యెహెజ్కేలు 28:1-26

  • తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

    • “నేనొక దేవుణ్ణి” (2, 9)

  • తూరు రాజు గురించి శోకగీతం (11-19)

    • ‘నువ్వు ఏదెనులో ఉండేవాడివి’ (13)

    • “నిన్ను అభిషేకించి, కాపాడే కెరూబుగా నియమించాను” (14)

    • ‘నీలో చెడు కనిపించింది’ (15)

  • సీదోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (20-24)

  • ఇశ్రాయేలు పూర్వస్థితికి వస్తుంది (25, 26)

28  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, తూరు నాయకుడితో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నీ హృదయానికి పొగరెక్కి,+ ‘నేనొక దేవుణ్ణి, సముద్రం మధ్యలో దేవుని సింహాసనం మీద కూర్చున్నాను’+ అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ హృదయంలో నువ్వు దేవుడివి అనుకుంటున్నావు,కానీ నువ్వు కేవలం మనిషివి, దేవుడివి కాదు.   ఇదిగో! నువ్వు దానియేలు కన్నా తెలివిగల వాడివని,+ నీకు తెలియని రహస్యం ఏదీ లేదని అనుకుంటున్నావు.   నువ్వు నీ తెలివితో, నీ వివేచనతో ధనవంతుడివి అయ్యావు,నీ ఖజానాల్లో వెండిబంగారాలు పోగుచేసుకుంటూ ఉన్నావు.+   నైపుణ్యంతో వ్యాపారం చేసి గొప్ప సంపద పోగుచేసుకున్నావు,+నీ సంపద వల్ల నీ హృదయానికి పొగరెక్కింది.” ’  “ ‘అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు నీ హృదయంలో ఒక దేవుడివని అనుకుంటున్నావు కాబట్టి,   నేను నీ మీదికి విదేశీయుల్ని, జనాల్లో అత్యంత కిరాతకుల్ని రప్పిస్తున్నాను,+నీ తెలివితో నువ్వు సంపాదించిన అందమైన వాటన్నిటినీ వాళ్లు కత్తితో నాశనం చేస్తారు,నీ మహిమాన్విత వైభవాన్ని అపవిత్రపరుస్తారు.+   వాళ్లు నిన్ను గోతిలోకి* పంపిస్తారు,నువ్వు నడి సముద్రంలో ఘోరమైన చావు చస్తావు.+   నిన్ను చంపేవాడితో కూడా, ‘నేనొక దేవుణ్ణి’ అని అంటావా? నిన్ను అపవిత్రపర్చేవాళ్ల చేతుల్లో నువ్వు కేవలం మనిషివే కానీ దేవుడివి కాదు.” ’ 10  ‘విదేశీయుల చేతుల్లో నువ్వు సున్నతి లేనివాళ్లలా చనిపోతావు,నేనే స్వయంగా ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.” 11  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 12  “మానవ కుమారుడా, నువ్వు తూరు రాజు గురించి ఇలా శోకగీతం పాడు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు సంపూర్ణమైన తెలివితో,+ పరిపూర్ణ సౌందర్యంతో+పరిపూర్ణతకు నమూనాగా ఉండేవాడివి. 13  నువ్వు దేవుని తోట అయిన ఏదెనులో ఉండేవాడివి. నువ్వు అన్నిరకాల విలువైన రత్నాలతో, అంటేమాణిక్యం, పుష్యరాగం, సూర్యకాంతపు రాయి;లేతపచ్చ రాయి, సులిమాని రాయి, పచ్చరాయి;నీలం రాయి, లేత నీలం రాయి,+ మరకతం రాళ్లతో అలంకరించబడ్డావు; అవన్నీ బంగారు జవల్లో పొదగబడ్డాయి. నువ్వు సృష్టించబడిన రోజున అవి తయారుచేయబడ్డాయి. 14  నేను నిన్ను అభిషేకించి, కాపాడే కెరూబుగా నియమించాను. నువ్వు దేవుని పవిత్ర పర్వతం మీద ఉండేవాడివి,+ మండుతున్న రాళ్ల మధ్య తిరిగేవాడివి. 