యెషయా 48:1-22
48 యాకోబు ఇంటివాళ్లారా, ఈ మాట వినండి.మీరు ఇశ్రాయేలు పేరు పెట్టుకుంటారు,+మీరు యూదా జలాల నుండి* వచ్చినవాళ్లు;మీరు యెహోవా పేరున ప్రమాణం చేస్తారు,+ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తారు,కానీ సత్యంతో, నీతితో కాదు.+
2 ఈ ప్రజలు పవిత్ర నగరవాసులమని చెప్పుకుంటారు,+ఇశ్రాయేలు దేవుని సహాయాన్ని కోరతారు,+ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.
3 “నేను పాత* సంగతుల్ని చాలాకాలం క్రితమే మీకు చెప్పాను.
అవి స్వయంగా నా నోటి నుండే వచ్చాయి,నేనే వాటిని తెలియజేశాను.+
నేను అకస్మాత్తుగా చర్య తీసుకున్నాను, అవి జరిగిపోయాయి.+
4 మీరు చాలా మొండివాళ్లని,మీ మెడ ఇనుప నరమని, మీ నొసలు రాగిదని నాకు తెలుసు+ కాబట్టి,
5 చాలాకాలం క్రితమే నేను మీకు చెప్పాను.
అది జరగకముందే, నేను దాన్ని మీకు వినిపించాను,‘మా విగ్రహం దీన్ని చేసింది; మా చెక్కుడు విగ్రహం, మా పోత* విగ్రహం దీన్ని ఆజ్ఞాపించాయి’అని మీరు అనకుండా ఉండాలని అలా చెప్పాను.
6 అదంతా మీరు విన్నారు, చూశారు.
మీరు దాన్ని ప్రకటించరా?+
ఇప్పటినుండి నేను మీకు కొత్త సంగతుల్నిఅంటే మీకు తెలియని వాటిని, భద్రంగా దాచివుంచిన వాటిని మీకు ప్రకటిస్తున్నాను.+
7 చాలాకాలం క్రితం కాదు ఇప్పుడే అవి సృష్టించబడుతున్నాయి,ఈ రోజుకు ముందు మీరెప్పుడూ వాటి గురించి వినలేదు,కాబట్టి, ‘ఇదిగో! అవి మాకు ముందే తెలుసు’ అని మీరు అనలేరు.
8 మీరు వాటి గురించి విననే వినలేదు,+ మీకు అవి తెలీదు,గతంలో మీ చెవులు తెరవబడలేదు.
మీరు వట్టి నమ్మకద్రోహులని నాకు తెలుసు,+పుట్టినప్పటి నుండే మీకు దోషులనే పేరుంది.+
9 కానీ నా పేరు కోసం, నేను నా కోపాన్ని అదుపు చేసుకుంటాను,+నా సొంత మహిమ కోసం నన్ను నేను అణుచుకుంటాను,నేను మిమ్మల్ని తుడిచిపెట్టను.+
10 ఇదిగో! నేను మిమ్మల్ని శుద్ధి చేశాను, కానీ వెండిలా కాదు.+
కష్టాల కొలిమిలో నేను మిమ్మల్ని పరీక్షించాను.*+
11 నా కోసం, అవును, నా కోసమే నేను చర్య తీసుకుంటాను,+ఎందుకంటే, నా పేరును నేనెలా అపవిత్రం కానిస్తాను?+
నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను.*
12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను.
నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను.+ నేనే మొదటివాణ్ణి; నేనే చివరివాణ్ణి కూడా.+
13 నా చెయ్యే భూమికి పునాది వేసింది,+నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరిచింది.+
నేను పిలిచినప్పుడు, అవన్నీ కలిసి నిలబడతాయి.
14 మీరంతా కలిసి ఒక్కచోటికి చేరి వినండి.
ఆ దేవుళ్లలో* ఎవరు వీటిని ప్రకటించారు?
యెహోవా అతన్ని ప్రేమించాడు.+
అతను బబులోను విషయంలో ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడు,+అతని బాహువు కల్దీయుల మీదికి వస్తుంది.+
15 నేనే స్వయంగా అలా చెప్పాను, నేనే అతన్ని పిలిచాను.+
నేనే అతన్ని తీసుకొచ్చాను, అతను చేసేది సఫలమౌతుంది.+
16 నా దగ్గరికి వచ్చి, ఇది విను.
మొదటి నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు.+
అది జరిగినప్పటి నుండి నేను అక్కడ ఉన్నాను.”
ఇప్పుడు సర్వోన్నత ప్రభువైన యెహోవా నన్ను పంపించాడు, తన పవిత్రశక్తిని కూడా నాకు ఇచ్చాడు.
17 నీ విమోచకుడూ, ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు:
“యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి.నీకు ప్రయోజనం కలిగేలా* నేనే నీకు బోధిస్తున్నాను,+నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను.+
18 నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది!+
అప్పుడు నీ శాంతి నదిలా,+నీ నీతి సముద్ర తరంగాల్లా+ ఉంటుంది.
19 నీ సంతానం* ఇసుకంత విస్తారంగా తయారౌతుంది,నీ వంశస్థులు ఇసుక రేణువులంతమంది అవుతారు.+
వాళ్ల పేరు నా ముందు నుండి ఎన్నడూ కొట్టివేయబడదు, తుడిచిపెట్టబడదు.”
20 బబులోను నుండి బయటికి వెళ్లండి!+
కల్దీయుల నుండి పారిపోండి!
సంతోషంతో కేకలు వేస్తూ దాన్ని చాటించండి! ప్రకటించండి!+
భూమి అంచుల వరకు దాన్ని తెలియజేయండి.+
ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడైన యాకోబును తిరిగి కొన్నాడు.+
21 ఆయన వాళ్లను ఎడారి ప్రాంతాల గుండా నడిపించినప్పుడు వాళ్లకు దాహం వేయలేదు.+
ఆయన వాళ్ల కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశాడు;ఆయన బండను చీల్చి నీళ్లు పెల్లుబికేలా చేశాడు.”+
22 “దుష్టులకు మనశ్శాంతి ఉండదు” అని యెహోవా చెప్తున్నాడు.+
అధస్సూచీలు
^ లేదా “వంశం నుండి” అయ్యుంటుంది.
^ అక్ష., “మొదటి.”
^ లేదా “లోహపు.”
^ లేదా “పరిశీలించాను.” లేదా “ఎంచుకున్నాను” అయ్యుంటుంది.
^ లేదా “ఎవ్వరితోనూ పంచుకోను.”
^ అక్ష., “వాళ్లలో.”
^ లేదా “నీ మంచి కోసమే.”
^ అక్ష., “విత్తనం.”