యెహెజ్కేలు 11:1-25

  • చెడ్డ అధిపతుల్ని ఖండించడం (1-13)

    • నగరాన్ని వంటపాత్రతో పోల్చడం (3-12)

  • పునరుద్ధరణ వాగ్దానం (14-21)

    • “కొత్త మనోవైఖరి” ఇవ్వబడుతుంది (19)

  • దేవుని మహిమ యెరూషలేము నుండి పైకి లేవడం (22, 23)

  • దర్శనంలో యెహెజ్కేలు కల్దీయ దేశానికి తిరిగిరావడం (24, 25)

11  తర్వాత ఒక శక్తి* నన్ను ఎత్తి, యెహోవా మందిర తూర్పు ద్వారం దగ్గరికి, అంటే తూర్పు వైపు ఉన్న ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చింది. అక్కడ ఆ ద్వార ప్రవేశం దగ్గర 25 మంది పురుషులు నాకు కనిపించారు, వాళ్లలో అజ్జూరు కుమారుడు యజన్యా, బెనాయా కుమారుడు పెలట్యా ఉన్నారు; వాళ్లు ప్రజల అధిపతులు.+  అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, కుట్రలు పన్నుతూ, ఈ నగరంలో* చెడ్డ సలహా ఇస్తున్నది వీళ్లే.  వీళ్లు, ‘ఇది ఇళ్లు కట్టుకునే సమయం కాదా?+ ఈ నగరం* వంటపాత్ర,*+ మనం అందులోని మాంసం’ అని చెప్పుకుంటున్నారు.  “కాబట్టి వీళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు. మానవ కుమారుడా, ప్రవచించు.”+  అప్పుడు యెహోవా పవిత్రశక్తి* నా మీదికి వచ్చింది.+ ఆయన నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు సరిగ్గానే చెప్పారు; మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.  మీరు ఈ నగరంలో చాలామంది చనిపోయేలా చేశారు, దీని వీధుల్ని శవాలతో నింపేశారు.” ’ ”+  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నగరంలో మీరు పారేసిన శవాలే ఆ మాంసం, ఈ నగరమే వంటపాత్ర.+ కానీ మీరు అందులో నుండి తీసేయబడతారు.’ ”  “ ‘మీరు ఖడ్గానికి భయపడ్డారు కదా,+ ఖడ్గాన్నే మీ మీదికి రప్పిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.  ‘నేను మిమ్మల్ని దానిలో నుండి బయటికి తీసుకొచ్చి, పరదేశులకు అప్పగించి, మీకు తీర్పు తీరుస్తాను.+ 10  మీరు ఖడ్గం వల్ల చనిపోతారు.+ నేను ఇశ్రాయేలు సరిహద్దు దగ్గర మీకు తీర్పు తీరుస్తాను,+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 11  ఈ నగరం మీకు వంటపాత్రగా ఉండదు, మీరు అందులో మాంసంగా ఉండరు; నేను ఇశ్రాయేలు సరిహద్దు దగ్గర మీకు తీర్పు తీరుస్తాను, 12  అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు నా నియమాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు,+ బదులుగా మీ చుట్టూ ఉన్న జనాల న్యాయనిర్ణయాల ప్రకారం ప్రవర్తించారు.’ ”+ 13  నేను ప్రవచించగానే, బెనాయా కుమారుడు పెలట్యా చనిపోయాడు, అప్పుడు నేను సాష్టాంగపడి బిగ్గరగా ఇలా అరిచాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! నువ్వు ఇశ్రాయేలులో మిగిలినవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తావా?”+ 14  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 15  “మానవ కుమారుడా, యెరూషలేము నివాసులు నీ సహోదరులతో, తిరిగి కొనే హక్కు ఉన్న నీ సహోదరులతో, ఇశ్రాయేలు ఇంటివాళ్లందరితో, ‘యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాది; ఇది మాకు ఆస్తిగా ఇవ్వబడింది’ అని అన్నారు. 16  కాబట్టి నువ్వు ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే: “నేను వాళ్లను దూరంగా జనాల మధ్యకు పంపించేశాను, దేశాల మధ్యకు వాళ్లను చెదరగొట్టాను,+ అయినా వాళ్లు వెళ్లిన దేశాల్లో నేను కొంతకాలం పాటు వాళ్లకు పవిత్రమైన స్థలంగా ఉంటాను.” ’+ 17  “కాబట్టి ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే: “నేను మిమ్మల్ని ఆయా ప్రజల మధ్య నుండి సమకూరుస్తాను, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని పోగుచేసి ఇశ్రాయేలు దేశాన్ని మీకు ఇస్తాను.+ 18  వాళ్లు అక్కడికి తిరిగొచ్చి, దానిలోని అసహ్యమైన, హేయమైన వాటిని తీసేస్తారు.+ 19  నేను వాళ్లకు ఒకే* హృదయాన్ని,+ కొత్త మనోవైఖరిని ఇస్తాను;+ వాళ్ల శరీరాల్లో నుండి రాతి గుండె తీసేసి+ వాళ్లకు మాంసం గుండె* ఇస్తాను,+ 20  అప్పుడు వాళ్లు నా శాసనాల ప్రకారం నడుస్తూ, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటికి లోబడతారు. వాళ్లు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.” ’ 21  “ ‘ “అయితే తమ అసహ్యమైన వాటిని, హేయమైన పనుల్ని అంటిపెట్టుకునేవాళ్ల విషయానికొస్తే, నేను వాళ్ల మార్గాల పర్యవసానాల్ని వాళ్ల తలల మీదికి రప్పిస్తాను” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.’ ” 22  అప్పుడు కెరూబులు తమ రెక్కల్ని పైకి ఎత్తారు, చక్రాలు వాళ్లకు దగ్గరగా ఉన్నాయి,+ ఇశ్రాయేలు దేవుని మహిమ వాళ్ల పైన ఉంది.+ 23  అప్పుడు యెహోవా మహిమ+ నగరం నుండి పైకి లేచి నగరానికి తూర్పున ఉన్న పర్వతం+ మీద నిలిచింది. 24  అప్పుడు ఒక శక్తి,* దేవుని పవిత్రశక్తి దర్శనం ద్వారా నన్ను పైకి ఎత్తి, కల్దీయ దేశంలో చెరగా ఉన్న ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది. తర్వాత నేను చూసిన ఆ దర్శనం నన్ను విడిచి వెళ్లింది. 25  అప్పుడు నేను, యెహోవా నాకు చూపించిన వాటన్నిటినీ చెరలో ఉన్న ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాను.

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.
లేదా “నగరానికి వ్యతిరేకంగా.”
అక్ష., “ఈమె,” అంటే యూదులు తాము సురక్షితంగా ఉంటామని అనుకున్న యెరూషలేము నగరం.
లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అంటే, దేవుని నిర్దేశానికి స్పందించే హృదయం.
లేదా “ఐక్య.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పవిత్రశక్తిని గానీ ఒక దేవదూతను గానీ సూచించవచ్చు.