యిర్మీయా 4:1-31

  • పశ్చాత్తాపపడితే దీవెనలు వస్తాయి (1-4)

  • ఉత్తరం నుండి విపత్తు వస్తుంది (5-18)

  • రాబోయే విపత్తును బట్టి యిర్మీయా ఆవేదన (19-31)

4  యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలూ, నువ్వు తిరిగొస్తే,నా దగ్గరికి తిరిగొచ్చి నీ అసహ్యమైన విగ్రహాల్ని నా ముందు నుండి తీసేస్తే,నువ్వు దేశదిమ్మరిగా ఉండవు.+   నువ్వు ‘యెహోవా జీవం తోడు’ అనిసత్యంతో, న్యాయంతో, నీతితో ప్రమాణం చేస్తే, అప్పుడు దేశాలు ఆయన* దీవెన పొందుతాయి,ఆయన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటాయి.”+  యూదా, యెరూషలేము ప్రజలతో యెహోవా ఇలా అంటున్నాడు: “సాగుచేయని భూమిని మీకోసం దున్నండి,ముళ్ల మధ్య విత్తనాలు విత్తకండి.+   యూదా, యెరూషలేము ప్రజలారా,యెహోవా కోసం సున్నతి చేసుకోండి,మీ హృదయాలకు సున్నతి చేసుకోండి,+లేకపోతే మీ చెడ్డపనుల వల్లనా కోపం అగ్నిలా రగులుకొని కాల్చేస్తుంది,దాన్ని ఎవరూ ఆర్పలేరు.”+   యూదాలో దాన్ని ప్రకటించండి, యెరూషలేములో దాన్ని చాటించండి. దేశమంతటా బూర* ఊదుతూ, కేకలు వేస్తూ,+ బిగ్గరగా ఇలా చెప్పండి: “అందరూ సమకూడండి,మనం ప్రాకారాలుగల నగరాలకు పారిపోదాం.+   సీయోను వైపు ధ్వజం* ఎత్తండి. ఆశ్రయం కోసం వెదకండి, ఊరికే నిలబడకండి.” ఎందుకంటే, నేను ఉత్తరం నుండి విపత్తును, గొప్ప ముప్పును రప్పిస్తున్నాను.+   అతను సింహంలా పొదల్లో నుండి బయటికి వచ్చాడు;+దేశాల్ని నాశనం చేసేవాడు బయల్దేరాడు.+ నీ దేశాన్ని భయంకరంగా మార్చేందుకు అతను తన స్థలం నుండి బయల్దేరాడు. నీ నగరాలు శిథిలాలౌతాయి, వాటిలో ఒక్కరు కూడా నివసించరు.+   కాబట్టి గోనెపట్ట కట్టుకోండి,+గుండెలు బాదుకుంటూ ఏడ్వండి.ఎందుకంటే, యెహోవా కోపాగ్ని మన మీది నుండి తొలగిపోలేదు.   యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజున, రాజు గుండె జారిపోతుంది,+అధిపతులు ధైర్యం కోల్పోతారు;యాజకులు హడలిపోతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”+ 10  అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ‘మీకు శాంతి ఉంటుంది’+ అంటూ నువ్వు ఈ ప్రజల్ని, యెరూషలేమును పూర్తిగా మోసం చేశావు.+ నిజానికి, మా గొంతు మీద కత్తి ఉంది.” 11  ఆ సమయంలో ఈ ప్రజలతో, యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది: “ఎడారిలోని చెట్లులేని కొండల నుండినా ప్రజల కూతురి* మీదికి వడగాలి వీస్తుంది;అది వచ్చేది తూర్పారబట్టడానికో, శుభ్రం చేయడానికో కాదు. 12  నా పిలుపు విని, ఆ చోట్ల నుండి అది బలంగా వీస్తూ వస్తుంది. ఇప్పుడు నేను వాళ్లమీద తీర్పులు ప్రకటిస్తాను. 13  ఇదిగో! శత్రువు వానమబ్బుల్లా వస్తాడు,అతని రథాలు సుడిగాలిలా వస్తాయి.+ అతని గుర్రాలు గద్దల కన్నా వేగంగా పరుగెత్తుతాయి.+ అయ్యో, మనకు శ్రమ, మనం నాశనమైపోయాం! 14  యెరూషలేమా, నీ హృదయంలో నుండి దుష్టత్వాన్ని కడిగేయి, అప్పుడే నువ్వు కాపాడబడతావు.+ ఎంతకాలం నీ హృదయంలో దుష్ట ఆలోచనలకు చోటిస్తావు? 15  దాను నుండి ఒక స్వరం వినిపిస్తుంది,+అది ఎఫ్రాయిము కొండల్లో నుండి విపత్తును చాటిస్తుంది. 16  దాని గురించి దేశాలకు చెప్పండి;యెరూషలేముకు వ్యతిరేకంగా దాన్ని చాటించండి.” “దూరదేశం నుండి ముట్టడిదారులు వస్తున్నారు,వాళ్లు యూదా నగరాల మీద యుద్ధకేకలు వేస్తారు. 