యెషయా 45:1-25
45 కోరెషును అభిషేకించి,దేశాల్ని అతనికి అప్పగించడానికి,+రాజుల బలాన్ని తీసేయడానికి,*ద్వారాలు మూయబడకుండాఅతని ఎదుట తలుపులు తెరవడానికిఅతని కుడిచేతిని పట్టుకొనివున్న+ యెహోవా అతనితో ఇలా అంటున్నాడు:+
2 “నేను నీకు ముందుగా వెళ్తూ+కొండల్ని చదును చేస్తాను.
రాగి తలుపుల్ని ముక్కలుముక్కలు చేస్తాను,ఇనుప అడ్డగడియల్ని విరగ్గొడతాను.+
3 నేను చీకట్లో ఉన్న సంపదల్ని,రహస్య స్థలాల్లో ఉన్న గుప్తనిధుల్ని నీకు ఇస్తాను;+అప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని,నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నది నేనే+ అని నువ్వు తెలుసుకుంటావు.
4 నా సేవకుడైన యాకోబు కోసం, నేను ఎంచుకున్న ఇశ్రాయేలు కోసంనేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను.
నేనెవరో నీకు తెలియకపోయినా నేను నీకు గొప్ప పేరును ఇస్తున్నాను.
5 నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.
నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు.+
నేనెవరో నీకు తెలియకపోయినా నేను నిన్ను బలపరుస్తాను,*
6 నేను కాకుండా మరెవ్వరూ లేరని,తూర్పు నుండి పడమర* వరకున్నప్రజలు తెలుసుకునేలా నేను నిన్ను బలపరుస్తాను.+
నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+
7 వెలుగును, చీకటిని సృష్టించేది నేనే.+శాంతిని, విపత్తును కలగజేసేది నేనే;+యెహోవానైన నేనే వీటన్నిటిని చేస్తున్నాను.
8 ఆకాశమా, పైనుండి వర్షాన్ని కురిపించు;+మేఘాలు నీతిని కుమ్మరించాలి.
భూమి నోరు తెరిచి రక్షణను ఫలించాలి,అదే సమయంలో అది నీతిని మొలిపించాలి.+
యెహోవానైన నేనే దాన్ని సృష్టించాను.”
9 తనను సృష్టించిన* దేవునితో వాదించే* వాడికి శ్రమ!ఎందుకంటే, అతను నేలమీద పడివున్న కుండ పెంకుల్లోఒక పెంకు మాత్రమే!
బంకమట్టి కుమ్మరివాడితో,* “నువ్వు ఏం తయారు చేస్తున్నావు?” అని అనొచ్చా?+
నువ్వు చేసిన వస్తువు, “ఇతనికి చేతులు లేవు” అని అనొచ్చా?*
10 ఒక తండ్రితో, “నువ్వు ఎవరికి తండ్రివయ్యావు?” అని,
ఒక స్త్రీతో, “నువ్వు ఎవర్ని కన్నావు?”* అని అనేవాడికి శ్రమ!
11 ఇశ్రాయేలును రూపొందించిన అతని పవిత్ర దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:
“జరగబోయేవాటి గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా?నా కుమారుల+ గురించి, నా చేతి పనుల గురించి నాకు ఆజ్ఞాపిస్తావా?
12 నేనే భూమిని తయారుచేశాను,+ దానిమీద మనిషిని సృష్టించాను.+
నేనే స్వయంగా నా చేతులతో ఆకాశాన్ని విస్తరింపజేశాను,+వాటి సైన్యమంతటికీ+ నేనే ఆదేశాలిస్తాను.”
13 “నేను నీతితో ఒక మనిషిని బయల్దేరజేశాను,+నేను అతని దారులన్నిటినీ చదును చేస్తాను.
అతనే నా నగరాన్ని కడతాడు,+మూల్యం గానీ లంచం గానీ తీసుకోకుండానే+ చెరలో ఉన్న నా వాళ్లను విడిపిస్తాడు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.
14 యెహోవా ఇలా చెప్తున్నాడు:
“ఐగుప్తు లాభం,* ఇతియోపియా వర్తకం* నీవి అవుతాయి;ఎత్తుగా ఉండే సెబాయీయులు నీ దగ్గరికి వచ్చి నీవాళ్లు అవుతారు.
వాళ్లు సంకెళ్లతో నీ వెనక నడుస్తారు.
