యిర్మీయా 48:1-47
-
మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-47)
48 ఇది మోయాబు+ గురించిన సందేశం. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:
“నెబోకు+ శ్రమ, అది నాశనం చేయబడింది!
కిర్యతాయిము+ అవమానాలపాలైంది, పట్టబడింది.
సురక్షిత స్థలం* అవమానాలపాలైంది, పడగొట్టబడింది.+
2 వాళ్లు ఇక మోయాబును పొగడరు.
‘రండి, దాన్ని ఒక దేశంగా ఉండకుండా చేద్దాం’
అంటూ దాన్ని పడగొట్టడానికి వాళ్లు హెష్బోనులో+ కుట్రపన్నారు.
మద్మేనా, నువ్వు కూడా మౌనంగా ఉండాలి,ఎందుకంటే ఖడ్గం నిన్ను వెంటాడుతోంది.
3 కొల్లగొట్టడం వల్ల, గొప్ప నాశనం వల్లహొరొనయీములో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.+
4 మోయాబు ధ్వంసం చేయబడింది.
దాని చిన్నపిల్లలు ఏడుస్తున్నారు.
5 లూహీతుకు ఎక్కివెళ్లే మార్గంలో వాళ్లు ఏడుస్తూ నడుస్తున్నారు.
హొరొనయీము నుండి దిగివెళ్లే మార్గంలో విపత్తును బట్టి వాళ్లకు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.+
6 పారిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి!
మీరు ఎడారిలోని సరళవృక్షంలా* తయారవ్వాలి.
7 నువ్వు నీ పనుల్ని, సంపదల్ని నమ్ముకున్నావు కాబట్టి,నువ్వు కూడా పట్టబడతావు.
అలాగే కెమోషు+ తన యాజకులతో పాటు, అధిపతులతో పాటు చెరలోకి వెళ్తాడు.
8 నాశనం చేసేవాడు ప్రతీ నగరం మీదికి వస్తాడు,ఏ నగరమూ తప్పించుకోదు.+
యెహోవా చెప్పినట్టే లోయ నశించిపోతుంది,చదునైన నేల* సమూలంగా నాశనమౌతుంది.
9 మోయాబు కోసం దారిలో గుర్తులు పెట్టండి,ఎందుకంటే దాని నగరాలు పాడై శిథిలాలుగా మారినప్పుడు, దాని ప్రజలు పారిపోతారు,దాని నగరాలు భయంకరంగా తయారౌతాయి,వాటిలో ఎవ్వరూ నివసించరు.+
10 యెహోవా ఇచ్చిన పనిని నిర్లక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడు!
రక్తం చిందించకుండా తన ఖడ్గాన్ని వెనక్కి తీసుకునేవాడు శాపగ్రస్తుడు!
11 మడ్డి మీద కదలకుండా ఉన్న ద్రాక్షారసంలామోయాబీయులు చిన్నప్పటి నుండి ప్రశాంతంగా ఉన్నారు.
వాళ్లు ఒక పాత్రలో నుండి మరో పాత్రలోకి పోయబడలేదు,ఎప్పుడూ చెరలోకి వెళ్లలేదు.
అందుకే వాళ్ల రుచి మారలేదు,వాళ్ల వాసన అలాగే ఉంది.
12 “ ‘కాబట్టి ఇదిగో! నేను వాళ్లను బోర్లించడానికి మనుషుల్ని పంపే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘ఆ మనుషులు వాళ్లను బోర్లించి, వాళ్ల పాత్రల్ని ఖాళీ చేస్తారు, వాళ్ల పెద్దపెద్ద జాడీల్ని ముక్కలుముక్కలుగా పగలగొడతారు.
13 ఇశ్రాయేలు ఇంటివాళ్లు తాము నమ్ముకున్న బేతేలును బట్టి అవమానాలపాలు అయినట్టే,+ మోయాబీయులు కెమోషును బట్టి అవమానాలపాలు అవుతారు.
14 “మేము యోధులం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం” అని అనడానికి మీకెంత ధైర్యం?’+
15 ‘మోయాబు నాశనం చేయబడింది,దాని నగరాల మీద శత్రువులు దాడిచేశారు,+దాని యువకుల్లో శ్రేష్ఠులు వధించబడ్డారు’+
అని సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు+ ప్రకటిస్తున్నాడు.
16 మోయాబీయుల మీదికి త్వరలోనే విపత్తు రాబోతోంది,వాళ్ల పతనం వేగంగా ముంచుకొస్తోంది.+
17 వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లంతా,వాళ్ల పేరు తెలిసినవాళ్లంతా వాళ్లమీద సానుభూతి చూపించాల్సి వస్తుంది,
వాళ్లతో ఇలా అనండి: ‘అయ్యో, బలమైన దండం, అందమైన కర్ర విరిగిపోయాయే!’
