యెషయా 35:1-10
35 ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి,+ఎడారి మైదానం సంతోషించి కుంకుమ* పువ్వులా వికసిస్తుంది.+
2 అది తప్పకుండా వికసిస్తుంది;+సంతోషంతో ఆనందంగా కేకలు వేస్తుంది.
లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,+కర్మెలు,+ షారోనుల+ వైభవం దానికి ఉంటుంది.
యెహోవా మహిమను, మన దేవుని వైభవాన్ని వాళ్లు చూస్తారు.
3 బలహీనంగా ఉన్న చేతుల్ని బలపర్చండి,వణుకుతున్న మోకాళ్లను దృఢపర్చండి.+
4 హృదయంలో ఆందోళనపడుతున్న వాళ్లతో ఇలా చెప్పండి:
“ధైర్యంగా ఉండండి. భయపడకండి.
ఇదిగో! స్వయంగా మీ దేవుడే పగ తీర్చుకోవడానికి వస్తాడు.ప్రతీకారం చేయడానికి దేవుడు వస్తాడు.+
ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.”+
5 అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి,+చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి.+
6 కుంటివాళ్లు జింకలా గంతులేస్తారు,+మూగవాళ్ల నాలుక సంతోషంతో కేకలు వేస్తుంది.+
ఎడారిలో నీళ్లు ఉబుకుతాయి,ఎడారి మైదానంలో కాలువలు పారతాయి.
7 ఎండిన నేల జమ్ము మడుగు అవుతుంది,దాహంగా ఉన్న నేలలో నీటి ఊటలు పుడతాయి.+
నక్కలు విశ్రాంతి తీసుకున్న చోట+పచ్చగడ్డి, రెల్లు, జమ్ము* పెరుగుతాయి.
8 ఒక రాజమార్గం ఉంటుంది,+అవును, పవిత్ర మార్గం అనే దారి ఉంటుంది.
అపవిత్రులు దానిలో ప్రయాణించరు.+
అర్హులైనవాళ్లు మాత్రమే అందులో నడుస్తారు;మూర్ఖులెవ్వరూ దారితప్పి ఆ మార్గంలోకి వెళ్లరు.
9 సింహాలేవీ అక్కడ ఉండవు,క్రూరమైన అడవి మృగాలేవీ ఆ దారిలోకి రావు.
అవి అక్కడ కనిపించవు;+తిరిగి కొనబడినవాళ్లు మాత్రమే అక్కడ నడుస్తారు.+
10 యెహోవా విడిపించినవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ సీయోనుకు తిరిగొస్తారు.+
వాళ్ల తలల మీద శాశ్వత ఆనందం అనే కిరీటం ఉంటుంది.+
ఉల్లాసం, సంతోషం వాళ్ల సొంతమౌతాయి,దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతాయి.+