వాళ్లు వచ్చి, నీకు వంగి నమస్కారం చేస్తారు.+
వాళ్లు భక్తితో ఇలా అంటారు: ‘నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,+ఆయన కాకుండా ఇంకెవ్వరూ లేరు; ఆయన తప్ప వేరే ఏ దేవుడూ లేడు.’ ”
15 ఇశ్రాయేలు దేవా, రక్షకుడా,నిజంగా నువ్వు నీ మార్గాల్ని దాచివుంచే దేవుడివి.+
16 వాళ్లంతా సిగ్గుపర్చబడతారు, అవమానాలపాలు అవుతారు;విగ్రహాల్ని చేసేవాళ్లంతా తలవంపుతో వెళ్లిపోతారు.+
17 కానీ యెహోవా ఇశ్రాయేలును శాశ్వతంగా కాపాడతాడు.+
నువ్వు ఎప్పటికీ సిగ్గుపర్చబడవు, అవమానాలపాలు కావు.+
18 యెహోవా ఆకాశాన్ని సృష్టించాడు,+ ఆయనే సత్యదేవుడు;ఆయన భూమిని నిర్మించి, దాన్ని రూపొందించి, బలంగా స్థిరపర్చాడు;+ఆయన భూమిని ఊరికే* చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు;+ఆయన ఇలా అంటున్నాడు:
“నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.
19 నేను రహస్య స్థలంలో, చీకటిగల దేశంలో మాట్లాడలేదు;+‘ఊరికే* నన్ను వెదకండి’ అనినేను యాకోబు సంతానంతో* అనలేదు.
నేను యెహోవాను, నేను నీతిగల మాటలు మాట్లాడతాను, నిజాయితీగల విషయాలు ప్రకటిస్తాను.+
20 మీరంతా సమకూడి రండి.
దేశాల నుండి తప్పించుకున్నవాళ్లారా,+ అందరూ కలిసి రండి.
చెక్కిన విగ్రహాల్ని మోసుకెళ్తూ,తమను కాపాడలేని దేవునికి ప్రార్థించే వాళ్లకు+ ఏమీ తెలీదు.
21 మీ నివేదికను తయారు చేయండి, మీ వ్యాజ్యాన్ని వినిపించండి.
వాళ్లందర్నీ కలిసి చర్చించుకోనివ్వండి.
ఎవరు దీని గురించి పూర్వకాలంలోనే ప్రవచించారు?ఎవరు పురాతన కాలాల నుండే దీన్ని ప్రకటిస్తూ వచ్చారు?
యెహోవానైన నేను కాదా?
నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు;నేను నీతిగల దేవుణ్ణి, రక్షకుణ్ణి,+ నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+
22 భూమి అంచుల్లో నివసిస్తున్న ప్రజలారా, మీరంతా నా వైపు తిరిగి, రక్షణ పొందండి,+ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+
23 నా తోడు అని నేను ప్రమాణం చేశాను;నీతిగల మాట నా నోటి నుండి బయల్దేరింది,అది ఖచ్చితంగా నెరవేరుతుంది:+
ప్రతీ మోకాలు నా ముందు వంగుతుంది,ప్రతీ నాలుక విశ్వసనీయతను ప్రమాణం చేస్తూ+
24 ఇలా అంటుంది, ‘అవును, నిజమైన నీతి, బలం యెహోవా సొంతం.
ఆయన మీద కోపగించుకున్న వాళ్లందరూ అవమానంతో ఆయన ముందుకు వస్తారు.
25 యెహోవాను బట్టి, ఇశ్రాయేలు సంతానమంతా* చేసింది సరైనదని నిరూపించబడుతుంది,+ఆయన్ని బట్టే వాళ్లు గొప్పలు చెప్పుకుంటారు.’ ”
అధస్సూచీలు
^ అక్ష., “రాజుల నడికట్లను విప్పడానికి.”
^ అక్ష., “నీ నడుమును బలంగా బిగిస్తాను.”
^ లేదా “సూర్యోదయం నుండి సూర్యాస్తమయం.”
^ లేదా “రూపొందించిన.”
^ లేదా “పోరాడే.”
^ లేదా “తనను రూపొందించినవానితో.”
^ లేదా “బంకమట్టి, ‘నువ్వు చేసిన వస్తువుకు చేతులు లేవు’ అని అనొచ్చా?” అయ్యుంటుంది.
^ లేదా “నువ్వు ఎందుకోసం పురిటినొప్పులు పడ్డావు?”
^ లేదా “కూలీలు” అయ్యుంటుంది.
^ లేదా “వర్తకులు” అయ్యుంటుంది.
^ లేదా “ఖాళీగా ఉండాలని” అయ్యుంటుంది.
^ అక్ష., “విత్తనంతో.”
^ లేదా “వ్యర్థంగా.”
^ అక్ష., “విత్తనమంతా.”