యిర్మీయా 46:1-28

  • ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-26)

    • ఐగుప్తును నెబుకద్నెజరు జయించడం (13, 26)

  • ఇశ్రాయేలుకు వాగ్దానాలు (27, 28)

46  దేశాల గురించి యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.+  ఇది ఐగుప్తు+ గురించి, ఐగుప్తు రాజైన ఫరో+ నెకో సైన్యం గురించి వచ్చిన వాక్యం; యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన నాలుగో సంవత్సరంలో యూఫ్రటీసు నది పక్కన కర్కెమీషు దగ్గర బబులోను రాజైన నెబుకద్నెజరు* ఫరోను ఓడించాడు:   “చిన్న డాళ్లను,* పెద్ద డాళ్లను సిద్ధం చేసుకోండి,యుద్ధం కోసం ముందుకు సాగండి.   రౌతులారా, గుర్రాలకు జీను* కట్టి ఎక్కి కూర్చోండి. శిరస్త్రాణం* పెట్టుకుని, మీ మీ స్థానాల్లో ఉండండి. ఈటెలకు పదును పెట్టండి, కవచాలు ధరించుకోండి.   ‘వాళ్లు ఎందుకు హడలిపోయినట్టు కనిపిస్తున్నారు? వాళ్లు వెనుతిరుగుతున్నారు, వాళ్ల యోధులు నలగ్గొట్టబడ్డారు. వాళ్లు భయంతో పారిపోయారు, వాళ్ల యోధులు వెనక్కి తిరిగి చూడలేదు. అంతటా భయం అలుముకుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.   ‘వేగంగా పరుగెత్తేవాళ్లు పారిపోలేరు, యోధులు తప్పించుకోలేరు. ఉత్తరం వైపు, యూఫ్రటీసు నది ఒడ్డునవాళ్లు తడబడి పడిపోయారు.’+   నైలు నదిలా, ఉప్పొంగే నదీ ప్రవాహాల్లాపైకి వస్తున్న ఇతను ఎవరు?   నైలు నదిలా,+ ఉప్పొంగే నదీ ప్రవాహాల్లాఐగుప్తు పైకి వస్తోంది,అది ఇలా అంటోంది: ‘నేను పొంగిపొర్లి భూమిని కప్పేస్తాను. ఆ నగరాన్ని, దాని నివాసుల్ని నాశనం చేస్తాను.’   గుర్రాల్లారా, ముందుకు సాగండి! రథాల్లారా, పిచ్చిగా పరుగులు తీయండి! యోధులు ముందుకు సాగాలి;డాలును పట్టుకునే కూషు, పూతు వాళ్లు,+ విల్లును వంచే లూదీయులు+ ముందుకు సాగాలి.+ 10  “అది సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు చెందిన రోజు, ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకునే ప్రతీకార రోజు. ఖడ్గం కడుపునిండా తింటుంది, వాళ్ల రక్తంతో దాహం తీర్చుకుంటుంది. ఎందుకంటే ఉత్తర దేశంలో, యూఫ్రటీసు నది+ ఒడ్డున సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు ఒక బలి* ఉంది. 11  ఐగుప్తు కన్యా,సాంబ్రాణి తెచ్చుకోవడానికి గిలాదుకు వెళ్లు.+ నువ్వు అనవసరంగా చాలా ఔషధాలు వాడావు,కానీ నీకు చికిత్స లేదు.+ 12  దేశాలు నీ అవమానం గురించి విన్నాయి,+దేశం నీ ఆర్తనాదాలతో నిండిపోయింది. ఎందుకంటే, యోధులు ఒకరికొకరు తగిలి పడిపోతున్నారు.” 13  ఐగుప్తు దేశాన్ని ఓడించడానికి బబులోను రాజు నెబుకద్నెజరు* రావడం గురించి యిర్మీయా ప్రవక్తకు యెహోవా చెప్పిన వాక్యం:+ 14  “ఐగుప్తులో చాటించండి, మిగ్దోలులో+ ప్రకటించండి. నోఫులో,* తహపనేసులో+ చాటిచెప్పండి. ఇలా చెప్పండి: ‘మీ మీ స్థానాల్లో నిలబడి, సిద్ధంగా ఉండండి,ఎందుకంటే, ఖడ్గం మీ చుట్టూరా నాశనం చేస్తుంది. 15  నీ బలాఢ్యులు ఎందుకు తుడిచిపెట్టబడ్డారు? వాళ్లు నిలబడలేకపోయారుఎందుకంటే, యెహోవా వాళ్లను కిందికి తోసేశాడు. 16  వాళ్లు పెద్ద సంఖ్యలో తడబడి పడిపోతున్నారు. వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అంటున్నారు: “లెండి! క్రూరమైన ఖడ్గాన్ని తప్పించుకునిమన ప్రజల దగ్గరికి, మన స్వదేశానికి తిరిగెళ్దాం.” ’ 17  వాళ్లు అక్కడ ఇలా ప్రకటించారు,‘ఐగుప్తు రాజు ఫరో ఊరికే గొప్పలు చెప్పుకుంటాడు,అతను అవకాశాన్ని* చేజార్చుకున్నాడు.’