మలాకీ 3:1-18

  • తన ఆలయాన్ని శుద్ధీకరించడానికి నిజమైన ప్రభువు వస్తాడు (1-5)

    • ఒప్పంద సందేశకుడు (1)

  • యెహోవా దగ్గరికి తిరిగి రమ్మనే ప్రోత్సాహం (6-12)

    • యెహోవా మార్పులేనివాడు (6)

    • ‘నా దగ్గరికి తిరిగి రండి, నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’ (7)

    • ‘పదోవంతులన్నీ తీసుకురండి, యెహోవా దీవెనలు కుమ్మరిస్తాడు’ (10)

  • నీతిమంతుడు, దుష్టుడు (13-18)

    • దేవుని ముందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం రాయబడింది (16)

    • నీతిమంతునికి, దుష్టునికి తేడా (18)

3  “ఇదిగో! నేను నా సందేశకుణ్ణి పంపుతున్నాను, అతను నాకు ముందుగా మార్గాన్ని సిద్ధం చేస్తాడు.+ మీరు వెదుకుతున్న నిజమైన ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయానికి వస్తాడు;+ అలాగే, మీరు ఎవరి కోసం సంతోషంగా ఎదురుచూస్తున్నారో ఆ ఒప్పంద సందేశకుడు* వస్తాడు. ఇదిగో! ఆయన తప్పకుండా వస్తాడు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.  “కానీ ఆయన వచ్చే రోజును ఎవరు తట్టుకోగలరు? ఆయన కనిపించినప్పుడు ఎవరు నిలబడగలరు? ఆయన కంసాలివాని అగ్నిలాంటి వాడు, చాకలివాని సబ్బులాంటి వాడు.+  ఆయన పుటం వేసి* వెండిని శుద్ధిచేసే కంసాలిలా+ కూర్చొని, లేవి కుమారుల్ని శుద్ధీకరిస్తాడు; బంగారాన్ని, వెండిని శుద్ధిచేసినట్టు ఆయన వాళ్లను శుద్ధీకరిస్తాడు. అప్పుడు వాళ్లు యెహోవాకు నీతితో కానుకలు అర్పించే ప్రజలౌతారు.  అంతేకాదు పూర్వకాలంలోలాగే యూదా, యెరూషలేము అర్పించే కానుకలు యెహోవాను నిజంగా సంతోషపెడతాయి.+  “తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను. మంత్రగాళ్లకు,+ వ్యభిచారులకు, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లకు,+ జీతగాళ్లనూ+ విధవరాళ్లనూ అనాథలనూ* మోసం చేసేవాళ్లకు,+ పరదేశులకు సహాయం చేయడానికి నిరాకరించే* వాళ్లకు+ వ్యతిరేకంగా నేను వెంటనే సాక్ష్యం చెప్తాను. వీళ్లు నాకు భయపడలేదు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు.  “నేను యెహోవాను; నేను మార్పులేనివాణ్ణి.*+ మీరు యాకోబు కుమారులు; అందుకే, మీరు ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.  మీ పూర్వీకుల కాలం నుండి మీరు నా శాసనాల్ని విడిచి పక్కకు తొలగిపోయారు, వాటిని పాటించలేదు.+ నా దగ్గరికి తిరిగిరండి, అప్పుడు నేను మీ దగ్గరికి తిరిగొస్తాను”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. కానీ మీరు, “మేము నీ దగ్గరికి ఎలా తిరిగి రావాలి?” అని అంటున్నారు.  “మామూలు మనిషి దేవుణ్ణి దోచుకుంటాడా? కానీ మీరు నన్ను దోచుకుంటున్నారు.” “మేము నిన్ను ఎలా దోచుకున్నాం?” అని మీరు అంటున్నారు. “పదోవంతుల్ని,* కానుకల్ని ఇవ్వకుండా ఉండడం ద్వారా మీరు నన్ను దోచుకున్నారు.  