యిర్మీయా 15:1-21

  • యెహోవా తన తీర్పును మార్చుకోడు (1-9)

  • యిర్మీయా ఫిర్యాదు (10)

  • యెహోవా జవాబు (11-14)

  • యిర్మీయా ప్రార్థన (15-18)

    • దేవుని మాటల్ని తినడం సంతోషం (16)

  • యెహోవా యిర్మీయాను బలపర్చడం (19-21)

15  తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “చివరికి మోషే, సమూయేలు నా ముందు నిలబడినా,+ ఈ ప్రజల మీద నేను దయ చూపించను. వాళ్లను నా ముందు నుండి వెళ్లగొట్టు, వాళ్లు వెళ్లిపోవాలి.  ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని వాళ్లు నిన్ను అడిగితే, నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “ప్రాణాంతకమైన తెగులు కోసం నియమించబడినవాళ్లు ప్రాణాంతకమైన తెగులుకు! ఖడ్గం కోసం నియమించబడినవాళ్లు ఖడ్గానికి!+ కరువు కోసం నియమించబడినవాళ్లు కరువుకు! చెర కోసం నియమించబడినవాళ్లు చెరకు వెళ్లాలి!” ’+  “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్లమీద నాలుగు విపత్తుల్ని* నియమిస్తాను.+ చంపడానికి ఖడ్గాన్ని, శవాల్ని లాక్కెళ్లడానికి కుక్కల్ని, మింగేసి నాశనం చేయడానికి ఆకాశపక్షుల్ని, భూమ్మీది జంతువుల్ని నియమిస్తాను.+  హిజ్కియా కుమారుడూ యూదా రాజూ అయిన మనష్షే యెరూషలేములో చేసినదాన్ని బట్టి+ భూమ్మీది రాజ్యాలన్నీ వాళ్లను చూసి భయపడేలా చేస్తాను.+   యెరూషలేమా, నీమీద కనికరం చూపించేది ఎవరు?నీమీద సానుభూతి చూపించేది ఎవరు?నువ్వు ఎలా ఉన్నావని అడగడానికి ఆగేది ఎవరు?’   యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు నన్ను వదిలేశావు.+ నువ్వు నన్ను విడిచివెళ్తూ* ఉన్నావు.+ కాబట్టి నీమీద నా చెయ్యి చాపి, నిన్ను నాశనం చేస్తాను.+ నీమీద జాలి చూపించీ చూపించీ నేను విసిగిపోయాను.*   నేను దేశ ద్వారాల దగ్గర ముళ్లపారతో వాళ్లను తూర్పారబడతాను. వాళ్ల పిల్లల్ని చంపేస్తాను.+ నా ప్రజల్ని నాశనం చేస్తాను,ఎందుకంటే, వాళ్లు తమ మార్గాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు.+   వాళ్ల విధవరాళ్ల సంఖ్య నా ముందు సముద్రపు ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా ఉంటుంది. మిట్టమధ్యాహ్నం నేను వాళ్ల మీదికి, అంటే తల్లుల మీదికి, యువకుల మీదికి నాశకుడిని రప్పిస్తాను. నేను హఠాత్తుగా వాళ్లను భయాందోళనలకు గురిచేస్తాను.   ఏడుగురు పిల్లల్ని కన్న స్త్రీ మూర్ఛపోయింది;ఆమెకు ఊపిరాడట్లేదు. ఆమె సూర్యుడు పగటిపూటే అస్తమించాడు,దానివల్ల* సిగ్గు, అవమానం కలిగాయి.’ ‘వాళ్లలో మిగిలిన కొంతమందిని నేను శత్రువుల ఖడ్గానికి అప్పగిస్తాను’ అని యెహోవా అంటున్నాడు.”+ 10  అయ్యో, నాకు శ్రమ! అమ్మా, నన్నెందుకు కన్నావు?