యెషయా 22:1-25
22 దర్శన లోయ* గురించిన సందేశం:+
మీకు ఏమైంది? మీరంతా ఇంటి పైకప్పుల మీదికి ఎందుకు వెళ్లారు?
2 నువ్వు అల్లరితో నిండివుండే దానివి,కోలాహలం నిండిన నగరానివి, ఉల్లసించే పట్టణానివి.
నీలో హతులైనవాళ్లు ఖడ్గం వల్ల హతమవ్వలేదు,వాళ్లు యుద్ధంలో చనిపోలేదు.+
3 నీ నియంతలంతా కలిసి పారిపోయారు.+
విల్లు అవసరం లేకుండానే వాళ్లను ఖైదీలుగా తీసుకెళ్లారు.
దొరికిన వాళ్లందర్నీ ఖైదీలుగా తీసుకెళ్లారు,+చాలాదూరం పారిపోయినా పట్టుకొని తీసుకెళ్లారు.
4 అందుకే నేనిలా అన్నాను: “మీ దృష్టి నా మీద నుండి పక్కకు తిప్పండి,నేను వెక్కివెక్కి ఏడుస్తాను.+
నా ప్రజల కూతురి* నాశనాన్ని బట్టి నేను బాధపడుతున్నాను,నన్ను ఓదార్చడానికి అదేపనిగా ప్రయత్నించకండి.+
5 ఎందుకంటే అది దర్శన లోయలోఅయోమయం, ఓటమి, భయాందోళన+ ఉండే రోజు,అది సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా నుండి వస్తుంది.
ప్రాకారం కూలగొట్టబడుతుంది,+పర్వతం వరకు అరుపు వినిపిస్తుంది.
6 ఏలాము+ అంబులపొది తీసుకొనిసైనికులున్న రథాలతో, గుర్రాలతో* వస్తోంది;కీరు+ డాలును బయటికి తీస్తుంది.*
7 నీ శ్రేష్ఠమైన లోయలుయుద్ధ రథాలతో నిండిపోతాయి,నగర ద్వారం దగ్గర గుర్రాలు* వాటివాటి స్థానాల్లో నిలబడతాయి.
8 యూదా ముసుగు* తీసేయబడుతుంది.
“ఆ రోజు నువ్వు అడవి గృహంలోని+ ఆయుధశాల వైపు చూస్తావు.
9 దావీదు నగర ప్రాకారంలో మీకు చాలా బీటలు కనిపిస్తాయి.+ దిగువ కోనేరులో+ మీరు నీళ్లు నిల్వచేస్తారు.
10 మీరు యెరూషలేములోని ఇళ్లను లెక్కపెడతారు, దాని ప్రాకారాన్ని దృఢపర్చడానికి ఆ ఇళ్లను కూలగొడతారు.
11 పాత కోనేరులోని నీళ్ల కోసం ప్రాకారపు రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని కడతారు, కానీ దాని మహాగొప్ప నిర్మాణకుడి* వైపు మీరు చూడరు; చాలాకాలం ముందు దాన్ని నిర్మించిన దేవుణ్ణి మీరు చూడరు.
12 ఆ రోజు సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాఏడ్వమని, దుఃఖించమని చెప్తాడు,+గుండు గీయించుకోమని, గోనెపట్ట కట్టుకోమని చెప్తాడు.
13 కానీ ప్రజలు సంబరాలు చేసుకుంటూ సంతోషిస్తున్నారు,పశువుల్ని, గొర్రెల్ని వధిస్తున్నారు,మాంసం తింటూ ద్రాక్షారసం తాగుతున్నారు.+
‘ఎలాగూ రేపు చచ్చిపోతాం కదా, రండి తిందాం, తాగుదాం’+ అని చెప్పుకుంటున్నారు.”
14 అప్పుడు సైన్యాలకు అధిపతైన యెహోవా నా చెవుల్లో ఈ విషయాన్ని వెల్లడిచేశాడు: “ ‘మీరు చనిపోయేవరకు, మీరు చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు’+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.”
