యెహెజ్కేలు 17:1-24

  • రెండు గద్దలు, ద్రాక్షవల్లి పొడుపుకథ (1-21)

  • లేత రెమ్మ గొప్ప దేవదారు చెట్టు అవ్వడం (22-24)

17  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్ల గురించి ఒక పొడుపు కథ, సామెత చెప్పు.+  నువ్వు ఇలా అనాలి: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, “పొడవైన పెద్దపెద్ద రెక్కలు, రంగురంగుల దట్టమైన ఈకలు ఉన్న ఒక గొప్ప గద్ద+ లెబానోనుకు వచ్చి,+ దేవదారు చెట్టు పైకొమ్మను పట్టుకుంది.+  దాని చిటారుకొమ్మను తుంచి, వర్తకుల* దేశానికి తీసుకొచ్చి, వర్తకుల నగరంలో దాన్ని నాటింది.+  తర్వాత అది ఆ దేశ విత్తనాల్లో కొన్ని తీసుకెళ్లి+ సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీళ్ల పక్కన నిరవంజి చెట్టులా* దాన్ని నాటింది.  అది చిగిర్చి, ద్రాక్షవల్లి అయ్యి నేలమీద పాకింది;+ దాని ఆకులు అక్కడక్కడే వ్యాపించాయి, దాని వేళ్లు దానికింద పెరిగాయి. అలా అది ఒక ద్రాక్షచెట్టు అయ్యి కొమ్మలు, రెమ్మలు  వేసింది.+  “ ‘ “తర్వాత పొడవైన పెద్దపెద్ద రెక్కలు+ ఉన్న మరో గొప్ప గద్ద+ వచ్చింది. అప్పుడు ఆ ద్రాక్షచెట్టు తాను నాటబడిన చోటు నుండి దూరంగా ఆ పక్షి వైపు ఆత్రంగా తన వేళ్లను చాపింది, ఆ పక్షి తనను సాగుచేసేలా దానివైపు తన కొమ్మల్ని, ఆకుల్ని తిప్పింది.+  ఆ ద్రాక్షవల్లి కొమ్మలు వేసి, ఫలించి, పెద్ద ద్రాక్షచెట్టు అయ్యేలా అది అప్పటికే నీళ్లు సమృద్ధిగా ఉన్న మంచి పొలంలో నాటబడింది.” ’+  “నువ్వు ఇలా చెప్పు: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, “అది వర్ధిల్లుతుందా? ఎవరో ఒకరు దాని వేళ్లను పెకిలించరా?+ అప్పుడు దాని పండ్లు కుళ్లిపోతాయి, దాని కొమ్మలు వాడిపోతాయి.+ అది ఎంతగా ఎండిపోతుందంటే, దాన్ని పీకేయడానికి ఎక్కువ బలం గానీ, ఎక్కువమంది మనుషులు గానీ అవసరం లేదు. 10  దాన్ని వేరే చోట నాటినా అది వర్ధిల్లుతుందా? తూర్పుగాలి వీచినప్పుడు అది పూర్తిగా ఎండిపోదా? అది నాటబడిన చోటే ఎండిపోతుంది.” ’ ” 11  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 12  “తిరుగుబాటుదారులైన ఈ ప్రజలతో దయచేసి ఇలా చెప్పు, ‘వీటి అర్థాన్ని మీరు గ్రహించారా? ఇదిగో! బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చి, దాని రాజును, అధిపతుల్ని తనతోపాటు బబులోనుకు తీసుకెళ్లాడు.+ 13  అంతేకాదు, అతను రాజవంశంలో ఒకతన్ని తీసుకుని,+ అతనితో ఒప్పందం చేసి, అతనితో ప్రమాణం చేయించాడు.+ తర్వాత ఆ దేశంలోని ప్రముఖుల్ని తీసుకెళ్లిపోయాడు.+ 14  రాజ్యం దీనస్థితికి వచ్చి మళ్లీ వృద్ధి అవ్వకుండా ఉండాలని, తన ఒప్పందానికి కట్టుబడివుండడం ద్వారా మాత్రమే దాని ఉనికిని కాపాడుకోవాలని అలా చేశాడు.