యెహెజ్కేలు 25:1-17
25 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
2 “మానవ కుమారుడా, అమ్మోనీయుల+ వైపు ముఖం తిప్పి, వాళ్లకు వ్యతిరేకంగా ప్రవచించు.+
3 అమ్మోనీయుల గురించి నువ్వు ఇలా చెప్పాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి. సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నా పవిత్రమైన స్థలం అపవిత్రపర్చబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం నిర్జనంగా పడివున్నప్పుడు, యూదా ఇంటివాళ్లు చెరలోకి వెళ్లినప్పుడు నువ్వు ఎగతాళిగా, ‘ఆహా!’ అని అన్నావు,
4 కాబట్టి నేను నిన్ను తూర్పు ప్రజలకు సొత్తుగా ఇస్తున్నాను. వాళ్లు నీ మధ్య శిబిరాలు* ఏర్పాటు చేసుకుని, డేరాలు వేసుకుని నివసిస్తారు. వాళ్లు నీ పంట తింటారు, నీ పాలు తాగుతారు.
5 నేను రబ్బాను+ ఒంటెల మేత స్థలంగా, అమ్మోనీయుల దేశాన్ని మందలు పడుకునే చోటుగా చేస్తాను; అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ’ ”
6 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఇశ్రాయేలు దేశ పరిస్థితి చూసి చప్పట్లు కొట్టి,+ పాదాలతో నేలను తన్ని, ఎగతాళి చేస్తూ సంతోషించావు కాబట్టి,+
7 నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, నిన్ను జనాలకు దోపుడుసొమ్ముగా ఇస్తాను. నువ్వు జనాల్లో ఉండకుండా కొట్టేస్తాను, దేశాల్లో నుండి నిన్ను నాశనం చేస్తాను.+ నిన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తాను, అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు.’
8 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ “యూదా ఇంటివాళ్లు ఇతర జనాల్లాగే ఉన్నారు” అని మోయాబు,+ శేయీరు+ అన్నాయి కాబట్టి,
9 నేను మోయాబు సరిహద్దు నగరాలు అంటే దాని శ్రేష్ఠమైన నగరాలైన* బేత్యేషిమోతు, బయల్మెయోను, చివరికి కిర్యతాయిము+ కూడా దాడికి గురయ్యేలా చేస్తాను.
10 నేను అమ్మోనీయులతో పాటు మోయాబును తూర్పు ప్రజలకు సొత్తుగా ఇస్తాను,+ ఇక అమ్మోనీయుల్ని జనాల మధ్య గుర్తుచేసుకోరు.+
11 నేను మోయాబుకు శిక్ష విధిస్తాను,+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’
12 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఎదోము యూదా ఇంటివాళ్ల మీద పగతో చర్య తీసుకుంది, వాళ్లమీద ప్రతీకారం తీర్చుకొని గొప్ప దోషం మూటగట్టుకుంది;+
13 అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను కూడా ఎదోముకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, దానిలోని మనుషుల్నీ పశువుల్నీ చంపేసి దాన్ని నిర్మానుష్యం చేస్తాను.+ తేమాను నుండి దెదాను వరకు ప్రజలు కత్తివల్ల కూలతారు.+
14 ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్వారా నేను ఎదోము మీద ప్రతీకారం తీర్చుకుంటాను.+ వాళ్లు ఎదోము మీద నా కోపాన్ని, నా ఉగ్రతను చూపిస్తారు; అలా ఎదోము నా ప్రతీకారాన్ని రుచిచూస్తుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’
15 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఫిలిష్తీయులు తమ శాశ్వత శత్రుత్వాన్ని బట్టి దుర్బుద్ధితో పగతీర్చుకోవాలని, నాశనం చేయాలని చూశారు.+
16 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతున్నాను;+ నేను కెరేతీయుల్ని నిర్మూలించి,+ సముద్రతీర నివాసుల్లో మిగిలినవాళ్లను నాశనం చేస్తాను.+
17 తీవ్రమైన కోపంతో వాళ్లను శిక్షించి వాళ్లమీద గొప్ప ప్రతీకార చర్యలు తీసుకుంటాను, నేను వాళ్లమీద ప్రతీకారం తీర్చుకునేటప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.” ’ ”