యిర్మీయా 32:1-44
32 యూదా రాజు సిద్కియా పరిపాలన 10వ సంవత్సరంలో, అంటే నెబుకద్నెజరు* పరిపాలన 18వ సంవత్సరంలో యెహోవా నుండి ఈ వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.+
2 ఆ సమయంలో బబులోను రాజు సైన్యాలు యెరూషలేమును ముట్టడిస్తున్నాయి, యిర్మీయా ప్రవక్త యూదా రాజు రాజభవనంలోని కాపలాదారుల ప్రాంగణంలో+ బంధించబడి ఉన్నాడు.
3 యూదా రాజు సిద్కియా ఇలా అంటూ అతన్ని బంధించాడు:+ “నువ్వు ఎందుకు ఇలా ప్రవచిస్తున్నావు? ఎందుకు ఇలా అంటున్నావు, ‘యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను ఈ నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతను దాన్ని జయిస్తాడు,+
4 యూదా రాజు సిద్కియా కల్దీయుల నుండి తప్పించుకోడు, అతను ఖచ్చితంగా బబులోను రాజు చేతికి అప్పగించబడతాడు, అతను బబులోను రాజును కళ్లారా చూస్తాడు, అతనితో ముఖాముఖిగా మాట్లాడతాడు.” ’+
5 ‘అతను సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని మీద దృష్టిపెట్టే వరకు అతను అక్కడే ఉంటాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నువ్వు కల్దీయులతో పోరాడుతూనే ఉన్నా విజయం సాధించవు.’ ”+
6 యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:
7 ‘ఇదిగో, నీ తండ్రి సహోదరుడైన షల్లూము కుమారుడు హనమేలు నీ దగ్గరికి వచ్చి, “అనాతోతులో+ ఉన్న నా పొలాన్ని కొనుక్కో, ఎందుకంటే దాన్ని తిరిగి కొనే హక్కు మొదట నీకే ఉంది” అని అంటాడు.’ ”+
8 యెహోవా చెప్పినట్టే నా తండ్రి సహోదరుడి కుమారుడైన హనమేలు, కాపలాదారుల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు: “దయచేసి బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను, ఎందుకంటే దాన్ని తిరిగి కొనుక్కుని సొంతం చేసుకునే హక్కు నీకే ఉంది. నువ్వే దాన్ని కొనుక్కో.” దాంతో యెహోవాయే అలా జరగాలని అనుకుంటున్నాడని నాకు అర్థమైంది.
9 కాబట్టి నేను నా తండ్రి సహోదరుని కుమారుడైన హనమేలుకు ఏడు షెకెల్‌లు,* పది వెండి రూకలు తూచి ఇచ్చి+ అనాతోతులోని ఆ పొలం కొన్నాను.
10 తర్వాత నేను ఒక దస్తావేజులో దాన్ని రాయించి,+ ముద్రవేసి, సాక్షుల్ని పిలిపించి,+ డబ్బును త్రాసులో కొలిచాను.
11 తర్వాత నేను ఆ క్రయపత్రాన్ని, అంటే నిబంధనల ప్రకారం, చట్టప్రకారం ముద్రవేసిన దస్తావేజును, అలాగే ముద్రవేయని దస్తావేజును తీసుకుని,
12 నా తండ్రి సహోదరుని కుమారుడైన హనమేలు సమక్షంలో, క్రయపత్రం మీద సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కాపలాదారుల ప్రాంగణం+ దగ్గర కూర్చున్న యూదులందరి సమక్షంలో మహసేయా మనవడూ నేరీయా+ కుమారుడూ అయిన బారూకుకు+ ఆ క్రయపత్రాన్ని ఇచ్చాను.
13 తర్వాత నేను వాళ్ల సమక్షంలో బారూకుకు ఇలా ఆజ్ఞాపించాను:
14 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఈ క్రయపత్రాన్ని, అంటే ముద్రవేసిన దస్తావేజును, ముద్రవేయని దస్తావేజును రెండిటినీ తీసుకొని, అవి చాలాకాలం ఉండేలా వాటిని ఒక మట్టి కుండలో పెట్టు.’
