యెషయా 23:1-18
-
తూరుకు వ్యతిరేకంగా సందేశం (1-18)
23 తూరు గురించిన సందేశం:+
తర్షీషు ఓడలారా,+ విలపించండి!
ఓడరేవు నాశనం చేయబడింది; అందులోకి ప్రవేశించడం వీలుకాదు.
కిత్తీము+ దేశం నుండి ఈ వార్త వాళ్లకు అందింది.
2 సముద్రతీర నివాసులారా, మౌనంగా ఉండండి.
సముద్రాన్ని దాటే సీదోను వర్తకుల సంపదలతో నువ్వు నిండిపోయావు.
3 షీహోరు*+ ధాన్యం, నైలు నది పంటఅంటే, తూరు ఆదాయమంతాఅనేక జలాల మీద వెళ్లి దేశాలకు లాభాలు తీసుకొచ్చింది.+
4 సముద్ర ఆశ్రయదుర్గమైన సీదోనూ, సిగ్గుపడు.ఎందుకంటే సముద్రం ఇలా అంది:
“నేను పురిటినొప్పులు పడలేదు, బిడ్డను కనలేదు,యువకుల్ని, యువతుల్ని* పెంచి పెద్దచేయలేదు.”+
5 ఐగుప్తు గురించిన కబురు విన్నప్పుడు+ వేదనపడినట్టే,తూరు గురించిన కబురు విన్నప్పుడు ప్రజలు వేదనపడతారు.+
6 సముద్రం మీద ప్రయాణించి తర్షీషుకు వెళ్లండి!
సముద్రతీర నివాసులారా, విలపించండి!
7 పూర్వకాలం నుండి, దాని తొలినాళ్ల నుండి ఎంతో ఉల్లాసంగా ఉన్న మీ నగరం ఇదేనా?
వేరే దేశాల్లో నివసించేలా దాని పాదాలు దాన్ని దూర దేశాలకు నడిపించేవి.
8 తూరు కిరీటాలు ఇస్తూ ఉండేది;దాని వ్యాపారులు అధిపతులు;దాని వర్తకుల్ని లోకమంతా గౌరవించేది.+అలాంటి తూరుకు ఇలా జరగాలని నిర్ణయించింది ఎవరు?
9 సైన్యాలకు అధిపతైన యెహోవాయే అలా నిర్ణయించాడు;దాని గర్వాన్ని, దాని సౌందర్యాన్ని హీనపర్చడానికి,లోకమంతటా గౌరవించబడిన వాళ్లను అవమానపర్చడానికి అలా చేశాడు.+
10 తర్షీషు కూతురా, నైలు నదిలా నీ దేశాన్ని దాటివెళ్లు.
ఇక దానిలో నౌకా కేంద్రం* అనేదే లేదు.+
11 ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపాడు;రాజ్యాల్ని కుదిపేశాడు.
ఫేనీకే బలమైన దుర్గాల్ని సమూలంగా నాశనం చేయమని యెహోవా ఆదేశించాడు.+
12 ఆయన ఇలా అంటున్నాడు: “అణచివేయబడిన సీదోను కన్యా,నువ్విక ఎంతమాత్రం సంతోషించవు.+
లే, సముద్రం మీద కిత్తీముకు+ పారిపో.
కానీ అక్కడ కూడా నీకు నెమ్మది ఉండదు.”
13 ఇదిగో! కల్దీయుల+ దేశాన్ని చూడండి.
అష్షూరు+ కాదు ఈ ప్రజలేదాన్ని* ఎడారి ప్రాణులు తిరిగే స్థలంగా చేశారు.
వాళ్లు ముట్టడి బురుజుల్ని కట్టి,దాని పటిష్ఠమైన బురుజుల్ని కూలగొట్టి,+దాన్ని శిథిలాల కుప్పగా మార్చేశారు.
14 తర్షీషు ఓడలారా, విలపించండి,ఎందుకంటే మీ బలమైన దుర్గం నాశనం చేయబడింది.+
15 ఆ రోజు తూరు 70 సంవత్సరాల పాటు, అంటే ఒక రాజు జీవితకాలమంత సమయం మరవబడుతుంది.+ ఆ 70 సంవత్సరాల ముగింపులో, ఈ వేశ్య పాటలో ఉన్నట్టు దానికి జరుగుతుంది:
16 “మరవబడిన వేశ్యా, వీణ* తీసుకొని నగరమంతా తిరుగు.
నైపుణ్యంతో నీ వీణను వాయించు;వాళ్లు నిన్ను గుర్తుచేసుకునేలాచాలా పాటలు పాడు.”
17 ఆ 70 సంవత్సరాల ముగింపులో యెహోవా తూరు మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు; అది మళ్లీ పడుపుసొమ్ము సంపాదించడం కోసం భూమ్మీదున్న రాజ్యాలన్నిటితో వ్యభిచారం చేస్తుంది.
18 అయితే దాని లాభం, దాని పడుపుసొమ్ము యెహోవాకు ప్రతిష్ఠితం అవుతాయి. ఆ సొమ్మును కూడబెట్టడం గానీ, పక్కనపెట్టడం గానీ జరగదు; ఎందుకంటే యెహోవా సన్నిధిలో నివసించేవాళ్లు కడుపునిండా తినేలా, ప్రశస్తమైన బట్టలు వేసుకునేలా ఆ సొమ్ము వాళ్లకోసం ఉపయోగించబడుతుంది.+
అధస్సూచీలు
^ అంటే, నైలు నది శాఖ.
^ అక్ష., “కన్యల్ని.”
^ లేదా “ఓడరేవు” అయ్యుంటుంది.
^ ఇది బహుశా తూరును సూచిస్తుండవచ్చు.
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.