యెషయా 65:1-25
65 “నా కోసం అడగని వాళ్లను నన్ను వెతకనిచ్చాను;నన్ను వెతకని వాళ్లకు నేను దొరికాను.+నా పేరు ఎత్తని జనంతో ‘నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను!’ అని అన్నాను.+
2 మొండి ప్రజల+ కోసం,తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తూ+చెడ్డ మార్గంలో నడుస్తున్న ప్రజల+ కోసం రోజంతా నేను నా చేతులు చాపాను;
3 తోటల్లో బలులు అర్పిస్తూ,+ ఇటుకల మీద ధూపం వేస్తూవాళ్లు అస్తమానం ముఖం మీదే నన్ను అవమానించారు.+
4 వాళ్లు సమాధుల మధ్య కూర్చుంటారు,+పందుల మాంసం తింటూ+చాటుగా ఉన్న చోట్లలో* రాత్రి గడుపుతారు,
కంపుకొట్టేవాటి* పులుసు వాళ్ల పాత్రల్లో ఉంది.+
5 వాళ్లు, ‘నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రావద్దు,ఎందుకంటే నేను నీకన్నా పవిత్రుణ్ణి’* అంటారు.
వాళ్లు నా ముక్కురంధ్రాల్లో పొగలా, రోజంతా మండుతున్న నిప్పులా ఉన్నారు.
6 ఇదిగో! అది నా ముందు రాయబడింది;నేను ఊరికే నిలబడను,
వాళ్లకు ప్రతీకారం చేస్తాను,+నేను వాళ్ల మీద పూర్తిగా పగతీర్చుకుంటాను.
7 వాళ్ల తప్పుల్ని బట్టి, వాళ్ల పూర్వీకుల తప్పుల్ని బట్టి అలా చేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.“వాళ్లు పర్వతాల మీద ధూపం వేసికొండల మీద నన్ను నిందించారు+ కాబట్టినేను ముందుగా వాళ్ల కూలిని వాళ్లకు పూర్తిగా లెక్క కట్టి ఇస్తాను.”
8 యెహోవా ఇలా అంటున్నాడు:
“ద్రాక్షగుత్తిలో కొత్త ద్రాక్షారసం కనిపించినప్పుడు‘దాన్ని పాడు చేయొద్దు, అందులో కాస్త మంచిది* ఉంది’ అని అంటారు కదా?
నా సేవకుల విషయంలో నేను కూడా అలాగే చేస్తాను;
నేను వాళ్లందర్నీ నాశనం చేయను.+
9 నేను యాకోబు నుండి ఒక సంతానాన్ని* బయటికి తెస్తాను,యూదా నుండి, నా పర్వతాల్ని స్వాస్థ్యంగా పొందే వ్యక్తిని బయటికి తెస్తాను;+
నేను ఎంచుకున్న వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకుంటారు,
నా సేవకులు అందులో నివసిస్తారు.+
10 షారోను+ గొర్రెలకు మేత స్థలం అవుతుంది,
ఆకోరు లోయ+ పశువులకు విశ్రాంతి స్థలం అవుతుంది,నన్ను వెదికే నా ప్రజల కోసం అలా జరుగుతుంది.
11 కానీ మీరు యెహోవాను మర్చిపోయే ప్రజలు,+మీరు నా పవిత్ర పర్వతాన్ని మర్చిపోయి+అదృష్ట దేవతకు బల్లను సిద్ధం చేస్తారు,విధి దేవుడికి పానీయార్పణలు అర్పిస్తారు.
12 కాబట్టి నేను మిమ్మల్ని ఖడ్గానికి అప్పగిస్తాను,+
వధించబడడం కోసం మీరంతా వంగుతారు,+
ఎందుకంటే నేను పిలిచాను, కానీ మీరు పలకలేదు,
నేను మాట్లాడాను, కానీ మీరు వినలేదు;+
మీరు నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తూ వచ్చారు,
నాకు నచ్చని వాటిని ఎంచుకున్నారు.”+
13 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు:
“ఇదిగో! నా సేవకులు భోజనం చేస్తారు, కానీ మీరు ఆకలిగా ఉంటారు.+
నా సేవకులు నీళ్లు తాగుతారు,+ కానీ మీరు దాహంగా ఉంటారు.