18 దీబోనులో+ నివసిస్తున్న కూతురా,నీ ఘనతను విడిచి కిందికి రా, దాహంతో కింద* కూర్చో,ఎందుకంటే, మోయాబును నాశనం చేసేవాడు నీ మీదికి వచ్చాడు,అతను ప్రాకారాలుగల నీ స్థలాల్ని శిథిలాలుగా మారుస్తాడు.+
19 అరోయేరు+ నివాసీ, దారిపక్కన నిలబడి చూస్తూ ఉండు.
‘ఏం జరిగింది?’ అని పారిపోతున్న మనిషిని, తప్పించుకుంటున్న స్త్రీని అడుగు.
20 మోయాబు అవమానాలపాలైంది, బెదిరిపోయింది.
ఏడ్వండి, కేకలు వేయండి.
మోయాబు నాశనమైందని అర్నోనులో+ ప్రకటించండి.
21 “చదునైన నేల* మీదికి తీర్పు వచ్చింది:+ హోలోను మీదికి, యాహజు+ మీదికి, మేఫాతు+ మీదికి,
22 దీబోను+ మీదికి, నెబో+ మీదికి, బేత్-దిబ్లాతయీము మీదికి,
23 కిర్యతాయిము+ మీదికి, బేత్-గామూలు మీదికి, బేత్-మెయోను+ మీదికి,
24 కెరీయోతు+ మీదికి, బొస్రా మీదికి, దగ్గర్లో గానీ దూరంలో గానీ ఉన్న మోయాబు దేశ నగరాలన్నిటి మీదికి తీర్పు వచ్చింది.
25 ‘మోయాబు కొమ్ము* నరికేయబడింది;అతని బాహువు విరగ్గొట్టబడింది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
26 ‘అతనికి మత్తెక్కేదాకా తాగించండి,+ ఎందుకంటే అతను యెహోవాకు వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు.+
మోయాబు తన వాంతిలో దొర్లుతున్నాడు,ప్రజలు అతన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.
27 నువ్వు ఇశ్రాయేలును చూసి ఎగతాళి చేయలేదా?+
నువ్వు అతన్ని చూసి తల ఆడించడానికి,అతనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి
అతను ఏమైనా దొంగా?
28 మోయాబు నివాసులారా, నగరాల్ని విడిచిపెట్టి కొండల్లో నివసించండి.కొండ సందుల్లో గూడు కట్టుకునే పావురాల్లా తయారవ్వండి.’ ”
29 “మోయాబు గర్వం గురించి మేము విన్నాం, అతను చాలా అహంకారి;అతని పొగరు గురించి, గర్వం గురించి, అహంకారం గురించి, అతని పొగరుబోతు హృదయం గురించి మేము విన్నాం.”+
30 “ ‘అతని కోపం గురించి నాకు తెలుసు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,‘కానీ అతని పనికిరాని మాటలు వ్యర్థమౌతాయి.
వాళ్లు ఏమీ చేయలేరు.
31 అందుకే నేను మోయాబు గురించి విలపిస్తాను,మోయాబు అంతటి గురించి నేను ఏడుస్తాను,కీర్హరెశు మనుషుల కోసం దుఃఖిస్తాను.+
32 సిబ్మా+ ద్రాక్షతీగా, యాజెరు+ కోసం ఏడ్చినదాని కన్నాఎక్కువగా నీ కోసం ఏడుస్తాను.
విస్తరిస్తున్న నీ కొమ్మలు సముద్రాన్ని దాటాయి.
అవి సముద్రాన్ని, యాజెరును చేరుకున్నాయి.నాశనం చేసేవాడు నీ వేసవికాల పండ్ల మీదికి, నీ ద్రాక్ష కోత మీదికి వచ్చాడు.+
33 పండ్ల తోట నుండి, మోయాబు దేశం నుండిసంతోషం, ఆనందం తీసేయబడ్డాయి.+
నేను ద్రాక్షతొట్టి నుండి ద్రాక్షారసం ప్రవహించకుండా చేశాను.
సంతోషంతో కేకలు వేస్తూ ఎవరూ ద్రాక్షల్ని తొక్కరు.
వేరే రకమైన కేకలు వినిపిస్తాయి.’ ”+
34 “ ‘హెష్బోనులో+ పెట్టే ఆర్తనాదాలు ఏలాలే+ వరకు వినిపిస్తున్నాయి.
