యాకోబు రాసిన ఉత్తరం 3:1-18
3 నా సహోదరులారా, బోధకులమైన మనం మరింత కఠినమైన తీర్పు పొందుతామని మీకు తెలుసు కాబట్టి మీలో ఎక్కువమంది బోధకులు అవ్వకూడదు.+
2 ఎందుకంటే, మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.*+ ఎవరైనా మాట్లాడే విషయంలో పొరపాటు చేయకపోతే అతను పరిపూర్ణుడు, అతను మొత్తం శరీరాన్ని అదుపులో ఉంచుకోగలడు.
3 గుర్రాన్ని మాట వినేలా చేయడానికి దాని నోటికి కళ్లెం వేస్తాం, ఆ కళ్లెంతో మొత్తం గుర్రాన్నే నియంత్రిస్తాం.
4 అంతేకాదు, ఓడల విషయమే తీసుకోండి. అవి చాలా పెద్దగా ఉంటాయి, బలమైన గాలులతో ముందుకు కదులుతాయి. అయినాసరే, ఓడ నడిపే వ్యక్తి చిన్న చుక్కానితో దాన్ని ఎటు తిప్పాలనుకుంటే అటు తిప్పగలుగుతాడు.
5 అలాగే నాలుక కూడా శరీరంలో చిన్న అవయవమే, కానీ చాలా గొప్పలు చెప్పుకుంటుంది. ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో చూడండి!
6 నాలుక కూడా నిప్పులాంటిదే.+ మన అవయవాలన్నిట్లో అది చెడుతో నిండివున్న అవయవం.* అది శరీరమంతటినీ కలుషితం చేస్తుంది,+ మొత్తం జీవితాన్నే తగలబెడుతుంది, గెహెన్నాలా* నాశనం చేస్తుంది.
7 అన్నిరకాల అడవి జంతువుల్ని, పక్షుల్ని, నేలమీద పాకే ప్రాణుల్ని,* సముద్ర జీవుల్ని మచ్చిక చేసుకోవచ్చు, మనిషి అలా మచ్చిక చేసుకున్నాడు కూడా.
8 కానీ నాలుకను మచ్చిక చేసుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అది ఎవ్వరికీ లొంగదు, అది హానికరమైనది, ప్రాణాంతక విషంతో నిండినది.+
9 దానితోనే మనం తండ్రైన యెహోవాను* స్తుతిస్తాం; దానితోనే, “దేవుని స్వరూపంలో” సృష్టించబడిన మనుషుల్ని+ శపిస్తాం.
10 ఒకే నోటితో దీవిస్తాం, శపిస్తాం.
నా సహోదరులారా, అలా చేయడం సరైనది కాదు.
11 ఒకే ఊట నుండి మంచి* నీళ్లు, చేదు నీళ్లు వస్తాయా? రావు కదా!
12 నా సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవ పండ్లు, ద్రాక్షతీగకు అంజూర పండ్లు కాస్తాయా? కాయవు కదా! అలాగే ఉప్పు నీళ్లలో నుండి మంచి నీళ్లు ఊరవు.
13 మీలో తెలివి, అవగాహన ఉన్నవాళ్లు ఎవరు? వాళ్లు తమ మంచి ప్రవర్తన ద్వారా, తెలివి నుండి పుట్టే సౌమ్యత వల్ల చేసే పనుల ద్వారా వాటిని చూపించాలి.
14 కానీ మీ హృదయాల్లో మితిమీరిన అసూయ,+ గొడవలకు దిగే స్వభావం*+ ఉంటే గొప్పలు చెప్పుకోకండి,+ అలా సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి.
15 ఇది పరలోకం నుండి వచ్చే తెలివి కాదు; ఇది భూ సంబంధమైనది,+ జంతు సంబంధమైనది, చెడ్డదూతలకు* సంబంధించినది.
16 ఎందుకంటే అసూయ, గొడవలకు దిగే స్వభావం* ఎక్కడ ఉంటే అక్కడ గందరగోళం, అన్నిరకాల చెడుతనం ఉంటాయి.+
17 కానీ పరలోకం నుండి వచ్చే తెలివి మొట్టమొదట స్వచ్ఛమైనది,+ తర్వాత శాంతికరమైనది,+ పట్టుబట్టే స్వభావం లేనిది,*+ లోబడడానికి సిద్ధంగా ఉండేది, కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది,+ పక్షపాతం గానీ+ వేషధారణ గానీ లేనిది.+
18 అంతేకాదు, అందరితో శాంతిగా ఉండడానికి కృషి చేసేవాళ్లు+ శాంతిని వ్యాప్తిచేస్తారు; దానివల్ల వాళ్లు నీతియుక్తమైన పనులు చేయగలుగుతారు.*+
అధస్సూచీలు
^ లేదా “తడబడుతుంటాం.”
^ లేదా “పాప ప్రపంచం.”
^ లేదా “సరీసృపాల్ని.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “తియ్యని.”
^ లేదా “గొప్పవాణ్ణి కావాలనే బలమైన కోరిక” అయ్యుంటుంది.
^ లేదా “గొప్పవాణ్ణి కావాలనే బలమైన కోరిక” అయ్యుంటుంది.
^ లేదా “అర్థం చేసుకునేది; సహేతుకమైనది.”
^ అక్ష., “నీతి ఫలం, శాంతిని నెలకొల్పేవాళ్లకు శాంతియుత పరిస్థితుల్లో నాటబడుతుంది.”