+ 18  సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు ఇలా ప్రకటిస్తున్నాడు:‘నా జీవం తోడు, అతను* పర్వతాల మధ్య ఉన్న తాబోరులా,+సముద్రం పక్కన ఉన్న కర్మెలులా+ వస్తాడు. 19  ఐగుప్తులో నివసిస్తున్న కూతురా,చెరలోకి వెళ్లడానికి నీ సంచి సిద్ధం చేసుకో, ఎందుకంటే, నోఫు* భయంకరంగా తయారౌతుంది;అది అగ్నితో కాల్చేయబడుతుంది,* దానిలో ఎవ్వరూ నివసించరు.+ 20  ఐగుప్తు అందమైన ఆవుదూడ లాంటిది,అయితే ఉత్తర దిక్కు నుండి కందిరీగలు దానిమీదికి వస్తాయి. 21  దాని కిరాయి సైనికులు సైతం కొవ్విన దూడల్లా ఉన్నారు,అయితే వాళ్లు కూడా వెన్నుచూపి పారిపోయారు. వాళ్లు నిలబడలేకపోయారు,+ఎందుకంటే వాళ్లమీదికి ఆపద వచ్చే రోజు,వాళ్లను లెక్క అడిగే సమయం వచ్చేసింది.’ 22  ‘దాని శబ్దం బుసలు కొడుతూ పారిపోతున్న పాము శబ్దంలా ఉంది,ఎందుకంటే శత్రువులు చెట్లను నరికేవాళ్లలాగొడ్డళ్లతో దానిమీదికి వస్తున్నారు.’ 23  యెహోవా ఇలా అంటున్నాడు: ‘దాని అడవి చొరబడలేని విధంగా ఉన్నా, వాళ్లు దాన్ని నరికేస్తారు. ఎందుకంటే వాళ్లు మిడతల కన్నా ఎక్కువ సంఖ్యలో, లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు. 24  ఐగుప్తు కూతురు అవమానాలపాలు అవుతుంది. ఆమె ఉత్తర దేశ ప్రజలకు అప్పగించబడుతుంది.’+ 25  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇప్పుడు నేను నా దృష్టిని నోలో*+ ఉన్న ఆమోను+ మీదికి, ఫరో మీదికి, ఐగుప్తు మీదికి, దాని దేవుళ్ల మీదికి,+ దాని రాజుల మీదికి, అవును ఫరో మీదికి, అతని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లందరి మీదికి మళ్లిస్తున్నాను.’+ 26  “ ‘నేను వాళ్లను వాళ్ల ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, అతని సేవకుల చేతికి అప్పగిస్తాను.+ అయితే కొంతకాలానికి అది మళ్లీ ఒకప్పటిలా నివాస స్థలం అవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ 27  ‘నా సేవకుడివైన యాకోబూ, నువ్వైతే భయపడకు,ఇశ్రాయేలూ, బెదిరిపోకు.+ ఎందుకంటే నేను దూరం నుండి నిన్ను,తాము బందీలుగా ఉన్న దేశం నుండి నీ సంతానాన్ని* కాపాడతాను.+ యాకోబు తిరిగొస్తాడు, ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా ఉంటాడు,వాళ్లను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 28  కాబట్టి నా సేవకుడివైన యాకోబూ, భయపడకు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నిన్ను ఏయే దేశాల మధ్యకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటినీ నేను పూర్తిగా నాశనం చేస్తాను;+కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను.+ అయితే తగిన మోతాదులో నీకు క్రమశిక్షణ ఇస్తాను,*+నిన్ను శిక్షించకుండా మాత్రం ఉండను.’ ”

అధస్సూచీలు

అక్ష., “నెబుకద్రెజరు.”
లేదా “కేడెములను.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
అంటే, హెల్మెట్‌.
లేదా “వధ.”
అక్ష., “నెబుకద్రెజరు.”
లేదా “మెంఫిస్‌లో.”
అక్ష., “నియమిత సమయం.”
అంటే, ఐగుప్తును జయించేవాడు.
లేదా “మెంఫిస్‌.”
లేదా “పాడుబడ్డ భూమి అవుతుంది” అయ్యుంటుంది.
అంటే, థీబ్స్‌.
అక్ష., “నెబుకద్రెజరు.”
అక్ష., “విత్తనాన్ని.”
లేదా “నిన్ను సరిదిద్దుతాను.”