వాళ్ల స్వరం యాహజు+ వరకు వినిపిస్తోంది,సోయరులో పెట్టే కేకలు హొరొనయీము+ వరకు, ఎగ్లాత్-షలీషియా వరకు వినిపిస్తున్నాయి.
చివరికి నిమ్రీము జలాలు కూడా ఎండిపోతాయి.’+
35 యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఉన్నత స్థలం మీదికి అర్పణలు తీసుకొచ్చేవాళ్లు,తమ దేవునికి బలులు అర్పించేవాళ్లుఇక మోయాబులో లేకుండా చేస్తాను.
36 అందుకే మోయాబు కోసం నా హృదయం పిల్లనగ్రోవిలా* విలపిస్తుంది,*+అలాగే కీర్హరెశు మనుషుల కోసం నా హృదయం పిల్లనగ్రోవిలా* విలపిస్తుంది.*
ఎందుకంటే అతను సంపాదించినదంతా నశించిపోతుంది.
37 ప్రతీ తల బోడి అయింది,+ప్రతీ గడ్డం కత్తిరించబడింది.
ప్రతీ చేతి మీద గాట్లు ఉన్నాయి,+వాళ్ల నడుముల మీద గోనెపట్ట ఉంది!’ ”+
38 “ ‘మోయాబు పైకప్పులన్నిటి మీద,దాని సంతవీధులన్నిట్లోఏడ్పు తప్ప ఇంకేమీ లేదు.
ఎందుకంటే నేను మోయాబును పనికిరాని కుండలా పగలగొట్టాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
39 ‘అది ఎంతగా భయపడిపోయింది! ప్రజలారా, ఏడ్వండి!
మోయాబు అవమానంతో ఎలా వెనుతిరిగాడు!
మోయాబును చూసి అతని చుట్టూ ఉన్నవాళ్లంతా ఎగతాళి చేస్తున్నారు,భయపడుతున్నారు.’ ”
40 “ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:
‘ఇదిగో! వేగంగా దూసుకొచ్చే గద్దలా,+అతను మోయాబు మీద తన రెక్కలు చాపుతాడు.+
41 దాని పట్టణాలు ఆక్రమించబడతాయి,దాని బలమైన దుర్గాలు పట్టబడతాయి.
ఆ రోజు మోయాబు యోధుల గుండెలుప్రసవిస్తున్న స్త్రీ గుండెలా ఉంటాయి.’ ”
42 “ ‘మోయాబు ఒక జనంగా ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాడు,+ఎందుకంటే అతను యెహోవాకు వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు.+
43 మోయాబు నివాసీ,నీ ముందు భయం, గొయ్యి, ఉచ్చు ఉన్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
44 ‘భయాన్ని తప్పించుకునే వ్యక్తి గోతిలో పడతాడు,గోతిలో నుండి పైకి వచ్చే వ్యక్తి ఉచ్చులో చిక్కుకుంటాడు.’
‘ఎందుకంటే, నేను మోయాబు మీదికి వాళ్ల శిక్షా సంవత్సరాన్ని తీసుకొస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
45 ‘పారిపోయేవాళ్లు హెష్బోను నీడలో శక్తిలేకుండా నిలబడి ఉంటారు.
ఎందుకంటే, హెష్బోనులో నుండి ఒక అగ్ని,సీహోనులో నుండి ఒక మంట వస్తుంది.+
అది మోయాబు నుదుటిని,అల్లరిమూక పుర్రెల్ని దహించేస్తుంది.’+
46 ‘మోయాబూ, నీకు శ్రమ!
కెమోషు+ ప్రజలు నశించిపోయారు.
నీ కుమారులు బందీలుగా తీసుకెళ్లబడ్డారు,నీ కూతుళ్లు చెరలోకి వెళ్లారు.+
47 అయితే చివరి రోజుల్లో నేను చెరలోకి వెళ్లిన మోయాబు ప్రజల్ని సమకూరుస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
‘ఇక్కడితో మోయాబు గురించిన తీర్పు సందేశం ముగిసింది.’ ”+
అధస్సూచీలు
^ లేదా “ఎత్తైన స్థలం.”
^ అంటే, జూనిపర్ చెట్టు.
^ లేదా “పీఠభూమి.”
^ లేదా “ఎండిన నేలమీద” అయ్యుంటుంది.
^ లేదా “పీఠభూమి.”
^ లేదా “బలం.”
^ లేదా “అల్లకల్లోలంగా ఉంది.”
^ అంటే, అంత్యక్రియల సమయంలో ఏడుస్తూ ఊదే ఫ్లూటు.
^ లేదా “అల్లకల్లోలంగా ఉంది.”
^ అంటే, అంత్యక్రియల సమయంలో ఏడుస్తూ ఊదే ఫ్లూటు.