యిర్మీయా 16:1-21

  • యిర్మీయా పెళ్లి చేసుకోకూడదు, ఏడ్వకూడదు, విందుకు వెళ్లకూడదు (1-9)

  • శిక్ష, పునరుద్ధరణ (10-21)

16  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “నువ్వు ఈ స్థలంలో పెళ్లి చేసుకోకూడదు; కుమారుల్ని, కూతుళ్లను కనకూడదు.  ఎందుకంటే, ఇక్కడ పుట్టే కుమారుల గురించి, కూతుళ్ల గురించి, ఈ దేశంలో వాళ్లను కనే తల్లిదండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నాడు:  ‘వాళ్లు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు,+ వాళ్ల కోసం ఎవరూ ఏడ్వరు, వాళ్లను పాతిపెట్టరు; వాళ్లు నేలమీద ఎరువు అవుతారు.+ వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు;+ వాళ్ల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి.’   యెహోవా ఇలా అంటున్నాడు:‘నువ్వు ఏడ్చేవాళ్ల ఇంట్లో అడుగుపెట్టకు,ఏడ్వడానికి గానీ, ఓదార్చడానికి గానీ వెళ్లకు.’+ యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఎందుకంటే, నేను ఈ ప్రజల మధ్య నుండి నా శాంతిని,నా విశ్వసనీయ ప్రేమను, కరుణను తీసేశాను.+   గొప్పవాళ్లు, సామాన్యులు అందరూ ఈ దేశంలో చనిపోతారు. ఎవరూ వాళ్లను పాతిపెట్టరు,వాళ్ల గురించి ఏడ్వరు,వాళ్ల కోసం తమ శరీరాన్ని కోసుకోరు, తల బోడి చేసుకోరు.*   చనిపోయినవాళ్ల కోసం ఏడుస్తున్నవాళ్లను ఓదార్చడానికిఎవరూ ఆహారం పెట్టరు;చనిపోయిన తమ తండ్రి లేదా తల్లి కోసం ఏడుస్తున్నవాళ్లను ఊరడించడానికిఎవరూ ద్రాక్షారసం గిన్నెను ఇవ్వరు.   విందు జరిగే ఇంటికి వెళ్లకు,వాళ్లతో కూర్చుని తినకు, తాగకు.’  “ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ స్థలంలో, మీ రోజుల్లో, మీ కళ్ల ముందే నేను సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం వినిపించకుండా చేస్తాను.’+ 10  “నువ్వు ఈ ప్రజలకు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్లు నిన్ను ఇలా అడుగుతారు: ‘యెహోవా ఇంత గొప్ప విపత్తును మా మీదికి తెస్తానని ఎందుకు చెప్పాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేం చేసిన తప్పేంటి, పాపమేంటి?’+ 11  అప్పుడు నువ్వు ఇలా జవాబివ్వాలి: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఎందుకంటే, మీ పూర్వీకులు నన్ను విడిచిపెట్టారు,+ వాళ్లు వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాటిని పూజిస్తూ, వాటికి వంగి నమస్కారం చేస్తూ వచ్చారు.+ నన్ను మాత్రం వాళ్లు విడిచిపెట్టేశారు, నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.+ 12  మీరు మీ పూర్వీకుల కన్నా చాలా ఘోరంగా ప్రవర్తించారు,+ నాకు లోబడకుండా ప్రతీ ఒక్కరు మొండిగా మీ దుష్ట హృదయాన్ని అనుసరిస్తున్నారు.+ 13  కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశంలో నుండి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి విసిరేస్తాను,+ అక్కడ మీరు రాత్రింబగళ్లు వేరే దేవుళ్లను పూజిస్తారు.+ ఎందుకంటే, నేను మీ మీద ఏమాత్రం అనుగ్రహం చూపించను.” ’ 14  “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘అయితే ఒక కాలం రాబోతుంది. అప్పుడు ప్రజలు, “ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!” అని ఇక అనరు;+ 15  బదులుగా, “ఉత్తర దేశం నుండి, తాను ఏయే దేశాలకు వాళ్లను చెదరగొట్టాడో ఆ దేశాలన్నిటి నుండి ఇశ్రాయేలీయుల్ని తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!” అని అంటారు. నేను వాళ్లను తమ దేశానికి, అంటే వాళ్ల పూర్వీకులకు నేనిచ్చిన దేశానికి తిరిగి తీసుకొస్తాను.’+ 16  ‘నేను చాలామంది జాలరుల్ని పిలిపిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,‘వాళ్లు వాళ్లను వెదికి పట్టుకుంటారు. ఆ తర్వాత నేను చాలామంది వేటగాళ్లను పిలిపిస్తాను,వాళ్లు ప్రతీ పర్వతం మీద, ప్రతీ కొండ మీద, బండల సందుల్లో వాళ్లను వేటాడతారు. 17  ఎందుకంటే వాళ్లు చేసే ప్రతీదాన్ని నా కళ్లు చూస్తున్నాయి. వాటిని నాకు కనబడకుండా దాచలేరు,వాళ్ల దోషం నా కళ్లకు కనిపిస్తూనే ఉంది. 18  అయితే ముందుగా వాళ్ల అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి వాళ్లను తగినవిధంగా శిక్షిస్తాను,+ఎందుకంటే వాళ్లు ప్రాణంలేని అసహ్యమైన విగ్రహాలతో నా దేశాన్ని అపవిత్రపర్చారు,నా స్వాస్థ్యాన్ని హేయమైన వాటితో నింపేశారు.’ ”+ 19  యెహోవా, నా బలమా, నా బలమైన దుర్గమా,కష్టకాలంలో నా ఆశ్రయమా,+భూమి అంచుల నుండి దేశాలు నీ దగ్గరికి వస్తాయి,వాళ్లు ఇలా అంటారు: “మా పూర్వీకులు విగ్రహాల్ని,* వ్యర్థతను, ఎందుకూ పనికిరానివాటిని స్వాస్థ్యంగా పొందారు.”+ 20  మనిషి దేవుళ్లను చేసుకోగలడా?అవి దేవుళ్లే కాదు.+ 21  “కాబట్టి నేను వాళ్లకు తెలిసేలా చేస్తాను,నా శక్తిని, నా బలాన్ని ఈ సమయంలో వాళ్లకు తెలిసేలా చేస్తాను,నా పేరు యెహోవా అని వాళ్లు తెలుసుకుంటారు.”

అధస్సూచీలు

ఇవి మతభ్రష్ట ఇశ్రాయేలులో దుఃఖిస్తున్నప్పుడు పాటించిన అన్యమత ఆచారాలని తెలుస్తోంది.
అక్ష., “అబద్ధాన్ని.”