నా సేవకులు సంతోషిస్తారు,+ కానీ మీరు అవమానాలపాలు అవుతారు.+
14 ఇదిగో! నా సేవకులు హృదయానందంతో సంతోషంగా కేకలు వేస్తారు,
కానీ మీరు హృదయ వేదనతో ఏడుస్తారు,
కృంగిన మనసుతో* విలపిస్తారు.
15 మీరు విడిచివెళ్లే పేరును, నేను ఎంచుకున్న ప్రజలు శపించడానికి ఉపయోగిస్తారు,
సర్వోన్నత ప్రభువైన యెహోవా మీలో ప్రతీ ఒక్కర్ని హతమారుస్తాడు,
కానీ తన సేవకుల్ని ఆయన వేరే పేరుతో పిలుస్తాడు;+
16 దానివల్ల భూమ్మీద తమ కోసం దీవెనను వెదికే వాళ్లు
సత్యవంతుడైన* దేవుని చేత దీవించబడతారు,
భూనివాసుల్లో ఒట్టేసి ప్రమాణం చేసేవాళ్లు
సత్యవంతుడైన* దేవుని తోడని ప్రమాణం చేస్తారు.+
ఎందుకంటే పాత కష్టాలన్నీ మరవబడతాయి;
అవి నా కళ్లకు కనిపించకుండా దాచబడతాయి.+
17 ఎందుకంటే ఇదిగో! నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాను;+
పాత సంగతులు గుర్తుకురావు,
అవి హృదయంలో కూడా ఉండవు.*+
18 నేను సృష్టించేవాటిని బట్టి మీరు ఉల్లసించండి, ఎప్పటికీ సంతోషించండి.
ఎందుకంటే, ఇదిగో! నేను సీయోనును సంతోష కారణంగా చేయబోతున్నాను,
దాని ప్రజల్ని ఉల్లాస కారణంగా చేయబోతున్నాను.+
19 నేను యెరూషలేమును బట్టి ఆనందిస్తాను, నా ప్రజల్ని బట్టి చాలా సంతోషిస్తాను;+
ఏడ్పులు గానీ, ఆర్తనాదాలు గానీ ఇంకెప్పుడూ దానిలో వినిపించవు.”+
20 “పుట్టిన కొన్ని రోజులకే చనిపోయే పసిబిడ్డలు గానీ,
ఆయుష్షు నిండకుండానే చనిపోయే ముసలివాళ్లు గానీ అక్కడ ఇక ఉండరు.
ఎందుకంటే, నూరేళ్ల వయసులో చనిపోయే వ్యక్తి కూడా బాలుడిగానే ఎంచబడతాడు,
పాపం చేసిన వ్యక్తి వందేళ్లవాడైనా సరే శపించబడతాడు.*
21 వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు,+
ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు.+
22 వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు,
వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు.
ఎందుకంటే నా ప్రజల ఆయుష్షు వృక్ష ఆయుష్షు అంత ఉంటుంది,+
నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు.
23 వాళ్లు వృథాగా ప్రయాసపడరు,+
అకస్మాత్తుగా వచ్చే అపాయానికి గురయ్యేలా పిల్లల్ని కనరు;
ఎందుకంటే వాళ్లు, వాళ్ల వంశస్థులు+
యెహోవా దీవించిన సంతానం.+
24 వాళ్లు వేడుకోకముందే నేను జవాబిస్తాను;
వాళ్లు మాట్లాడడం పూర్తికాక ముందే నేను వింటాను.
25 తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి,
సింహం ఎద్దులా గడ్డి తింటుంది,+
పాముకు మట్టి ఆహారమౌతుంది.
నా పవిత్ర పర్వతమంతటా అవి ఏ హాని గానీ, నాశనం గానీ చేయవు”+ అని యెహోవా అంటున్నాడు.
అధస్సూచీలు
^ లేదా “కాపలా గుడిసెల్లో” అయ్యుంటుంది.
^ లేదా “అపవిత్రమైనవాటి.”
^ లేదా “ఎందుకంటే నా పవిత్రతను నీకు బదిలీ చేస్తాను” అయ్యుంటుంది.
^ అక్ష., “దీవెన.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్.”
^ లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్.”
^ అక్ష., “హృదయంలోకి కూడా రావు.”
^ లేదా “వందేళ్లు నిండకుండానే చనిపోయే వ్యక్తి శాపగ్రస్తుడిగా ఎంచబడతాడు” అయ్యుంటుంది.