యెహెజ్కేలు 2:1-10

  • యెహెజ్కేలును ప్రవక్తగా నియమించడం (1-10)

    • “వాళ్లు విన్నా, వినకపోయినా” (5)

    • శోకగీతాలు ఉన్న గ్రంథపు చుట్టను చూపించడం (9, 10)

2  అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా,* లేచి నిలబడు, నేను నీతో మాట్లాడాలి.”+  ఆయన నాతో మాట్లాడినప్పుడు, పవిత్రశక్తి* నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది. అప్పుడు నేను ఆయన నాతో మాట్లాడుతున్న మాటలు విన్నాను.  ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, నా మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటుదారులైన జనాల+ దగ్గరికి పంపిస్తున్నాను.+ వాళ్లూ, వాళ్ల పూర్వీకులూ ఈ రోజు వరకు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు.+  మొండివాళ్లూ, కఠిన హృదయులూ అయిన ప్రజల+ దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; నువ్వు వాళ్లతో, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పాలి.  వాళ్ల విషయానికొస్తే, వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు+ కాబట్టి వాళ్లు విన్నా, వినకపోయినా తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు.+  “అయితే మానవ కుమారుడా, నీ చుట్టూ ముళ్లపొదలు, ముళ్లు ఉన్నా,*+ నువ్వు తేళ్ల మధ్య నివసిస్తున్నా వాళ్లకు గానీ వాళ్ల మాటలకు గానీ భయపడకు.+ వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు, అయినా వాళ్ల మాటలకు భయపడకు,+ వాళ్ల ముఖాల్ని చూసి బెదిరిపోకు.+  వాళ్లు విన్నా, వినకపోయినా నువ్వు నా మాటల్ని వాళ్లకు చెప్పాలి, ఎంతైనా వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+  “కానీ మానవ కుమారుడా, నేను నీకు చెప్పేది విను. నువ్వు తిరుగుబాటు చేసే ఈ ప్రజల్లా తయారవ్వకు. నీ నోరు తెరిచి, నేను నీకు ఇచ్చేది తిను.”+  నేను చూసినప్పుడు, ఒక చెయ్యి నా దగ్గరికి చాపబడింది,+ రాయబడిన ఒక గ్రంథపు చుట్ట+ ఆ చేతిలో ఉంది. 10  ఆయన దాన్ని నా ముందు విప్పాడు, అది రెండు వైపులా రాయబడి ఉంది.+ అందులో శోకగీతాలు, దుఃఖంతో-రోదనతో నిండిన మాటలు రాసివున్నాయి.+

అధస్సూచీలు

“మానవ కుమారుడు”; ఈ మాట యెహెజ్కేలు పుస్తకంలో 93 సార్లు కనిపిస్తుంది, ఇది మొదటిసారి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఈ ప్రజలు మొండిగా, గుచ్చుకునే వాటిలా ఉన్నా” అయ్యుంటుంది.