యిర్మీయా 24:1-10
-
మంచి అంజూర పండ్లు, చెడ్డ అంజూర పండ్లు (1-10)
24 బబులోను రాజు నెబుకద్నెజరు* యెరూషలేము నుండి యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను,*+ అతనితో పాటు యూదా అధిపతుల్ని, చేతిపనివాళ్లను, కమ్మరి వాళ్లను* బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత,+ యెహోవా మందిరం ముందున్న రెండు అంజూర పండ్ల గంపల్ని యెహోవా నాకు చూపించాడు.
2 ఒక గంపలో తొలి అంజూర పండ్ల లాంటి చాలా మంచి అంజూర పండ్లు ఉన్నాయి, మరో గంపలో తినడానికి వీలుకానంత చెడ్డ అంజూర పండ్లు ఉన్నాయి.
3 అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. అందుకు నేను, “అంజూర పండ్లు కనిపిస్తున్నాయి; మంచి అంజూర పండ్లు చాలా బాగున్నాయి, కానీ చెడ్డవి తినలేనంత చెడ్డగా ఉన్నాయి” అన్నాను.
4 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
5 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ స్థలం నుండి కల్దీయుల దేశానికి బందీలుగా పంపించిన యూదా వాళ్లను ఈ మంచి అంజూర పండ్లలా ఎంచుతాను, వాళ్లకు మంచి చేస్తాను.
6 వాళ్లకు మంచి చేయడానికి నేను వాళ్లమీద దృష్టి నిలుపుతాను, వాళ్లను ఈ దేశానికి తిరిగి రప్పిస్తాను.+ నేను వాళ్లను కడతాను గానీ కూలగొట్టను; నాటుతాను గానీ పెల్లగించను.+
7 నేను యెహోవానని తెలుసుకునే హృదయాన్ని వాళ్లకు ఇస్తాను.+ వాళ్లు నిండు హృదయంతో నా దగ్గరికి తిరిగొస్తారు కాబట్టి, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.+
8 “ ‘అయితే తినడానికి వీలుకానంత చెడ్డగా ఉన్న చెడ్డ అంజూర పండ్ల గురించి+ యెహోవా ఇలా అంటున్నాడు: “నేను యూదా రాజైన సిద్కియాను,+ అతని అధిపతుల్ని, ఈ దేశంలో గానీ ఐగుప్తు దేశంలో గానీ నివసిస్తున్న మిగిలిన యెరూషలేము ప్రజల్ని+ ఈ అంజూర పండ్లలా ఎంచుతాను.
9 నేను వాళ్లమీదికి తీసుకొచ్చే విపత్తును చూసి భూమ్మీది రాజ్యాలన్నీ భయపడతాయి.+ ప్రజలు వాళ్లను నిందిస్తారు; వాళ్లమీద సామెత చెప్పుకుంటారు; నేను వాళ్లను చెదరగొట్టే స్థలాలన్నిటిలో+ ప్రజలు వాళ్లను ఎగతాళి చేస్తారు, శపిస్తారు.+
10 నేను వాళ్లకూ వాళ్ల పూర్వీకులకూ ఇచ్చిన దేశం నుండి వాళ్లు తుడిచిపెట్టుకుపోయేంత వరకు వాళ్లమీదికి ఖడ్గాన్ని, కరువును, తెగులును+ పంపిస్తాను.” ’ ”+
అధస్సూచీలు
^ అక్ష., “నెబుకద్రెజరు.”
^ యెహోయాకీను, కొన్యా అని కూడా పిలవబడ్డాడు.
^ లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లను” అయ్యుంటుంది.