యాకోబు రాసిన ఉత్తరం 5:1-20
5 ధనవంతులారా, మీ మీదికి రాబోతున్న కష్టాల్ని బట్టి దుఃఖించండి, బోరున ఏడ్వండి.+
2 మీ సిరిసంపదలు కుళ్లిపోయాయి, మీ బట్టల్ని చెదలు తినేశాయి.+
3 మీ వెండిబంగారాలకు తుప్పు పట్టింది. వాటికి పట్టిన తుప్పు మీ మీద సాక్ష్యం చెప్తుంది, అది మీ శరీరాన్ని తినేస్తుంది. మీరు కూడబెట్టుకున్నవి చివరి రోజుల్లో అగ్నిలా తయారౌతాయి.+
4 ఇదిగో, మీ పొలాల్లో పంట కోసిన పనివాళ్లకు ఇవ్వకుండా మీరు మీ దగ్గరే ఉంచుకున్న కూలి కేకలు వేస్తోంది, వాళ్ల మొరలు సైన్యాలకు అధిపతైన యెహోవా* చెవులకు చేరాయి.+
5 మీరు ఈ భూమ్మీద భోగభాగ్యాలతో జీవించారు, సుఖాల కోసం బ్రతికారు. వధించే రోజు కోసం+ మీ హృదయాల్ని కొవ్వెక్కేలా చేసుకున్నారు.
6 మీరు నీతిమంతుణ్ణి దోషి అని తీర్పుతీర్చి, హత్య చేశారు. ఆయన* మిమ్మల్ని వ్యతిరేకించడం లేదా?
7 కాబట్టి సహోదరులారా, ప్రభువు ప్రత్యక్షత+ వరకు ఓర్పు చూపించండి. రైతు విషయమే తీసుకోండి, అతను భూమి ఇచ్చే విలువైన పంట కోసం ఎదురుచూస్తూ, తొలకరి వానలు,* కడవరి వానలు*+ కురిసే వరకు ఓర్పు చూపిస్తాడు.
8 మీరు కూడా ఓర్పు చూపించండి;+ మీ హృదయాల్ని స్థిరపర్చుకోండి, ఎందుకంటే ప్రభువు ప్రత్యక్షత దగ్గరపడింది.+
9 సహోదరులారా, మీరు తీర్పుకు గురవ్వకుండా ఉండేలా ఒకరి మీద ఒకరు సణుక్కోకండి.*+ ఇదిగో, న్యాయమూర్తి గుమ్మం దగ్గరే ఉన్నాడు.
10 సహోదరులారా, కష్టాల్ని సహించే విషయంలో, ఓర్పు చూపించే విషయంలో,+ యెహోవా* పేరున మాట్లాడిన ప్రవక్తల్ని+ ఆదర్శంగా తీసుకోండి.+
11 మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు.
12 నా సహోదరులారా, అన్నిటికన్నా ముఖ్యంగా, ఒట్టేయడం మానేయండి. ఆకాశంమీద గానీ, భూమ్మీద గానీ, ఇంక దేనిమీద గానీ ఒట్టేయకండి. మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టు ఉండాలి.+ అప్పుడు మీరు తీర్పుకు గురవ్వరు.
13 మీలో ఎవరైనా కష్టాలు పడుతున్నారా? అతను ప్రార్థిస్తూ ఉండాలి.+ ఎవరైనా ఉల్లాసంగా ఉన్నారా? అతను స్తుతిగీతాలు* పాడాలి.+
14 మీలో ఎవరైనా అనారోగ్యంగా* ఉన్నారా? అతను సంఘ పెద్దల్ని పిలవాలి,+ వాళ్లు యెహోవా* పేరున అతనికి నూనె రాసి,+ అతని కోసం ప్రార్థన చేయాలి.
15 విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని* బాగుచేస్తుంది, యెహోవా* అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు.
16 కాబట్టి, ఒకరి దగ్గర ఒకరు పాపాల్ని ఒప్పుకోండి,+ ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి, అప్పుడు మీరు బాగౌతారు. నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.+
17 ఏలీయా కూడా మనలాంటి భావాలు ఉన్న మనిషే. అయినా, అతను వర్షం పడకూడదని పట్టుదలగా ప్రార్థించినప్పుడు, మూడు సంవత్సరాల ఆరు నెలలు దేశంలో వర్షం పడలేదు.+
18 తర్వాత, అతను మళ్లీ ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి పంటనిచ్చింది.+
19 నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి పక్కదారి పట్టినప్పుడు* ఇంకొకరు అతన్ని తిరిగి సత్యం వైపు మళ్లిస్తే,
20 అలా పాపిని చెడు మార్గం నుండి మళ్లించే వ్యక్తి,+ అతన్ని మరణం నుండి రక్షిస్తున్నాడు, ఎన్నో పాపాల్ని కప్పేస్తున్నాడు.+
అధస్సూచీలు
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “దేవుడు” అయ్యుంటుంది.
^ తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ లేదా “ఏడ్వకండి; ఫిర్యాదు చేసుకోకండి.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “కనికరం.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “సంతోషంగా ఉంటారని.”
^ లేదా “కీర్తనలు.”
^ ఇది దేవునితో ఉన్న సంబంధం బలహీనపడడాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “అలసిపోయిన వ్యక్తిని” అయ్యుంటుంది.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “పట్టించబడినప్పుడు.”