్రజలకు ఉపదేశమిచ్చే విషయంలో యాజకుల వైఫల్యం (1-9)

    • యాజకుని పెదాల మీద జ్ఞానం ఉండాలి (7)

  • ప్రజలు అన్యాయంగా విడాకులిచ్చి అపరాధులయ్యారు (10-17)

    • ‘ “విడాకులు నాకు అసహ్యం” అని యెహోవా చెప్తున్నాడు’ (16)

2  “యాజకులారా, ఇదిగో ఈ ఆజ్ఞ మీ కోసమే.+  మీరు దాన్ని వినకుండా, నా పేరును మహిమపర్చడం గురించి జాగ్రత్తగా ఆలోచించకుండా ఉంటే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను.+ మీ దీవెనల్ని శాపాలుగా మారుస్తాను.+ అవును, మీరు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించడం లేదు కాబట్టి నేను ఇప్పటికే మీ దీవెనల్ని శాపాలుగా మార్చేశాను” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.  “ఇదిగో! నేను మిమ్మల్ని బట్టి మీరు నాటిన విత్తనాల్ని నాశనం చేస్తాను,*+ మీ పండుగల్లో మీరు బలి ఇచ్చే పశువుల పేడను మీ ముఖాల మీద కొడతాను; మీరు దానితో పాటు అక్కడికి* తీసుకెళ్లబడతారు.  లేవితో నేను చేసిన ఒప్పందం* కొనసాగేలా నేను మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని అప్పుడు మీరు తెలుసుకుంటారు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.  “నేను అతనితో చేసిన ఒప్పందం జీవాన్ని, శాంతిని ఇచ్చే ఒప్పందం. నేను వాటిని అతనికి ఇచ్చాను. ఆ దీవెనల వల్ల అతను నా పట్ల భయభక్తులు చూపించాడు. అతను నాకు భయపడ్డాడు, అవును, నా పేరు విషయంలో గౌరవాన్ని, భయభక్తుల్ని చూపించాడు.  అతని నోట సత్య ఉపదేశం* ఉంది.+ అతని పెదాల మీద ఎలాంటి చెడూ కనిపించలేదు. అతను నాతో శాంతిగా ఉన్నాడు, నా ముందు నిజాయితీగా నడుచుకున్నాడు;+ చాలామందిని తప్పుడు మార్గం నుండి పక్కకు తిప్పాడు.  యాజకుని పెదాల మీద ఎప్పుడూ జ్ఞానం ఉండాలి, ప్రజలు అతని నోటి నుండి వచ్చే ఉపదేశం* కోసం వెదకాలి,+ ఎందుకంటే అతను సైన్యాలకు అధిపతైన యెహోవా సందేశకుడు.  “అలాంటిది మీరే దారితప్పారు, ధర్మశాస్త్రం విషయంలో* చాలామందిని తొట్రిల్లేలా చేశారు.+ నేను లేవితో చేసిన ఒప్పందాన్ని మీరు నాశనం చేశారు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.  “కాబట్టి నేను ప్రజలందరూ మిమ్మల్ని నీచంగా, తక్కువగా చూసేలా చేస్తాను. ఎందుకంటే మీరు నా మార్గాల్లో నడవకుండా, ధర్మశాస్త్రాన్ని అన్వయించే విషయంలో పక్షపాతం చూపించారు.”+ 10  “మనందరికి తండ్రి ఒక్కడే కదా?+ ఒక్క దేవుడే మనందర్నీ సృష్టించాడు కదా? అలాంటప్పుడు మన పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందాన్ని అగౌరవపరుస్తూ మనమెందుకు ఒకరితో ఒకరం మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాం?+ 11  యూదా మోసపూరితంగా ప్రవర్తించాడు; ఇశ్రాయేలులో, యెరూషలేములో హేయమైన సంఘటన ఒకటి జరిగింది; యెహోవా ప్రేమించే ఆయన పవిత్రతను*+ యూదా అపవిత్రపర్చాడు, అన్యదేవుణ్ణి పూజించే స్త్రీని* అతను పెళ్లి చేసుకున్నాడు.+ 12  అలా చేసింది ఎవరైనాసరే,* అతను సైన్యాలకు అధిపతైన యెహోవాకు కానుక అర్పించినాసరే, యెహోవా అతన్ని యాకోబు డేరాల్లో నుండి కొట్టివేస్తాడు.”+ 13  “యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్లతో, ఏడ్పుతో, మూల్గులతో కప్పేస్తున్న ఇంకొక పని కూడా మీరు చేస్తున్నారు. దానివల్ల మీరు అర్పిస్తున్న కానుకల్ని ఆయన ఇక పట్టించుకోవట్లేదు, మీ చేతులతో తెస్తున్న దేన్నీ ఆయన ఇష్టపడట్లేదు.+ 14  ‘ఎందుకు?’ అని మీరు అడుగుతున్నారు. ఎందుకంటే నీకూ, యౌవనంలో నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యకూ మధ్య యెహోవా సాక్షిగా ఉన్నాడు. ఆమె నీ భాగస్వామి, నువ్వు ఒప్పందం చేసుకున్న* నీ భార్య;+ అయినా నువ్వు ఆమెతో మోసపూరితంగా ప్రవర్తించావు. 15  అయితే ఒకతను అలా ప్రవర్తించలేదు, ఎందుకంటే దేవుని పవిత్రశక్తి కొంచెం అతని మీద ఉంది. అతను దేని కోసం ప్రయత్నించాడు? దేవుని సంతానం కోసం. కాబట్టి మీ మనోవైఖరిని కాపాడుకోండి. యౌవనంలో పెళ్లి చేసుకున్న నీ భార్యతో మోసపూరితంగా ప్రవర్తించకు. 16  ఎందుకంటే విడాకులు నాకు* అసహ్యం”+ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్తున్నాడు. “అంతేకాదు, తన వస్త్రాన్ని హింసతో నింపుకునే* వ్యక్తి కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. “కాబట్టి మీ మనోవైఖరిని కాపాడుకోండి; మీరు మోసపూరితంగా ప్రవర్తించకూడదు.+ 17  “మీరు మీ మాటలతో యెహోవాను విసిగించారు.+ అయితే, ‘మేము ఆయన్ని ఎలా విసిగించాం?’ అని మీరు అడుగుతున్నారు. ‘చెడు చేసే ప్రతీ వ్యక్తి యెహోవా దృష్టిలో మంచివాడు, అతన్ని చూసి ఆయన సంతోషిస్తాడు’+ అని చెప్పడం ద్వారా, ‘న్యాయవంతుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అనడం ద్వారా మీరు ఆయన్ని విసిగించారు.”

అధస్సూచీలు

అక్ష., “గద్దిస్తాను.”
అంటే, బలి అర్పించే జంతువుల పేడను పడేసే చోటుకు.
లేదా “నిబంధన.”
లేదా “ధర్మశాస్త్రం.”
లేదా “ధర్మశాస్త్రం.”
లేదా “మీ ఉపదేశంతో” అయ్యుంటుంది.
లేదా “పవిత్రమైన స్థలాన్ని” అయ్యుంటుంది.
అక్ష., “అన్యదేవుని కూతుర్ని.”
అక్ష., “మేల్కొని ఉన్నవాడైనా, జవాబిచ్చేవాడైనా.”
లేదా “చట్టప్రకారం.”
అక్ష., “ఆయనకు.”
లేదా “హింసకు పాల్పడే.”