యెషయా 59:1-21

  • పాపాల వల్ల ఇశ్రాయేలు దేవునికి దూరం కావడం (1-8)

  • పాపాలు ఒప్పుకోవడం (9-15ఎ)

  • పశ్చాత్తాపపడిన వాళ్ల తరఫున యెహోవా జోక్యం చేసుకుంటాడు (15బి-21)

59  ఇదిగో! యెహోవా చెయ్యి రక్షించలేనంత చిన్నగా లేదు,+ఆయన చెవి వినలేనంత మందంగా లేదు.+   మీ సొంత తప్పులే మీ దేవుని నుండి మిమ్మల్ని దూరం చేశాయి. మీ పాపాల వల్లే ఆయన మీ నుండి తన ముఖాన్ని దాచుకున్నాడు,ఆయన మీ ప్రార్థనలు వినడానికి ఇష్టపడట్లేదు.+   ఎందుకంటే మీ అరచేతులు రక్తంతో,మీ చేతి వేళ్లు దోషంతో మలినమైపోయాయి.+ మీ పెదాలు అబద్ధాలాడతాయి,+ మీ నాలుక అవినీతిని జపిస్తుంది.   ఎవ్వరూ నీతి పక్షాన మాట్లాడట్లేదు,+న్యాయస్థానానికి వెళ్లిన వాళ్లలో ఎవ్వరూ నిజం చెప్పట్లేదు. వాళ్లు బూటకమైన దానిమీద నమ్మకం పెట్టుకొని+ పనికిరాని మాటలు మాట్లాడతారు. వాళ్లు సమస్యను గర్భం దాల్చి హానికరమైనదాన్ని కంటారు.+   వాళ్లు విషసర్పం గుడ్లను పొదుగుతారు,సాలెగూడును అల్లుతారు.+ ఆ గుడ్లను తినేవాళ్లు చనిపోతారు,ఎవరైనా ఒక గుడ్డును పగలగొడితే అందులో నుండి విషసర్పం వస్తుంది.   వాళ్లు అల్లిన సాలెగూడు వస్త్రంలా ఉపయోగపడదు,తాము తయారుచేసిన దాన్ని వాళ్లు కప్పుకోరు కూడా.+ వాళ్ల పనులు హానికరమైనవి,వాళ్ల చేతులు దౌర్జన్యంతో నిండిపోయాయి.+   వాళ్ల పాదాలు చెడు చేయడానికి పరుగెత్తుతాయి,నిర్దోషుల రక్తం చిందించడానికి వాళ్లు ఆత్రంగా పరుగులు తీస్తారు.+ వాళ్ల ఆలోచనలు హానికరమైనవి;వాళ్ల దారుల్లో నాశనం, దుఃఖం ఉన్నాయి.+   శాంతి మార్గం వాళ్లకు తెలీదు,వాళ్ల దారుల్లో న్యాయం అనేదే లేదు.+ వాళ్లు తమ త్రోవల్ని వంకరగా చేసుకుంటారు;వాటిలో నడిచే వాళ్లెవ్వరికీ శాంతి ఉండదు.+   అందుకే న్యాయం మనకు చాలా దూరంలో ఉంది,నీతి మన దగ్గరికి రావట్లేదు. మనం వెలుగు కోసం చూస్తూ ఉన్నాం, కానీ ఇదిగో! చీకటే ఉంది;కాంతి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం, కానీ అంధకారంలోనే నడుస్తున్నాం.+ 10  మనం గుడ్డివాళ్లలా గోడను తడుముకుంటూ వెళ్తున్నాం;కళ్లులేని వాళ్లలా వెతుకులాడుతూ ఉన్నాం.+ సాయంత్రం చీకట్లో తడబడినట్టు మిట్టమధ్యాహ్న వేళ తడబడుతున్నాం;బలాఢ్యుల మధ్య మనం చచ్చినవాళ్లలా ఉన్నాం. 11  మనమంతా ఎలుగుబంట్లలా గుర్రుమంటున్నాం,పావురాల్లా దుఃఖంతో మూల్గుతున్నాం. మనం న్యాయం కోసం చూస్తున్నాం, కానీ అది కనిపించట్లేదు;రక్షణ కోసం ఎదురుచూస్తున్నాం, కానీ అది మనకు చాలా దూరంలో ఉంది. 