యాకోబు రాసిన ఉత్తరం 1:1-27

  • శుభాకాంక్షలు (1)

  • సహనం వల్ల సంతోషం కలుగుతుంది (2-15)

    • పరీక్షించబడిన విశ్వాసం (3)

    • విశ్వాసంతో అడుగుతూ ఉండండి (5-8)

    • కోరిక పాపానికి, మరణానికి నడిపిస్తుంది (14, 15)

  • ప్రతీ మంచి బహుమతి పైనుండే వస్తుంది (16-18)

  • వాక్యాన్ని వినడం, పాటించడం (19-25)

    • అద్దంలో చూసుకునే మనిషి (23, 24)

  • పవిత్రమైన, కళంకంలేని ఆరాధన (26, 27)

1  దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు+ ఆయా ప్రాంతాల్లో చెదిరివున్న 12 గోత్రాలవాళ్లకు రాస్తున్న ఉత్తరం. మీకు శుభాకాంక్షలు!  నా సహోదరులారా, మీకు రకరకాల కష్టాలు* ఎదురైనప్పుడు సంతోషించండి.+  ఎందుకంటే, ఈ విధంగా పరీక్షించబడిన మీ విశ్వాసం మీలో సహనాన్ని పుట్టిస్తుందని మీకు తెలుసు.+  అయితే సహనం తన పనిని పూర్తిచేయనివ్వండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో సంపూర్ణులుగా, నిర్దోషులుగా, దేనిలోనూ లోపంలేని వాళ్లుగా ఉండగలుగుతారు.+  కాబట్టి, మీలో ఎవరికైనా తెలివి తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి,+ అది అతనికి ఇవ్వబడుతుంది.+ ఎందుకంటే ఆయన కోప్పడకుండా* అందరికీ ఉదారంగా ఇస్తాడు.+  అయితే అతను ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో+ అడుగుతూ ఉండాలి.+ ఎందుకంటే సందేహించే వ్యక్తి, గాలిచేత రేపబడి ఎగసిపడే సముద్ర కెరటం లాంటివాడు.  నిజానికి, అతను యెహోవా* నుండి ఏదైనా దొరుకుతుందని ఆశపడకూడదు;  అతను చంచల స్వభావం గలవాడు,+ ఏ విషయంలోనూ అతనికి నిలకడ ఉండదు.  దీనస్థితిలో ఉన్న సహోదరుడు దేవుని దృష్టిలో ఉన్నతస్థితి పొందినందుకు సంతోషించాలి,*+ 10  ధనవంతుడేమో దీనస్థితి పొందినందుకు సంతోషించాలి,+ ఎందుకంటే అతను గడ్డిపువ్వులా గతించిపోతాడు. 11  సూర్యుడు ఉదయించినప్పుడు దాని వేడికి మొక్క వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది. అలాగే ధనవంతుడు కూడా తన లక్ష్యాల వేటలో పడి కనుమరుగైపోతాడు.+ 12  కష్టాన్ని* సహిస్తూ ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+ ఎందుకంటే అతను దేవుని ఆమోదం పొందిన తర్వాత అతనికి జీవకిరీటం ఇవ్వబడుతుంది.+ యెహోవా* తనను ప్రేమిస్తూ ఉండేవాళ్లకు ఆ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. 13  కష్టం* వచ్చినప్పుడు ఎవ్వరూ, “దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు” అని అనకూడదు. ఎందుకంటే, చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు,* దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు. 14  అయితే ఒక వ్యక్తి కోరికే అతన్ని లాక్కెళ్లి, వలలో పడేసి అతన్ని పరీక్షకు గురిచేస్తుంది.+ 15  కోరిక బలపడినప్పుడు అతను పాపం చేస్తాడు;* దానివల్ల మరణం వస్తుంది. 16  నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. 17  ప్రతీ మంచి బహుమతి, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. అవి, ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి+ నుండి వస్తాయి. మారుతూ ఉండే నీడలా ఆయన మారిపోడు.+ 18  తన సృష్టి ప్రాణుల్లో మనం ఒకవిధంగా ప్రథమఫలాలు అయ్యేలా,+ సత్యవాక్యం ద్వారా మనల్ని ఉనికిలోకి తేవాలనేది ఆయన సంకల్పం.+ 19  నా ప్రియ సహోదరులారా, ఈ విషయం తెలుసుకోండి: ప్రతీ ఒక్కరు వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు,+ త్వరగా కోపం తెచ్చుకోకూడదు.+ 20  ఎందుకంటే కోపంగా ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో సరైనది చేయడు.* 21  కాబట్టి ప్రతీ మలినానికి, చెడుతనపు జాడకు* దూరంగా ఉంటూ,+ మిమ్మల్ని రక్షించగల దేవుని వాక్యం మీ హృదయాల్లో నాటబడేటప్పుడు దాన్ని సౌమ్యంగా స్వీకరించండి. 22  అయితే తప్పుడు ఆలోచనతో* మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ వాక్యాన్ని వినేవాళ్లుగా మాత్రమే ఉండకండి, దాన్ని పాటించేవాళ్లుగా ఉండండి.+ 23  ఒక వ్యక్తి వాక్యాన్ని వింటూ, దాన్ని పాటించకపోతుంటే+ అతను అద్దంలో తన ముఖం చూసుకునే మనిషిలా ఉంటాడు. 24  ఎందుకంటే, అతను అద్దంలో తనను తాను చూసుకొని, బయటికి వెళ్లగానే వెంటనే తాను ఎలాంటివాడో మర్చిపోతాడు. 25  అయితే స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ నియమంలోకి*+ పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండే వ్యక్తి ఊరికే విని మర్చిపోడు కానీ దాని ప్రకారం నడుచుకుంటాడు; అలా చేయడంలో సంతోషం పొందుతాడు.+ 26  ఒక వ్యక్తి, తాను దేవుని ఆరాధకుణ్ణని* అనుకుంటూ, నాలుకను అదుపులో* పెట్టుకోకపోతే+ అతను తన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాడు; అతని ఆరాధన వ్యర్థం. 27  మన తండ్రైన దేవుని దృష్టిలో పవిత్రమైన, కళంకంలేని ఆరాధన* ఏదంటే, కష్టాల్లో ఉన్న అనాథల్ని,+ విధవరాళ్లను+ ఆదుకోవడం,+ ఈ లోక మలినం తనకు అంటకుండా చూసుకోవడం.+

అధస్సూచీలు

లేదా “పరీక్షలు.”
లేదా “తప్పుబట్టకుండా.”
అనుబంధం A5 చూడండి.
అక్ష., “గొప్పలు చెప్పుకోవాలి.”
లేదా “పరీక్షను.”
అనుబంధం A5 చూడండి.
లేదా “పరీక్ష.”
లేదా “చెడ్డపనులు చేసేలా ఎవ్వరూ దేవుణ్ణి ప్రలోభపెట్టలేరు.”
లేదా “కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది.”
లేదా “మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు.”
లేదా “విపరీతమైన చెడుతనానికి” అయ్యుంటుంది.
లేదా “తర్కంతో.”
ఇది దేవుని వాక్యాన్ని సూచిస్తోంది.
లేదా “భక్తిపరుణ్ణని.”
లేదా “నోటికి కళ్లెం.”
లేదా “మతం.”