యెహెజ్కేలు 27:1-36

  • మునిగిపోతున్న తూరు ఓడ గురించి శోకగీతం (1-36)

27  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, నువ్వు తూరు గురించి ఒక శోకగీతం పాడు,+  తూరుతో ఇలా చెప్పు,‘సముద్ర ద్వారాల దగ్గర నివసించేదానా,అనేక ద్వీపాల ప్రజలతో వ్యాపారం చేసేదానా,సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “తూరూ, ‘నేను పరిపూర్ణ సౌందర్యవతిని’ అని నువ్వు చెప్పుకుంటున్నావు.+   నీ ప్రాంతాలు సముద్రం మధ్యలో ఉన్నాయి,నిన్ను కట్టినవాళ్లు నీ అందాన్ని పరిపూర్ణం చేశారు.   వాళ్లు నీ పలకలన్నిటినీ శెనీరుకు+ చెందిన సరళవృక్షాలతో* చేశారు,నీ ఓడ కొయ్యను లెబానోను దేవదారు మ్రానుతో చేశారు.   నీ తెడ్లను బాషానుకు చెందిన సింధూర వృక్షాలతో చేశారు,నీ ముందు భాగాన్ని కిత్తీము+ దీవులకు చెందిన తమాల వృక్షంతో చేసి, దంతంతో పొదిగారు.   నీ తెరచాపను ఐగుప్తుకు చెందిన రంగురంగుల నారవస్త్రంతో చేశారు,నీ తెరల్ని ఎలీషా+ ద్వీపాల నుండి వచ్చిన నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో చేశారు.   సీదోను, అర్వదు నివాసులు+ నీ తెడ్లు వేసేవాళ్లు. తూరూ, నీలోని నిపుణులే నీ నావికులు.+   అనుభవం, నైపుణ్యం ఉన్న గెబలు+ పురుషులు నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు.+ సముద్రంలోని ఓడలన్నీ, వాటి నావికులందరూ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చేవాళ్లు. 10  పారసీక,* లూదు, పూతు+ ప్రాంతాలవాళ్లు నీ సైన్యంలో ఉన్నారు, వాళ్లు నీ యుద్ధ శూరులు. వాళ్లు తమ డాళ్లను, శిరస్త్రాణాల్ని నీలో తగిలించి, నీకు వైభవం తెచ్చారు. 11  నీ సైన్యంలోని అర్వదు మనుషులు నీ ప్రాకారాల మీద చుట్టూ నిలబడేవాళ్లు,ధైర్యవంతులు నీ బురుజుల్ని కాపలాకాసేవాళ్లు. వాళ్లు నీ ప్రాకారాల చుట్టూ గుండ్రటి డాళ్లను వేలాడదీసినీ అందాన్ని పరిపూర్ణం చేశారు. 12  “ ‘ “నీ విస్తారమైన సంపద వల్ల తర్షీషు+ నీతో వ్యాపారం చేసింది.+ వాళ్లు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 13  యావాను, తుబాలు,+ మెషెకు+ వాళ్లు నీతో వ్యాపారం చేశారు; వాళ్లు బానిసల్ని, రాగి వస్తువుల్ని ఇచ్చి నీ సరుకులు కొనుక్కున్నారు.+ 14  తోగర్మా ఇంటివాళ్లు+ గుర్రాల్ని, యుద్ధ గుర్రాల్ని, కంచర గాడిదల్ని ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు. 15  దెదాను+ ప్రజలు నీతో వ్యాపారం చేశారు; అనేక ద్వీపాల్లోని వర్తకులు నీ కోసం పనిచేసేవాళ్లు; వాళ్లు ఏనుగు దంతాల్ని,+ కోవిదారు మ్రానుల్ని నీకు కప్పంగా ఇచ్చేవాళ్లు. 16  నీ విస్తారమైన సరుకుల వల్ల ఎదోము నీతో వ్యాపారం చేసింది. వాళ్లు లేత నీలం రాళ్లు, ఊదారంగు ఉన్ని, బుట్టాపని* చేసిన రంగురంగుల వస్త్రాలు, శ్రేష్ఠమైన వస్త్రాలు, పగడాలు, మాణిక్యాలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కున్నారు. 17  “ ‘ “యూదా, ఇశ్రాయేలు దేశం నీతో వ్యాపారం చేశాయి. అవి మిన్నీతు+ గోధుమల్ని, శ్రేష్ఠమైన ఆహారపదార్థాల్ని, తేనెను,+ నూనెను, సాంబ్రాణిని+ ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నాయి.+ 18  “ ‘ “నీ విస్తారమైన వస్తువుల వల్ల, సంపద వల్ల దమస్కు+ నీతో వ్యాపారం చేసింది. అది హెల్బోను ద్రాక్షారసం, జాహరు ఉన్ని* ఇచ్చి నీతో వ్యాపారం చేసింది. 