యెషయా 34:1-17

  • జనాల మీద యెహోవా పగతీర్చుకోవడం (1-4)

  • ఎదోము నిర్మానుష్యమౌతుంది (5-17)

34  దేశాల్లారా, దగ్గరికి వచ్చి వినండి,జనాల్లారా, ఆలకించండి. భూమి, అందులో ఉన్నవన్నీ,అలాగే నేల, దానిలో పండేదంతా వినాలి.   ఎందుకంటే దేశాలన్నిటి మీద యెహోవా కోపంగా ఉన్నాడు,+వాటి సైన్యమంతటి మీద ఆయన చాలా కోపంగా ఉన్నాడు.+ ఆయన వాటిని సమూలంగా నాశనం చేస్తాడు;ఆయన వాటిని వధకు అప్పగిస్తాడు.+   వాళ్లలో హతులైన వాళ్లను విసిరిపారేస్తారు,ఆ కళేబరాల కంపు పైకి లేస్తుంది;+వాళ్ల రక్తంలో పర్వతాలు కరిగిపోతాయి.*+   ఆకాశ సైన్యమంతా కుళ్లిపోతుంది,గ్రంథపుచుట్ట చుట్టబడినట్టు ఆకాశం చుట్టబడుతుంది. వాడిపోయిన ఆకు ద్రాక్షతీగ నుండి రాలినట్టు,ముడుచుకుపోయిన అంజూర పండు అంజూర చెట్టు నుండి రాలిపడినట్టువాటి సైన్యమంతా వాడిపోయి రాలిపోతుంది.   “ఎందుకంటే, ఆకాశంలో నా ఖడ్గం రక్తంతో తడిసిపోతుంది.+ అది న్యాయానికి అనుగుణంగా ఎదోము మీదికి,+అంటే నేను సమూలంగా నాశనం చేయాలనుకున్న ప్రజల మీదికి దిగివస్తుంది.   యెహోవాకు ఒక ఖడ్గం ఉంది; అది రక్తసిక్తమౌతుంది. అది కొవ్వుతో కప్పబడుతుంది,+మగ గొర్రెపిల్లల రక్తంతో, మేకల రక్తంతో తడిసిపోతుంది,పొట్టేళ్ల మూత్రపిండాల మీది కొవ్వుతో అది కప్పబడుతుంది. ఎందుకంటే బొస్రాలో యెహోవాకు ఒక బలి ఉంది,ఎదోము దేశంలో గొప్ప వధ జరగబోతుంది.+   వాటితో పాటు అడవి దున్నలు,బలమైనవాటితో పాటు కోడెదూడలు కిందికి దిగుతాయి. దేశం రక్తంతో తడిసి ముద్దౌతుంది,దాని ధూళి కొవ్వులో నానుతుంది.”   ఎందుకంటే, పగ తీర్చుకునే ఒక రోజు యెహోవాకు ఉంది,+అది సీయోను తరఫున చట్టపరమైన వివాదం విషయంలో ప్రతీకారం చేసే సంవత్సరం.+   దాని* కాలువలు కీలులా,దాని మట్టి గంధకంలా,దాని నేల మండుతున్న కీలులా తయారౌతుంది. 10  రాత్రైనా, పగలైనా అది ఆరిపోదు;దాని పొగ ఎప్పటికీ పైకి లేస్తూనే ఉంటుంది. తరతరాలపాటు అది పాడైన స్థితిలోనే ఉండిపోతుంది.ఎవ్వరూ ఎన్నడూ దాని గుండా వెళ్లరు.+ 11  గూడబాతు,* ముళ్లపంది దాన్ని ఆక్రమించుకుంటాయి,పొడుగు చెవుల గుడ్లగూబలు, కాకులు దానిలో నివసిస్తాయి. శూన్యం అనే కొలనూలుతో,వ్యర్థత అనే లంబసూత్రంతో* ఆయన దాన్ని కొలుస్తాడు. 12  దాని ప్రముఖుల్లో ఎవ్వరూ రాజరికం కోసం పిలవబడరు,దాని అధిపతులంతా లేకుండాపోతారు. 13  దాని పటిష్ఠమైన బురుజుల్లో ముళ్లు పెరుగుతాయి,దాని కోటల్లో దురదగొండి మొక్కలు, ముళ్ల మొక్కలు పెరుగుతాయి. అది నక్కలు నివసించే చోటుగా,+నిప్పుకోళ్లకు నివాసంగా తయారౌతుంది. 14  ఎడారి ప్రాణులు, ఊల వేసే జంతువులు అక్కడ కలుసుకుంటాయి,కొండమేక* తన జత కోసం అరుస్తుంది. అవును, నిశాచర పక్షి అక్కడ స్థిరపడుతుంది, విశ్రాంతి స్థలం చూసుకుంటుంది. 15  ఎగిరే పాము అక్కడ గూడు కట్టి, గుడ్లు పెడుతుంది,వాటిని పొదిగి, తన నీడలో వాటిని సమకూరుస్తుంది. అవును, ప్రతీ గద్ద తన జతతో అక్కడికి చేరుతుంది. 16  యెహోవా గ్రంథంలో వెతికి, దాన్ని బిగ్గరగా బయటికి చదవండి. వాటిలో ఒక్కటి కూడా లేకుండా పోదు;వాటిలో ప్రతీ దానికి జత ఉంటుంది,ఎందుకంటే యెహోవాయే స్వయంగా తన నోటితో ఆదేశించాడు,ఆయన పవిత్రశక్తే* వాటిని సమకూర్చింది. 17  వాటికోసం చీటి* వేసింది ఆయనే,వాటికి స్థలాన్ని కొలిచి నియమించింది* ఆయన చెయ్యే. అది ఎప్పటికీ వాటి సొంతమౌతుంది;తరతరాలపాటు ఎప్పటికీ అవి అందులోనే నివసిస్తాయి.

అధస్సూచీలు

లేదా “రక్తం పర్వతాల మీద ప్రవహిస్తుంది.”
ఎదోము రాజధాని బొస్రాను సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అంటే, పెలికన్‌.
లేదా “మట్టపుగుండుతో.”
లేదా “మేకలాంటి చెడ్డదూత” అయ్యుంటుంది. పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “కొలనూలుతో వాటికి పంచి ఇచ్చింది.”