15 ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ దేశంలో ప్రజలు మళ్లీ ఇళ్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’ ”+
16 నేను ఆ క్రయపత్రాన్ని నేరీయా కుమారుడైన బారూకుకు ఇచ్చిన తర్వాత యెహోవాకు ఇలా ప్రార్థించాను:
17 “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ఇదిగో! నువ్వు నీ గొప్ప శక్తితో, చాచిన బాహువుతో భూమ్యాకాశాల్ని సృష్టించావు.+ నీకు అసాధ్యమైనదేదీ లేదు;
18 నువ్వు వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తావు; అయితే తండ్రుల దోషశిక్షను వాళ్ల తర్వాత వాళ్ల పిల్లల మీదికి రప్పిస్తావు;+ నువ్వు సత్యదేవుడివి, గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, సైన్యాలకు అధిపతైన యెహోవా నీ పేరు.
19 నీ ఆలోచన* గొప్పది, నువ్వు గొప్ప శక్తితో పనిచేస్తావు;+ ప్రతీ ఒక్కరికి వాళ్ల మార్గాల్ని బట్టి, పనుల్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి+ నీ కనుదృష్టి మనుషుల మార్గాలన్నిటి మీద ఉంది.+
20 నువ్వు ఐగుప్తు దేశంలో సూచనలు, అద్భుతాలు చేశావు, ఇప్పటికీ ప్రజలకు వాటి గురించి తెలుసు; అలా నువ్వు ఇశ్రాయేలులో, మనుషులందరి మధ్య కీర్తిని* సంపాదించుకున్నావు.+
21 నువ్వు సూచనలు, అద్భుతాలు, భీకర కార్యాలు చేసి, బలమైన చేతితో, చాచిన బాహువుతో నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చావు.+
22 “చివరికి, నువ్వు వాళ్ల పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన పాలుతేనెలు ప్రవహించే ఈ దేశాన్ని+ వాళ్లకు ఇచ్చావు.+
23 వాళ్లు వచ్చి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు; కానీ నీ మాట వినలేదు, నీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. నువ్వు వాళ్లకు ఆజ్ఞాపించినదేదీ వాళ్లు చేయలేదు, అందుకే నువ్వు ఈ విపత్తు అంతా వాళ్లమీదికి రప్పించావు.+
24 ఇదిగో! నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనుషులు నగరం చుట్టూ ముట్టడిదిబ్బలు కట్టారు.+ ఈ నగరం ఖచ్చితంగా ఖడ్గం వల్ల,+ కరువు వల్ల, తెగులు వల్ల+ దానితో పోరాడుతున్న కల్దీయుల చేతుల్లోకి వెళ్లిపోతుంది; నువ్వు చెప్పినదంతా జరిగింది. అది నువ్వు చూస్తూనే ఉన్నావు.
25 అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నగరం ఖచ్చితంగా కల్దీయుల చేతికి అప్పగించబడుతున్నా నువ్వు నాతో, ‘డబ్బులిచ్చి పొలం కొనుక్కో, సాక్షుల్ని పిలువు’ అన్నావు.”
26 అప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:
27 “ఇదిగో నేను యెహోవాను, మనుషులందరికీ దేవుణ్ణి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా?
28 యెహోవా అనే నేను ఇలా చెప్తున్నాను: ‘ఇదిగో, నేను ఈ నగరాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగిస్తున్నాను, అతను దాన్ని జయిస్తాడు.+
29 ఈ నగరంతో పోరాడుతున్న కల్దీయులు వచ్చి, దానికి నిప్పంటించి, కాల్చేస్తారు.+ అలాగే ప్రజలు ఏయే ఇళ్ల పైకప్పుల మీద బయలుకు బలులు, ఇతర దేవుళ్లకు పానీయార్పణలు అర్పించి నాకు కోపం తెప్పించారో+ ఆ ఇళ్లన్నిటినీ వాళ్లు కాల్చేస్తారు.’
30 “ ‘ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు చిన్నప్పటి నుండి నా దృష్టిలో చెడ్డవైనవి తప్ప ఇంకేమీ చేయలేదు;+ ఇశ్రాయేలు ప్రజలు తమ చేతుల పనులతో నాకు కోపం తెప్పిస్తూ ఉన్నారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
31 ‘వాళ్లు ఈ నగరాన్ని కట్టిన రోజు నుండి ఈ రోజు వరకు అది నాకు కోపం, ఆగ్రహం తెప్పించడం తప్ప ఇంకేమీ చేయలేదు,+ కాబట్టి అది ఖచ్చితంగా నా ఎదుట నుండి తీసేయబడాలి;+
32 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అంటే వాళ్లు, వాళ్ల రాజులు,+ వాళ్ల అధిపతులు,+ వాళ్ల యాజకులు, వాళ్ల ప్రవక్తలు,+ యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు నాకు కోపం తెప్పించడానికి చేసిన చెడు అంతటిని బట్టి అది తీసేయబడాలి.