12  ఎందుకంటే నీ ముందు మా తిరుగుబాట్లు అనేకం;+మేము చేసిన ఒక్కో పాపం మా మీద సాక్ష్యం చెప్తోంది.+ మా తిరుగుబాట్లు మా వెన్నంటే ఉన్నాయి;మా దోషాల గురించి మాకు బాగా తెలుసు.+ 13  మేము తప్పు చేశాం, యెహోవాను కాదన్నాం;మా దేవునికి దూరంగా వెళ్లాం. అణచివేత గురించి, తిరుగుబాటు గురించి మేము మాట్లాడుకున్నాం;+మా హృదయాల్లో అబద్ధాలు పెట్టుకొని, వాటి గురించి గుసగుసలాడుకున్నాం.+ 14  న్యాయం వెనక్కి తరిమేయబడింది,+నీతి దూరంగా నిలబడింది;+ఎందుకంటే సంతవీధిలో సత్యం* తడబడింది,సరైనది అందులో అడుగు పెట్టలేకపోతోంది. 15  సత్యం* కనుమరుగైపోయింది,+చెడుకు దూరంగా ఉన్నవాళ్లు దోచుకోబడుతున్నారు. యెహోవా దాన్ని చూశాడు, అది ఆయనకు నచ్చలేదు,*ఎందుకంటే ఎక్కడా న్యాయం కనిపించట్లేదు.+ 16  సహాయం చేయడానికి ఒక్క మనిషి కూడా లేకపోవడం,వాళ్ల తరఫున మాట్లాడడానికి ఒక్కరు కూడా లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు,అందుకే ఆయన బాహువే రక్షణను* తీసుకొచ్చింది,ఆయన నీతే ఆయనకు ఆధారమైంది. 17  తర్వాత ఆయన నీతిని కవచంగా ధరించాడు,రక్షణ* అనే శిరస్త్రాణాన్ని* తల మీద పెట్టుకున్నాడు.+ ప్రతీకార వస్త్రాలు తొడుక్కొని+ఆసక్తిని పైవస్త్రంలా చుట్టుకున్నాడు.* 18  వాళ్లు చేసినదాన్ని బట్టి ఆయన వాళ్లకు ప్రతిదండన చేస్తాడు:+ తన విరోధుల మీద ఉగ్రత చూపిస్తాడు, తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడు.+ ద్వీపాలకు తగిన శాస్తి చేస్తాడు. 19  సూర్యాస్తమయం వైపు ఉన్నవాళ్లు యెహోవా పేరుకు,సూర్యోదయం వైపు ఉన్నవాళ్లు ఆయన మహిమకు భయపడతారు,ఎందుకంటే ఆయన వేగంగా ప్రవహించే నదిలా దూసుకొస్తాడు,యెహోవా పవిత్రశక్తే* దాన్ని ప్రవహింపజేస్తుంది. 20  యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోను దగ్గరికి,తప్పులు చేయడం మానేసిన యాకోబు వంశస్థుల+ దగ్గరికి విమోచకుడు+ వస్తాడు.”+ 21  “నా విషయానికొస్తే, వాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే”+ అని యెహోవా అంటున్నాడు. “నీ మీద నేను ఉంచిన నా పవిత్రశక్తి, నీ నోట నేను ఉంచిన మాటలు నీ నోటి నుండి గానీ, నీ పిల్లల నోటి నుండి గానీ, నీ మనవళ్ల నోటి నుండి గానీ ఎప్పటికీ తీసేయబడవు” అని యెహోవా అంటున్నాడు.

అధస్సూచీలు

లేదా “నిజాయితీ.”
లేదా “నిజాయితీ.”
అక్ష., “అది ఆయన కళ్లకు చెడ్డదిగా ఉంది.”
లేదా “ఆయనకు విజయాన్ని.”
లేదా “చేతుల్లేని నిలువుటంగీలా వేసుకున్నాడు.”
అంటే, హెల్మెట్‌.
లేదా “విజయం.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.