15  నువ్వు సృష్టించబడిన రోజు నుండి నీలో చెడు* కనిపించే వరకు+నీ ప్రవర్తనంతటిలో ఏ దోషమూ లేదు. 16  నీ విస్తారమైన వ్యాపారం వల్ల+నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేయడం మొదలుపెట్టావు.+ కాబట్టి నేను నిన్ను ఒక అపవిత్రుడిగా దేవుని పర్వతం మీద నుండి విసిరేసి, నాశనం చేస్తాను;+కాపాడే కెరూబూ, నిన్ను మండుతున్న రాళ్ల మధ్య నుండి వెళ్లగొడతాను. 17  నీ సౌందర్యం వల్ల నీ హృదయానికి పొగరెక్కింది.+ నీ మహిమాన్విత వైభవం వల్ల నువ్వు నీ తెలివిని పాడుచేసుకున్నావు.+ నేను నిన్ను భూమ్మీదికి పడేస్తాను.+ రాజులు నిన్ను ఆశ్చర్యంగా చూసేలా నిన్ను వాళ్ల ముందు ఉంచుతాను. 18  నీ గొప్ప దోషం వల్ల, అక్రమ వ్యాపారం వల్ల నువ్వు నీ పవిత్రమైన స్థలాల్ని అపవిత్రపర్చుకున్నావు. నేను నీ మధ్య అగ్ని రగులుకునేలా చేస్తాను, అది నిన్ను దహించేస్తుంది.+ నేను భూమ్మీద అందరి కళ్లముందు నిన్ను బూడిద చేస్తాను. 19  జనాల్లో నువ్వు తెలిసినవాళ్లందరూ నిన్ను ఆశ్చర్యంతో చూస్తారు.+ నీ అంతం అకస్మాత్తుగా వస్తుంది, అది భయంకరంగా ఉంటుంది,నువ్వు ఎప్పటికీ లేకుండా పోతావు.” ’ ”+ 20  తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 21  “మానవ కుమారుడా, నువ్వు సీదోను వైపుకు నీ ముఖం తిప్పి+ దానికి వ్యతిరేకంగా ప్రవచించు. 22  నువ్వు ఇలా అనాలి, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “సీదోనూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నేను నీ మధ్య మహిమపర్చబడతాను;నేను దానికి శిక్ష విధించినప్పుడు, నేను దానిలో పవిత్రపర్చబడినప్పుడు నేను యెహోవానని ప్రజలు తెలుసుకుంటారు. 23  నేను దానిలోకి తెగులును పంపిస్తాను, దాని వీధుల్లో రక్తం ప్రవహిస్తుంది. అన్నివైపుల నుండి దాని మీదికి ఖడ్గం వచ్చినప్పుడు, శవాలు దానిలో పడివుంటాయి;అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+ 24  “ ‘ “ఇక ఇశ్రాయేలు ఇంటివాళ్ల చుట్టూ హానిచేసే ముళ్లపొదలు, బాధించే ముళ్లు+ అంటే వాళ్లను ఎగతాళి చేసేవాళ్లు ఉండరు; అప్పుడు ప్రజలు నేను సర్వోన్నత ప్రభువైన యెహోవానని తెలుసుకుంటారు.” ’ 25  “ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను వాళ్లు చెదిరిపోయిన జనాల మధ్య నుండి సమకూర్చినప్పుడు,+ నేను జనాల కళ్లముందు వాళ్ల మధ్య పవిత్రపర్చబడతాను.+ వాళ్లు తమ దేశంలో అంటే నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో+ నివసిస్తారు.+ 26  వాళ్లు ఇళ్లు కట్టుకుని, ద్రాక్షతోటలు నాటుకుని+ ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు;+ నేను వాళ్లను ఎగతాళిచేసే చుట్టుపక్కల ప్రజలందర్నీ శిక్షించినప్పుడు వాళ్లు సురక్షితంగా ఉంటారు;+ అప్పుడు వాళ్లు, నేను తమ దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.” ’ ”

అధస్సూచీలు

లేదా “సమాధిలోకి.”
లేదా “అవినీతి.”