మార్కు సువార్త 11:1-33

  • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (1-11)

  • అంజూర చెట్టును శపించడం (12-14)

  • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (15-18)

  • ఎండిపోయిన అంజూర చెట్టు నుండి పాఠం (19-26)

  • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (27-33)

11  ఇప్పుడు వాళ్లు యెరూషలేము దగ్గర్లోకి, అంటే ఒలీవల కొండ మీదున్న బేత్పగే, బేతనియ+ గ్రామాల దగ్గర్లోకి వచ్చారు. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ+  వాళ్లకు ఇలా చెప్పాడు: “కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే కట్టేసివున్న ఒక చిన్న గాడిద మీకు కనిపిస్తుంది. ఇప్పటివరకు దానిమీద ఎవరూ కూర్చోలేదు. దాన్ని విప్పి ఇక్కడికి తీసుకురండి.  ఎవరైనా ‘మీరు గాడిదను ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి, మళ్లీ వెంటనే పంపించేస్తాడు’ అని చెప్పండి.”  ఆయన చెప్పినట్టే వాళ్లు వెళ్లారు. ఒక సందులో ఓ ఇంటి గుమ్మం ముందు కట్టేసివున్న చిన్న గాడిదను చూసి, దాన్ని విప్పారు.+  అక్కడ నిలబడి ఉన్న కొందరు, “మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు?” అని శిష్యుల్ని అడిగారు.  శిష్యులు సరిగ్గా యేసు చెప్పమన్నట్టే చెప్పారు; అప్పుడు వాళ్లు దాన్ని తీసుకెళ్లనిచ్చారు.  వాళ్లు ఆ చిన్న గాడిదను+ యేసు దగ్గరికి తీసుకొచ్చి, దాని మీద తమ పైవస్త్రాలు వేశారు, యేసు దానిమీద కూర్చున్నాడు.+  ఇంకా చాలామంది తమ పైవస్త్రాల్ని దారిలో పరిచారు. కొందరేమో పొలంలో నరికిన చెట్ల మట్టలు తెచ్చారు.+  ఆయన ముందు వెళ్తున్నవాళ్లు, ఆయన వెనక వస్తున్నవాళ్లు ఇలా అరుస్తూ ఉన్నారు: “దేవా, ఈయన్ని కాపాడు!+ యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!+ 10  రాబోయే మన తండ్రైన దావీదు రాజ్యం దీవించబడాలి!+ అత్యున్నత స్థలాల్లో నివసించే దేవా, ఈయన్ని కాపాడు!” 11  యేసు యెరూషలేముకు వచ్చి ఆలయంలోకి వెళ్లి అక్కడ చుట్టూ ఉన్నవాటన్నిటినీ చూశాడు. కానీ అప్పటికే సాయంకాలం అవడంతో, పన్నెండుమంది శిష్యుల్ని తీసుకొని బేతనియకు వెళ్లిపోయాడు.+ 12  మరుసటి రోజు వాళ్లు బేతనియ నుండి బయల్దేరినప్పుడు ఆయనకు ఆకలేసింది. 13  ఆయనకు కాస్త దూరంలో ఆకులున్న ఒక అంజూర చెట్టు కనిపించింది. దానికి పండ్లు ఏమైనా ఉంటాయేమో అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. తీరా వెళ్లి చూసేసరికి దానికి ఆకులు తప్ప ఒక్క పండు కూడా లేదు. ఎందుకంటే అది అంజూర పండ్లు కాసే కాలం కాదు. 14  అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇంకెప్పుడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు”+ అని అన్నాడు. శిష్యులు ఆ మాట విన్నారు. 15  తర్వాత వాళ్లు యెరూషలేముకు వచ్చారు. ఆయన ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలో అమ్మేవాళ్లను, కొనేవాళ్లను బయటికి వెళ్లగొట్టాడు. డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని, పావురాలు అమ్మేవాళ్ల బల్లల్ని తలకిందులుగా పడేశాడు.+ 16  వస్తువులు మోసుకెళ్లేవాళ్లను ఆలయం గుండా వెళ్లనివ్వలేదు. 17  ఆయన బోధిస్తూ వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘నా మందిరం అన్నిదేశాల ప్రజలకు ప్రార్థన మందిరమని పిలవబడుతుంది’+ అని లేఖనాల్లో రాసిలేదా? కానీ మీరు దాన్ని దోపిడీదొంగల గుహగా మార్చేశారు.”+ 18  ఆ మాట విన్న ముఖ్య యాజకులు, శాస్త్రులు ఆయన్ని ఎలా చంపాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు;+ ఎందుకంటే ప్రజలంతా ఆయన బోధకు ఆశ్చర్యపోవడం+ చూసి వాళ్లు ఆయనకు భయపడ్డారు. 19  సాయంకాలం అయినప్పుడు యేసు, ఆయన శిష్యులు ఆ నగరం నుండి వెళ్లిపోయారు. 20  అయితే తెల్లవారుజామున వాళ్లు వెళ్తుండగా దారిలో ఆ అంజూర చెట్టు వేర్లతోసహా ఎండిపోయి ఉండడం గమనించారు.+ 21  ముందురోజు జరిగిన విషయం గుర్తుకొచ్చి పేతురు యేసుతో, “రబ్బీ, చూడు! నువ్వు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు. 22  అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23  నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఎవరైనా ఈ కొండతో, ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పి, సందేహపడకుండా తాను అన్నది జరుగుతుందని విశ్వసిస్తే, అది జరిగి తీరుతుంది.+ 24  అందుకే చెప్తున్నాను, మీరు ప్రార్థనలో అడిగేవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి, అప్పుడు మీరు వాటిని తప్పకుండా పొందుతారు.+ 25  మీరు ప్రార్థించడానికి నిలబడినప్పుడు, మీకు ఎవరితోనైనా ఏదైనా గొడవ ఉంటే వాళ్లను క్షమించండి, అప్పుడే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ తప్పుల్ని క్షమిస్తాడు.”+ 26  *—— 27  వాళ్లు మళ్లీ యెరూషలేముకు వచ్చారు. యేసు ఆలయంలో నడుస్తుండగా ముఖ్య యాజకులు, శాస్త్రులు, పెద్దలు వచ్చి, 28  “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఇవి చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?” అని ఆయన్ని అడిగారు.+ 29  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తే, నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను. 30  బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా,* మనుషులా?”+ 31  అప్పుడు వాళ్లలోవాళ్లు ఇలా మాట్లాడుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు. 32  పోనీ తెగించి, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్పేద్దామా?” అయితే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని ప్రజలంతా నమ్మారు కాబట్టి వాళ్లు ప్రజలకు భయపడ్డారు.+ 33  అందుకే వాళ్లు యేసుతో, “మాకు తెలీదు” అని చెప్పారు. అప్పుడు యేసు వాళ్లతో, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు.

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
అనుబంధం A3 చూడండి.
అక్ష., “పరలోకమా.”