17  వాళ్లు మైదానాల కాపలాదారుల్లా అన్నివైపుల నుండి ఆమె మీదికి వస్తారు.+ఎందుకంటే, ఆమె నా మీద తిరుగుబాటు చేసింది”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 18  “నీ ప్రవర్తనకు, నీ పనులకు నువ్వు మూల్యం చెల్లించాలి.+ నీ విపత్తు చాలా ఘోరంగా ఉంటుంది,అది ఏకంగా నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది!” 19  అయ్యో నా ఆవేదన,* నా ఆవేదన! నా హృదయం ఎంతో వేదన పడుతుంది. నా గుండె దడదడ కొట్టుకుంటోంది. నేను మౌనంగా ఉండలేను,ఎందుకంటే, నాకు బూర శబ్దం వినిపించింది,యుద్ధ ఘంటిక* వినిపించింది.+ 20  ఆపద గురించిన వార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి,ఎందుకంటే దేశమంతా నాశనమైపోయింది. ఉన్నట్టుండి నా డేరాలు,ఒక్క క్షణంలో నా డేరా తెరలు నాశనమైపోయాయి.+ 21  ఎంతకాలం నేను ధ్వజాన్ని* చూస్తూ,బూర శబ్దాన్ని వింటూ ఉండాలి?+ 22  దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు తెలివితక్కువవాళ్లు;+వాళ్లు నన్ను ఏమాత్రం లెక్కచేయరు. నా పిల్లలు మూర్ఖులు, వాళ్లకు కొంచెం కూడా అవగాహన లేదు. చెడు చేసే విషయంలో వాళ్లు చాలా తెలివైనవాళ్లు,కానీ మంచి చేయడం మాత్రం వాళ్లకు తెలీదు.” 23  నేను దేశాన్ని చూసినప్పుడు అది ఖాళీగా, నిర్మానుష్యంగా ఉంది!+ ఆకాశాన్ని చూసినప్పుడు అక్కడ వెలుగు లేదు.+ 24  పర్వతాల్ని చూసినప్పుడు అవి కంపిస్తూ ఉన్నాయి,కొండలు వణికిపోతూ ఉన్నాయి.+ 25  నేను చూసినప్పుడు, ఒక్క మనిషి కూడా లేడు,ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి.+ 26  నేను చూసినప్పుడు, పండ్ల తోట ఎడారిలా తయారైంది,దాని నగరాలన్నీ కూలిపోయాయి.+ యెహోవా వల్ల, ఆయన కోపాగ్ని వల్ల ఇలా జరిగింది. 27  ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “దేశమంతా నిర్జనమౌతుంది,+అయితే నేను దాన్ని పూర్తిగా తుడిచిపెట్టను. 28  ఈ కారణాన్ని బట్టి దేశం దుఃఖిస్తుంది,+పైనున్న ఆకాశం చీకటౌతుంది.+ ఎందుకంటే నేను చెప్పాను, నిర్ణయించాను,నా మనసు మార్చుకోను,* చర్య తీసుకోకుండా ఉండను.+ 29  గుర్రపురౌతుల శబ్దం, విలుకాండ్ర శబ్దం వినినగర వాసులంతా పారిపోతారు.+ వాళ్లు పొదల్లోకి దూరతారు,బండలు ఎక్కుతారు.+ ప్రతీ నగరం నిర్మానుష్యమౌతుంది,వాటిలో ఎవ్వరూ నివసించరు.” 30  నువ్వు నాశనమైపోయావు, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ముదురు ఎరుపు రంగు బట్టలు వేసుకునేదానివి,బంగారు నగలు పెట్టుకునేదానివి,కాటుకతో నీ కళ్లు పెద్దవి చేసుకునేదానివి. అయితే అందంగా తయారవ్వడానికి నువ్వు పడిన ప్రయాస అంతా వృథా,+ఎందుకంటే, నీ మీద మోజుపడిన వాళ్లు నిన్ను తిరస్కరించారు;ఇప్పుడు వాళ్లు నీ ప్రాణం తీయాలని చూస్తున్నారు.+ 31  ఎందుకంటే, నొప్పులతో ఉన్న స్త్రీ అరుపు లాంటి శబ్దం నాకు వినిపించింది,అది తన మొదటి బిడ్డను కంటున్న స్త్రీ వేదన లాంటి శబ్దం,కష్టంగా ఊపిరి తీసుకుంటున్న సీయోను కూతురి స్వరం. ఆమె తన చేతులు చాపుతూ+ ఇలా అంది: “అయ్యో, నాకు శ్రమ, హంతకుల వల్ల నా ప్రాణం అలసిపోయింది!”

అధస్సూచీలు

అంటే, యెహోవా.
అక్ష., “కొమ్ము.”
లేదా “ధ్వజస్తంభం.”
బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.
అక్ష., “నా పేగులు.”
లేదా “యుద్ధకేక శబ్దం” అయ్యుంటుంది.
లేదా “ధ్వజస్తంభాన్ని.”
లేదా “విచారపడను.”