33 వాళ్లు నాకు ముఖం చూపించే బదులు వీపునే చూపించారు;+ నేను వాళ్లకు పదేపదే* బోధించడానికి ప్రయత్నించినా ఎవ్వరూ వినలేదు, క్రమశిక్షణను స్వీకరించలేదు.+
34 నా పేరు పెట్టబడిన మందిరంలో వాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల్ని పెట్టి దాన్ని అపవిత్రం చేశారు.+
35 అంతేకాదు బెన్‌హిన్నోము* లోయలో+ బయలుకు ఉన్నత స్థలాలు కట్టి, తమ కుమారుల్ని, కూతుళ్లను మోలెకు కోసం అగ్నిలో వేసి కాల్చారు.*+ అలాంటి అసహ్యమైన పని చేయమని నేను వాళ్లకు ఆజ్ఞాపించలేదు,+ కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు. అలా యూదా ఘోరమైన పాపం చేసింది.’
36 “ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల బబులోను రాజు చేతికి అప్పగించబడుతుందని మీరు అంటున్న ఈ నగరం గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు:
37 ‘కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేను వాళ్లను ఏయే దేశాలకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటి నుండి నేను వాళ్లను సమకూర్చి,+ ఈ స్థలానికి తిరిగి తీసుకొచ్చి, ఇక్కడ సురక్షితంగా నివసించేలా చేస్తాను.+
38 వాళ్లు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.+
39 వాళ్ల మంచి కోసం, వాళ్ల తర్వాత వాళ్ల పిల్లల మంచి కోసం వాళ్లు నాకు ఎప్పుడూ భయపడుతూ ఉండేలా నేను వాళ్లకు ఒకే హృదయాన్ని ఇస్తాను,+ ఒకే మార్గంలో నడిచేలా చేస్తాను.+
40 వాళ్లకు మంచి చేయడం మానను+ అని వాళ్లతో ఒక శాశ్వత ఒప్పందం చేస్తాను;+ వాళ్లు నాకు దూరమవ్వకుండా వాళ్ల హృదయాల్లో నా పట్ల భయాన్ని పెడతాను.
41 నేను వాళ్లకు మంచి చేయడానికి సంతోషిస్తాను,+ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* వాళ్లను ఈ దేశంలో స్థిరంగా నాటతాను.’ ”+
42 “ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ ప్రజల మీదికి ఈ గొప్ప విపత్తు అంతటినీ తీసుకొచ్చినట్టే, నేను వాళ్లకు వాగ్దానం చేస్తున్న మంచివన్నీ వాళ్లకు ఇస్తాను.*+
43 “ఇది మనుషులు గానీ జంతువులు గానీ లేని పాడుబడ్డ భూమి, ఇది కల్దీయుల చేతికి అప్పగించబడింది” అని మీరు అంటున్నా, ఈ దేశంలో ప్రజలు మళ్లీ పొలాలు కొంటారు.’
44 “ ‘బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో, యూదా నగరాల్లో,+ పర్వత ప్రాంతంలోని నగరాల్లో, మైదానంలోని నగరాల్లో,+ దక్షిణ ప్రాంతంలోని నగరాల్లో ప్రజలు డబ్బులిచ్చి పొలాలు కొంటారు,+ క్రయపత్రాల్ని రాసి ముద్ర వేస్తారు, సాక్షుల్ని పిలిపిస్తారు. ఎందుకంటే, బందీలుగా వెళ్లిన ఈ ప్రజల్ని నేను తిరిగి తీసుకొస్తాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”
అధస్సూచీలు
^ అక్ష., “నెబుకద్రెజరు.”
^ అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “ఉద్దేశాలు.”
^ అక్ష., “పేరును.”
^ అక్ష., “నెబుకద్రెజరు.”
^ అక్ష., “పెందలకడే లేచి.”
^ అక్ష., “అగ్ని గుండా దాటించారు.”
^ లేదా “మంచితనమంతా వాళ్లమీద చూపిస్తాను.”