యిర్మీయా 42:1-22

  • నిర్దేశం కోసం ప్రార్థించమని ప్రజలు యిర్మీయాను అడగడం (1-6)

  • “ఐగుప్తుకు వెళ్లొద్దు” అని యెహోవా చెప్పడం (7-22)

42  అప్పుడు సైన్యాధిపతులందరూ, అలాగే కారేహ కుమారుడైన యోహానాను,+ హోషయా కుమారుడైన యెజన్యా, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు ప్రజలందరూ వచ్చి  యిర్మీయా ప్రవక్తతో ఇలా అన్నారు: “దయచేసి, మా మనవి అంగీకరించి, మా తరఫున, మిగిలిన ఈ ప్రజలందరి తరఫున నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే, ఒకప్పుడు మేము ఎంతమందిమి ఉండేవాళ్లమో, ఇప్పుడు ఎంత తక్కువమందిమి మిగిలామో+ నువ్వు చూస్తున్నావు కదా.  మేము ఏ మార్గంలో నడవాలో, ఏంచేయాలో నీ దేవుడైన యెహోవా మాకు చెప్పాలి.”  అప్పుడు యిర్మీయా ప్రవక్త వాళ్లతో ఇలా అన్నాడు: “సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు కోరినట్టే మీ దేవుడైన యెహోవాకు ప్రార్థిస్తాను; యెహోవా మీకు చెప్పమన్న ప్రతీమాట మీకు చెప్తాను. ఒక్కమాట కూడా దాచను.”  దానికి వాళ్లు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ ద్వారా నీ దేవుడైన యెహోవా మాకు నిర్దేశించిందంతా మేము చేయకపోతే, యెహోవా మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండాలి.  మాకు నచ్చినా నచ్చకపోయినా, మేము నిన్ను పంపిస్తున్న మా దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం; ఎందుకంటే మా దేవుడైన యెహోవా స్వరానికి లోబడితే మాకు మంచి జరుగుతుంది.”  పది రోజుల తర్వాత యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.  కాబట్టి అతను కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు ప్రజలందర్నీ పిలిపించాడు.+  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీ తరఫున వేడుకోమని మీరు నన్ను ఎవరి దగ్గరికైతే పంపించారో, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 10  ‘మీరు ఈ దేశంలోనే ఉండిపోతే, నేను మిమ్మల్ని కడతాను గానీ పడగొట్టను, నాటుతాను గానీ పెల్లగించను. ఎందుకంటే మీ మీదికి రప్పించిన విపత్తు విషయంలో నేను విచారపడతాను.*+ 11  మీరు బబులోను రాజుకు భయపడుతున్నారు, అలా భయపడకండి.’+ “యెహోవా ఇలా అంటున్నాడు: ‘అతనికి భయపడకండి, ఎందుకంటే అతని చేతిలో నుండి మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని తప్పించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. 12  నేను మీ మీద కరుణ చూపిస్తాను,+ అతను మీ మీద కరుణ చూపించి, మీ దేశానికి మిమ్మల్ని తిరిగి పంపిస్తాడు. 13  “ ‘అయితే మీరు, “లేదు, మేము ఈ దేశంలో ఉండము!” అని అంటే, మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడకుండా, 14  “లేదు, మేము ఐగుప్తు దేశానికి వెళ్తాం,+ అక్కడ మాకు యుద్ధం చూడాల్సిన, బూర* శబ్దం వినాల్సిన, ఆహారం కోసం అలమటించాల్సిన పరిస్థితి రాదు; మేము అక్కడే నివసిస్తాం” అని అంటే, 15  యూదాలో మిగిలినవాళ్లారా, యెహోవా చెప్పే మాట వినండి. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు ఐగుప్తుకు వెళ్లాలని బలంగా తీర్మానించుకొని ఉంటే, అక్కడ నివసించడానికి* వెళ్తే, 16  మీరు ఏ ఖడ్గానికైతే భయపడుతున్నారో ఆ ఖడ్గం అక్కడ ఐగుప్తు దేశంలో మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు ఏ కరువుకైతే భయపడుతున్నారో ఆ కరువు మీ వెనకే ఐగుప్తుకు వస్తుంది, అక్కడే మీరు చనిపోతారు.+ 17  ఐగుప్తుకు వెళ్లి అక్కడ నివసించాలని తీర్మానించుకున్న వాళ్లంతా ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు. నేను వాళ్లమీదికి తీసుకొచ్చే విపత్తును వాళ్లలో ఏ ఒక్కరూ తప్పించుకోరు.” ’ 18  “ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఒకవేళ మీరు ఐగుప్తుకు వెళ్తే, యెరూషలేము నివాసుల మీద నా కోపం, నా ఆగ్రహం ఎలా కుమ్మరించబడ్డాయో+ అలాగే మీ మీద కూడా నా ఆగ్రహం కుమ్మరించబడుతుంది; మీరు శాపానికి గురౌతారు, ప్రజలు మిమ్మల్ని చూసి భయపడతారు, మీరు అవమానానికి, నిందకు గురౌతారు.+ ఈ స్థలాన్ని మీరు ఇంకెప్పుడూ చూడరు.’ 19  “యూదాలో మిగిలినవాళ్లారా, యెహోవా మిమ్మల్ని ఐగుప్తుకు వెళ్లొద్దని అన్నాడు. దాని గురించి ఈ రోజు నేను మిమ్మల్ని హెచ్చరించానని మర్చిపోకండి. 20  మీరు అక్కడికి వెళ్తే, మీ దోషాన్ని బట్టి మీ ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరికి నన్ను పంపిస్తూ, ‘మా తరఫున మా దేవుడైన యెహోవాకు ప్రార్థించు, మా దేవుడైన యెహోవా చెప్పే ప్రతీమాట మాకు చెప్పు, మేము దాన్ని పాటిస్తాం’ అన్నారు.+ 21  ఇదిగో ఈ రోజు నేను మీకు చెప్పాను, కానీ మీరు మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడరు, నా ద్వారా ఆయన మీకు చెప్పినదేదీ మీరు చేయరు.+ 22  కాబట్టి ఈ విషయం తెలుసుకోండి, మీరు ఎక్కడికైతే వెళ్లి నివసించాలని అనుకుంటున్నారో అక్కడ మీరు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు, ఇది ఖచ్చితం.”+

అధస్సూచీలు

లేదా “దుఃఖపడతాను.”
అక్ష., “కొమ్ము.”
లేదా “కొంతకాలం నివసించడానికి.”