+ 15  కానీ చివరికి ఆ రాజు బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.+ గుర్రాల కోసం, పెద్ద సైన్యం కోసం+ ఐగుప్తుకు* సందేశకుల్ని పంపించాడు.+ అతను వర్ధిల్లుతాడా? ఇలాంటి పనులు చేసే వ్యక్తి శిక్షను తప్పించుకుంటాడా? అతను ఒప్పందాన్ని మీరి కూడా తప్పించుకోగలుగుతాడా?’+ 16  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, “నా జీవం తోడు, అతను బబులోనులోనే చనిపోతాడు; అంటే ఎవరైతే అతన్ని* రాజుగా చేశారో, ఎవరి ప్రమాణాన్ని అతను నీచంగా చూశాడో, ఎవరి ఒప్పందాన్ని మీరాడో ఆ రాజు* నివసించే స్థలంలోనే అతను చనిపోతాడు.+ 17  యుద్ధం జరిగేటప్పుడు, అంటే చాలామందిని చంపడానికి ముట్టడిదిబ్బలు వేసినప్పుడు, ముట్టడిగోడలు కట్టినప్పుడు ఫరో గొప్ప సైన్యం, అతని లెక్కలేనన్ని దండ్లు ఏమాత్రం సహాయం చేయలేవు.+ 18  అతను ప్రమాణాన్ని నీచంగా చూసి, ఒప్పందాన్ని మీరాడు. అతను మాట ఇచ్చి కూడా ఇవన్నీ చేశాడు కాబట్టి తప్పించుకోలేడు.” ’ 19  “ ‘కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “అతను నా ప్రమాణాన్ని నీచంగా చూసి, నా ఒప్పందాన్ని మీరాడు కాబట్టి, నా జీవం తోడు, నేను ఆ పర్యవసానాల్ని అతని తల మీదికి రప్పిస్తాను.+ 20  నేను అతని మీదికి నా వల విసురుతాను, అతను దానిలో చిక్కుకుంటాడు.+ నేను అతన్ని బబులోనుకు తీసుకొచ్చి, అతను నాకు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి అక్కడే అతనికి తీర్పు తీరుస్తాను.+ 21  అతని సైనికుల్లో పారిపోతున్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, మిగిలినవాళ్లు అన్నివైపులకు* చెదిరిపోతారు.+ అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్పానని మీరు తెలుసుకుంటారు.” ’+ 22  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను ఎత్తైన దేవదారు చెట్టు చిటారుకొమ్మను తీసి+ దాన్ని నాటతాను; దాని పైకొమ్మల నుండి ఒక లేత రెమ్మను తుంచి,+ నేనే దాన్ని ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీద నాటతాను.+ 23  నేను దాన్ని ఇశ్రాయేలు దేశంలోని ఒక గొప్ప పర్వతం మీద నాటతాను; అది కొమ్మలు వేసి, ఫలించి, గొప్ప దేవదారు చెట్టు అవుతుంది. అన్నిరకాల పక్షులు దానికింద నివసిస్తాయి, దాని కొమ్మల నీడలో గూళ్లు కట్టుకుంటాయి. 24  అప్పుడు, ఎత్తైన చెట్టును కింద పడేసింది, కింద ఉన్న చెట్టును హెచ్చించింది యెహోవానైన నేనే అని పొలంలోని చెట్లన్నీ తెలుసుకుంటాయి;+ నేను పచ్చని చెట్టును ఎండిపోజేశాను, ఎండిన చెట్టును చిగురింపజేశాను.+ యెహోవానైన నేను ఆ మాట చెప్పాను, దాన్ని నెరవేర్చాను.” ’ ”

అధస్సూచీలు

అక్ష., “కనాను.”
లేదా “విల్లో చెట్టులా.”
లేదా “ఈజిప్టుకు.”
అంటే, సిద్కియా.
అంటే, నెబుకద్నెజరు.
అక్ష., “ప్రతీ గాలికి.”