+దేశంలోని వాళ్లందరూ నాతో గొడవపడుతున్నారు, వాదిస్తున్నారు. నేను ఎవరికీ అప్పు ఇవ్వలేదు, తీసుకోలేదు;అయినా వాళ్లంతా నన్ను శపిస్తున్నారు. 11  యెహోవా ఇలా అన్నాడు: “నేను ఖచ్చితంగా నీకు మంచి చేస్తాను;విపత్తు సమయంలో, కష్టకాలంలోశత్రువు ముందు నీ తరఫున జోక్యం చేసుకుంటాను. 12  ఎవరైనా ఇనుమును, ఉత్తరం నుండి వచ్చిన ఇనుమును, రాగిని విరగ్గొట్టగలరా? 13  నీ* వనరుల్ని, నీ సంపదల్ని నేను దోపుడుసొమ్ముగా ఇచ్చేస్తాను,+ డబ్బులకు కాదు, నీ ప్రాంతాలన్నిట్లో నువ్వు చేసిన పాపాల్ని బట్టి ఇచ్చేస్తాను. 14  వాటిని నీ శత్రువులకు ఇస్తాను,వాళ్లు నీకు తెలియని దేశానికి వాటిని తీసుకెళ్తారు.+ ఎందుకంటే నా కోపం అగ్నిని రాజేసింది,అది నీకు వ్యతిరేకంగా మండుతోంది.”+ 15  యెహోవా, నీకు తెలుసు,నన్ను గుర్తుచేసుకో, నా మీద దృష్టిపెట్టు. నన్ను హింసించేవాళ్ల మీద నా తరఫున పగతీర్చుకో.+ కోప్పడే విషయంలో నిదానిస్తూ నన్ను నశించిపోనివ్వకు. నీ కోసమే నేను ఈ నిందను భరిస్తున్నానని గుర్తుంచుకో.+ 16  నీ మాటలు నాకు దొరికాయి, నేను వాటిని తిన్నాను;+నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఉల్లాసాన్ని ఇచ్చాయి,ఎందుకంటే సైన్యాలకు దేవుడివైన యెహోవా, నేను నీ పేరుతో పిలవబడుతున్నాను. 17  నేను నవ్వేవాళ్ల మధ్య కూర్చుని సంతోషించట్లేదు.+ నీ చెయ్యి నామీద ఉండడం వల్ల నేను ఒంటరిగా కూర్చుంటున్నాను,ఎందుకంటే, నువ్వు నన్ను కోపంతో* నింపేశావు.+ 18  నా నొప్పి ఎందుకు తగ్గట్లేదు? నా గాయం ఎందుకు మానట్లేదు? అది తగ్గనంటోంది. నువ్వు నాకు నమ్మలేని, నీళ్లులేని ఊటలా తయారౌతావా? 19  కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు తిరిగొస్తే, నేను నిన్ను పునరుద్ధరిస్తాను,అప్పుడు నువ్వు నా ముందు నిలబడతావు. నువ్వు వ్యర్థమైన వాటి నుండి అమూల్యమైన వాటిని వేరుచేస్తే,నాకు నోరువి* అవుతావు.వాళ్లే నీ వైపు తిరుగుతారు, నువ్వు వాళ్ల వైపు తిరగాల్సిన అవసరం లేదు.” 20  “నేను నిన్ను ఈ ప్రజలకు రాగి ప్రాకారంగా చేస్తాను.+ వాళ్లు ఖచ్చితంగా నీతో పోరాడతారు,కానీ నీమీద గెలవరు,+ఎందుకంటే నిన్ను కాపాడడానికి, రక్షించడానికి నేను నీతో ఉన్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 21  “నేను దుష్టుల చేతి నుండి నిన్ను కాపాడతాను,క్రూరుల అరచేతి నుండి నిన్ను విడిపిస్తాను.”

అధస్సూచీలు

లేదా “నాలుగు రకాల తీర్పును” అయ్యుంటుంది. అక్ష., “నాలుగు జాతుల్ని.”
లేదా “వెనక్కి నడుస్తూ” అయ్యుంటుంది.
లేదా “విచారపడుతున్నాను.”
లేదా “దానికి” అయ్యుంటుంది.
యూదాను సూచిస్తుందని తెలుస్తోంది.
లేదా “తీర్పు సందేశంతో.”
లేదా “ప్రతినిధివి.”