యిర్మీయా 13:1-27

  • పాడైపోయిన నార దట్టీ (1-11)

  • ద్రాక్షారసం కూజాలు పగలగొట్ట​బడతాయి (12-14)

  • మారని యూదా చెరలోకి వెళ్తుంది (15-27)

    • “కూషీయుడు తన చర్మాన్ని మార్చు​కోగలడా?” (23)

13  యెహోవా నాకు ఇలా చెప్పాడు: “వెళ్లి, ఒక నార దట్టీ కొనుక్కొని, దాన్ని నీ నడుముకు కట్టుకో, కానీ దాన్ని నీళ్లలో తడపకు.”  దాంతో నేను యెహోవా మాట ప్రకారం ఒక దట్టీ కొనుక్కొని నడుముకు కట్టుకున్నాను.  రెండోసారి యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “నువ్వు కొనుక్కొని నడుముకు కట్టుకున్న దట్టీ తీసుకొని, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, అక్కడ ఒక బండ సందులో దాన్ని దాచిపెట్టు.”  యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టే, నేను వెళ్లి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.  చాలా రోజుల తర్వాత యెహోవా నాతో, “నువ్వు లేచి, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, దాచిపెట్టమని నేను నీకు ఆజ్ఞాపించిన దట్టీని తీసుకో” అన్నాడు.  అప్పుడు నేను యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, ఆ దట్టీని దాచిపెట్టిన స్థలంలో నుండి దాన్ని తవ్వి తీశాను, ఆ దట్టీ పాడైపోయి ఎందుకూ పనికిరాకుండా తయారైంది.  తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “యెహోవా ఇలా అంటున్నాడు: ‘యూదా గర్వాన్ని, యెరూషలేము మహా గర్వాన్ని నేను ఇలాగే నాశనం చేస్తాను.+ 10  నా మాటలకు లోబడడానికి ఇష్టపడకుండా,+ మొండిగా తమ హృదయాన్ని అనుసరిస్తూ,+ వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాటిని పూజిస్తూ, వాటికి వంగి నమస్కారం చేసే ఈ దుష్ట ప్రజలు కూడా ఎందుకూ పనికిరాని ఈ దట్టీలాగే తయారౌతారు.’ 11  ‘ఒక వ్యక్తి నడుముకు దట్టీ కట్టుకున్నట్టే, నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లందర్నీ, యూదా ఇంటివాళ్లందర్నీ నా నడుముకు కట్టుకున్నాను. వాళ్లు నాకు ప్రజలుగా,+ నాకు కీర్తిని,+ స్తుతిని, ఘనతను తీసుకొచ్చే వాళ్లుగా ఉండాలని అలా చేశాను. కానీ వాళ్లు లోబడలేదు’+ అని యెహోవా అంటున్నాడు. 12  “నువ్వు వాళ్లకు ఈ సందేశాన్ని కూడా చెప్పాలి: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలి.” ’ అప్పుడు వాళ్లు, ‘ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని నీతో అంటారు. 13  అప్పుడు నువ్వు వాళ్లకిలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఈ దేశ నివాసులందర్నీ, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, యెరూషలేము నివాసులందర్నీ మత్తులుగా చేయబోతున్నాను.+ 14  నేను వాళ్లను ఒకరి మీద ఒకర్ని పడేస్తాను, తండ్రుల్నీ కుమారుల్నీ ఒకేలా నాశనం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ “నేను వాళ్లమీద కనికరం చూపించను, బాధపడను, కరుణ చూపించను; వాళ్లను నాశనం చేయకుండా ఏదీ నన్ను ఆపలేదు.” ’+ 15  వినండి, శ్రద్ధపెట్టండి. అహంకారం చూపించకండి, ఎందుకంటే యెహోవా మాట్లాడాడు. 16  ఆయన చీకటిని తీసుకురాకముందే,చీకటిపడి పర్వతాల మీద మీ పాదాలు తడబడకముందే,మీ దేవుడైన యెహోవాను మహిమపర్చండి. మీరు వెలుగు వస్తుందనుకుంటారు,కానీ ఆయన చీకటిని తెస్తాడు;దాన్ని చిమ్మచీకటిగా మారుస్తాడు.+ 17  మీరు వినడానికి ఇష్టపడకపోతే,మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తాను. కన్నీరుమున్నీరుగా విలపిస్తాను,+ఎందుకంటే యెహోవా మంద+ చెరగా తీసుకెళ్లబడింది. 18  రాజుతో, రాజమాతతో+ ఇలా చెప్పు: ‘అవమానంతో కింద కూర్చోండి,ఎందుకంటే, అందమైన మీ కిరీటం మీ తలమీద నుండి పడిపోతుంది.’ 19  దక్షిణ దేశ నగరాలు మూయబడ్డాయి,* వాటిని తెరిచేవాళ్లు ఎవ్వరూ లేరు. యూదా ప్రజలంతా చెరగా తీసుకెళ్లబడ్డారు.+ 20  నీ* తల ఎత్తి, ఉత్తరం నుండి వస్తున్నవాళ్లను చూడు.+ నీకు ఇచ్చిన మంద, నీ అందమైన గొర్రెలు ఎక్కడ?+ 21  నువ్వు మొదటి నుండి శిక్షణ ఇచ్చిన నీ సన్నిహిత స్నేహితుల ద్వారానేనీకు శిక్ష వస్తే+ నువ్వు ఏమంటావు? ప్రసవించే స్త్రీ లాంటి వేదన నీకు కలగదా?+ 22  ‘ఇవన్నీ ఎందుకు నా మీదికి వచ్చాయి?’ అని నీకు అనిపిస్తే,+ నీ గొప్ప దోషం వల్లే నీ బట్టలు తీసేయబడ్డాయని,+ నీ మడిమెలకు ఇంత నొప్పి కలిగిందని తెలుసుకో. 23  కూషీయుడు* తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా?+ అది సాధ్యమైతే, చెడు చేయడానికి అలవాటుపడిన నువ్వుమంచి చేయడం కూడా సాధ్యమౌతుంది. 24  కాబట్టి ఎడారి గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను మిమ్మల్ని చెదరగొడతాను.+ 25  నేను నీ కోసం కొలిచి ఉంచిన భాగం, నీ వంతు ఇదే” అని యెహోవా అంటున్నాడు.“ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయావు,+ అబద్ధాల మీద నమ్మకం పెట్టుకుంటున్నావు.+ 26  కాబట్టి, నేను నీ వస్త్రాన్ని ముఖం వరకు పైకెత్తుతాను,ప్రజలు నీ మానం చూస్తారు,+ 27  నీ వ్యభిచార క్రియల్ని,+ కామంతో నువ్వు చేసే సకిలింపుల్ని,నీచమైన* నీ వేశ్యా ప్రవర్తనను చూస్తారు. కొండల మీద, పొలంలోనీ అసహ్యమైన ప్రవర్తనను నేను చూశాను.+ యెరూషలేమా, నీకు శ్రమ! ఇంకా ఎంతకాలం నువ్వు అపవిత్రంగా ఉంటావు?”+

అధస్సూచీలు

లేదా “ముట్టడి వేయబడ్డాయి.”
బహుశా యెరూషలేము కావచ్చు.
లేదా “ఇతియోపీయుడు.”
లేదా “అవమానకరమైన.”