మీరు నిజంగా శాపగ్రస్తులు,* ఎందుకంటే మీరు నన్ను దోచుకుంటున్నారు. అవును, దేశమంతా నన్ను దోచుకుంటోంది. 10  నా మందిరంలో ఆహారం ఉండేలా,+ మీ పదోవంతులన్నీ ఆలయ గోదాములోకి తీసుకురండి.+ దయచేసి ఈ విషయంలో నన్ను పరీక్షించండి; నేను ఆకాశ ద్వారాలు* విప్పి, మీకు కొరత అనేదే లేకుండాపోయే వరకు+ మీపై దీవెనల్ని కుమ్మరిస్తానో* లేదో పరీక్షించి చూడండి”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. 11  “మీ పొలాన్ని మింగేసే చీడపురుగుల్ని నేను గద్దిస్తాను, అవి మీ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్షతోట ఫలించకుండా ఉండదు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. 12  “దేశాలన్నీ మీరు సంతోషంగల ప్రజలని ప్రకటించాల్సిందే,+ ఎందుకంటే మీరు ఆహ్లాదకరమైన దేశం అవుతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. 13  “మీరు నాకు వ్యతిరేకంగా కఠినమైన మాటలు మాట్లాడారు” అని యెహోవా అంటున్నాడు. అయినా, “మేము నీకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుకున్నాం?” అని మీరు అడుగుతున్నారు.+ 14  “మీరు ఇలా అంటున్నారు: ‘దేవునికి సేవచేయడం వల్ల ప్రయోజనమేమీ లేదు.+ ఆయన చెప్పినవి చేయడం వల్ల, మన పాపాల్ని బట్టి సైన్యాలకు అధిపతైన యెహోవా ముందు విచారపడడం వల్ల మనం ఏం ప్రయోజనం పొందాం? 15  గర్విష్ఠులే సంతోషంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, చెడుగా నడుచుకునేవాళ్లే వర్ధిల్లుతున్నారు.+ వాళ్లు దేవుణ్ణి పరీక్షించే సాహసం చేసినా వాళ్లకు ఏ హానీ జరగట్లేదు.’ ” 16  ఆ సమయంలో యెహోవాకు భయపడేవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అవును, వాళ్లలో ప్రతీ వ్యక్తి తన తోటివాడితో మాట్లాడాడు. అప్పుడు యెహోవా వాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అంతేకాదు, యెహోవాకు భయపడుతున్నవాళ్ల కోసం, ఆయన పేరు గురించి ధ్యానిస్తున్నవాళ్ల* కోసం+ ఆయన ముందు ఒక జ్ఞాపకార్థ గ్రంథం రాయబడింది.+ 17  సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వాళ్లను నా ప్రత్యేకమైన సొత్తుగా* చేసుకునే రోజున+ వాళ్లు నావాళ్లు అవుతారు.+ తనకు సేవచేసే కుమారుని మీద తండ్రి కనికరం చూపించినట్టే, నేను వాళ్ల మీద కనికరం చూపిస్తాను.+ 18  అప్పుడు మీరు నీతిమంతునికి, దుష్టునికి; దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య తేడాను మళ్లీ చూస్తారు.”+

అధస్సూచీలు

లేదా “నిబంధన దూత.”
లేదా “మలినాలు తీసేసి.”
లేదా “పరదేశుల హక్కుల్ని కాలరాసే.”
లేదా “తండ్రిలేని పిల్లలనూ.”
లేదా “నేను మారలేదు.”
లేదా “దశమభాగాల్ని.”
లేదా “మీరు ఒక శాపంతో నన్ను శపిస్తున్నారు” అయ్యుంటుంది.
లేదా “తూములు.”
అక్ష., “పూర్తిగా కుమ్మరిస్తానో.”
లేదా “ఆలోచిస్తున్నవాళ్ల.” లేదా “అమూల్యంగా ఎంచుతున్నవాళ్ల” అయ్యుంటుంది.
లేదా “విలువైన సంపదగా.”