15 సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా చెప్పేదేమిటంటే: “గృహనిర్వాహకుడిగా, రాజభవనం మీద పర్యవేక్షకుడిగా ఉన్న షెబ్నా+ దగ్గరికి వెళ్లి నువ్విలా చెప్పు:
16 ‘నీకు ఇక్కడ ఏం పనుంది? ఇక్కడ నీకు ఎవరు ఉన్నారని నీ కోసం ఇక్కడ సమాధి తొలిపించుకున్నావు?’ అతను ఎత్తైన స్థలంలో తనకోసం ఒక సమాధి తొలిపించుకుంటున్నాడు; ఒక బండలో తన కోసం విశ్రాంతి స్థలాన్ని* తొలిపించుకుంటున్నాడు.
17 ‘ఓ మనిషీ, ఇదిగో! యెహోవా నిన్ను బలంగా కిందికి విసిరేసి, బలవంతంగా నిన్ను పట్టుకుంటాడు.
18 ఆయన నిన్ను గట్టిగా చుట్టి, బంతిని విసిరేసినట్టు విశాలమైన దేశంలోకి విసిరేస్తాడు. నువ్వు అక్కడే చనిపోతావు, ఘనమైన నీ రథాలు కూడా అక్కడే ఉండిపోతాయి; అది నీ యజమాని ఇంటికి అవమానం.
19 నీ పదవి నుండి నిన్ను దించేస్తాను, నీ ఉద్యోగంలో నుండి నిన్ను తీసిపారేస్తాను.
20 “ ‘ఆ రోజు నేను హిల్కీయా కుమారుడూ నా సేవకుడూ అయిన ఎల్యాకీమును+ పిలుస్తాను,
21 నీ నిలువుటంగీని అతనికి తొడుగుతాను, నీ దట్టీని అతని నడుము చుట్టూ గట్టిగా కడతాను,+ నీ అధికారాన్ని* అతని చేతుల్లో పెడతాను. యెరూషలేము నివాసులకు, యూదా ఇంటివాళ్లకు అతను తండ్రిగా ఉంటాడు.
22 దావీదు ఇంటి తాళంచెవిని+ నేను అతని భుజాల మీద పెడతాను. అతను తెరిస్తే ఎవ్వరూ మూయలేరు; అతను మూస్తే ఎవ్వరూ తెరవలేరు.
23 కదలని చోట మేకును దిగగొట్టినట్టు నేను అతన్ని స్థిరపరుస్తాను; అతని తండ్రి ఇంటికి అతను మహిమగల సింహాసనం అవుతాడు.
24 అతని తండ్రి ఇంటి మహిమ* అంతటినీ, అంటే అతని వంశస్థుల మహిమను, సంతానపు* మహిమను, చిన్న పాత్రలన్నిటి మహిమను, గుండ్రటి గిన్నెల మహిమను, పెద్ద చెంబులన్నిటి మహిమను వాళ్లు అతని మీద వేలాడదీస్తారు.
25 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు, కదలని చోట దిగగొట్టబడిన మేకు తీసేయబడుతుంది,+ అది పడిపోయి నాశనమౌతుంది, దానికి తగిలించిన బరువు పడిపోయి నాశనమౌతుంది; ఎందుకంటే యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.’ ”
అధస్సూచీలు
^ యెరూషలేమును సూచిస్తుందని స్పష్టమౌతోంది.
^ బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.
^ లేదా “గుర్రపురౌతులతో.”
^ లేదా “సిద్ధం చేస్తుంది.”
^ లేదా “గుర్రపురౌతులు.”
^ లేదా “రక్షణ.”
^ లేదా “రూపకర్త.”
^ అక్ష., “నివాసాన్ని.”
^ లేదా “ఆధిపత్యాన్ని.”
^ అక్ష., “బరువు.”
^ లేదా “చిగుర్ల.”