19  ఊజాలుకు చెందిన వదాను, యావాను ఇనుమును,* లవంగిపట్టను,* వసను* ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నాయి. 20  దెదాను+ జీను* వస్త్రాల్ని* ఇచ్చి నీతో వ్యాపారం చేసింది. 21  అరబీయులు, కేదారు+ ప్రధానులందరూ నీతో వ్యాపారం చేశారు; వాళ్లు గొర్రెపిల్లల్ని, పొట్టేళ్లను, మేకల్ని ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 22  షేబ, రాయమా+ వర్తకులు నీతో వ్యాపారం చేశారు; వాళ్లు అన్నిరకాల శ్రేష్ఠమైన అత్తరులు, రత్నాలు, బంగారం ఇచ్చి నీ వస్తువులు కొనుక్కున్నారు.+ 23  హారాను,+ కన్నే, ఏదెను+ వాళ్లు; షేబ,+ అస్సూరు,+ కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24  వాళ్లు నీ సంతలో అందమైన బట్టల్ని, నీలంరంగు వస్త్రం మీద రంగురంగుల బుట్టాపని చేసిన బట్టల్ని, రంగురంగుల తివాచీల్ని అమ్మేవాళ్లు. వాటన్నిటినీ తాళ్లతో గట్టిగా కట్టి తీసుకొచ్చి వ్యాపారం చేసేవాళ్లు. 25  తర్షీషు ఓడలు+ నీ వస్తువుల్ని మోసేవి,నువ్వు సముద్రం మధ్యలో సంపదతో నిండిపోయి, బరువుగా* ఉండేదానివి. 26  నీ తెడ్లు వేసేవాళ్లు నిన్ను విస్తార జలాల్లోకి తీసుకెళ్లారు;సముద్రం మధ్యలో తూర్పు గాలి నిన్ను బద్దలు చేసింది. 27  నువ్వు పతనమయ్యే రోజుననీ సంపద, నీ వస్తువులు, నీ వ్యాపారం, నీ ప్రయాణికులు, నీ నావికులు,నీ ఓడల్ని బాగుచేసేవాళ్లు, నీతో వ్యాపారం చేసేవాళ్లు,+ యుద్ధ శూరులందరూ,+నీ సమూహమంతా నడి సముద్రంలో మునిగిపోతుంది.+ 28  నీ నావికులు కేకలు వేసినప్పుడు, తీరప్రాంతాలు వణికిపోతాయి. 29  తెడ్లు వేసేవాళ్లు, ప్రయాణికులు, నావికులు అందరూతమ ఓడల నుండి దిగి ఒడ్డున నిలబడతారు. 30  వాళ్లు నీ గురించి బిగ్గరగా ఏడుస్తారు,+తలల మీద దుమ్ము పోసుకుంటూ, బూడిదలో దొర్లుతారు. 31  తమ తలల్ని బోడి చేసుకొని గోనెపట్ట కట్టుకుంటారు;నీ గురించి తీవ్రంగా దుఃఖిస్తూ బోరున ఏడుస్తారు. 32  ఏడుస్తూ నీ గురించి ఇలా శోకగీతం పాడతారు: ‘ఇప్పుడు సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న తూరులాంటి నగరమేది?+ 33  సముద్రం నుండి నీ సరుకులు వచ్చినప్పుడు, అనేక జనాల వాళ్లు వాటితో తృప్తిపడ్డారు.+ నీ విస్తారమైన సంపద వల్ల, నీ వ్యాపారం వల్ల భూరాజులు ధనవంతులయ్యారు.+ 34  కానీ ఇప్పుడు నువ్వు నడి సముద్రంలో, లోతైన జలాల్లో బద్దలయ్యావు,+నీ వ్యాపారమంతా, నీ ప్రజలంతా నీతోపాటే మునిగిపోయారు.+ 35  ద్వీపాల నివాసులందరూ నీవైపు ఆశ్చర్యంతో చూస్తారు,+వాళ్ల రాజులు భయంతో వణికిపోతారు,+ వాళ్ల ముఖాలు దిగులుగా ఉంటాయి. 36  నీకు జరిగింది చూసి జనాల వ్యాపారులు ఈల వేస్తారు. నీ అంతం అకస్మాత్తుగా వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది,నువ్వు ఎప్పటికీ లేకుండా పోతావు.’ ” ’ ”+

అధస్సూచీలు

అంటే, జూనిపర్‌ చెట్లు.
లేదా “పర్షియా.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “ఎరుపు, బూడిదరంగు కలిసిన ఉన్ని.”
లేదా “చేత ఇనుమును.”
దాల్చినచెక్క చెట్టు జాతికి చెందిన ఒక చెట్టు.
ఒక సువాసన మొక్క.
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
లేదా “అల్లిన బట్టతో తయారుచేసిన వస్త్రాల్ని.”
లేదా “మహిమతో” అయ్యుంటుంది.