యెహెజ్కేలు 32:1-32

  • ఫరో, ఐగుప్తు గురించి శోకగీతం (1-16)

  • ఐగుప్తు సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటుంది (17-32)

32  12వ సంవత్సరం 12వ నెల మొదటి రోజున యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఐగుప్తు రాజైన ఫరో గురించి ఒక శోకగీతం పాడి, అతనితో ఇలా చెప్పు, ‘నువ్వు జనాల్లో బలమైన కొదమ సింహంలా ఉండేవాడివి,కానీ నీ నోరు మూతపడింది.నువ్వు నీ నదుల్లో దొర్లుతూ, నీ కాళ్లతో జలాల్ని బురద చేస్తూ, నదుల్ని* మురికిచేస్తున్న భారీ సముద్రప్రాణిలా ఉండేవాడివి.’+   సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘అనేక జనాల సమూహం ద్వారా నేను నా వలను నీమీద వేస్తాను,వాళ్లు దానితో నిన్ను బయటికి లాగుతారు.   నేను నిన్ను నేలమీద వదిలేస్తాను;బయటి మైదానంలో నిన్ను పారేస్తాను. ఆకాశపక్షులన్నీ నీమీద వాలేలా చేస్తాను,అడవి జంతువులన్నీ నీ మాంసంతో తృప్తిపడేలా చేస్తాను.+   నీ మాంసాన్ని పర్వతాల మీద విసిరేస్తాను,నీ అవశేషాలతో లోయల్ని నింపేస్తాను.+   నీ రక్తంతో దేశం పర్వతాల వరకు తడిసిపోయేలా చేస్తాను,వాగులు నీ రక్తంతో నిండిపోతాయి.’   ‘నేను నిన్ను ఆర్పేసినప్పుడు ఆకాశాన్ని కప్పేస్తాను, నక్షత్రాల్ని చీకటిమయం చేస్తాను. సూర్యుణ్ణి మేఘాలతో కప్పేస్తాను,చంద్రుడు తన వెలుగు ఇవ్వడు.+   నీ కారణంగా నేను ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటిమయం చేస్తాను,నీ దేశాన్ని చీకటితో కప్పేస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.   ‘నేను నీ ప్రజల్ని వేరే దేశాల్లోకి, నీకు తెలియని దేశాల్లోకి బందీలుగా తీసుకెళ్లినప్పుడు+అనేక జనాల హృదయాల్లో భయం పుట్టేలా చేస్తాను. 10  నేను వాళ్ల రాజుల ఎదుట నా ఖడ్గాన్ని ఆడించినప్పుడుఅనేక జనాలు నిర్ఘాంతపోతాయి, ఆ రాజులు భయంతో వణికిపోతారు. నువ్వు పతనమైన రోజునవాళ్లలో ప్రతీ ఒక్కరు ప్రాణ భయంతో గజగజలాడతారు.’ 11  ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘బబులోను రాజు ఖడ్గం నీ మీదికి వస్తుంది.+ 12  నేను బలమైన యోధుల ఖడ్గాల వల్ల నీ సైన్యాలు కూలిపోయేలా చేస్తాను,వాళ్లందరూ జనాల్లో అత్యంత కిరాతకులు.+ వాళ్లు ఐగుప్తు గర్వకారణాన్ని అణచివేస్తారు, దాని సైన్యాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.+ 13  నేను దాని విస్తార జలాల పక్కన ఉన్న దాని పశువులన్నిటినీ నాశనం చేస్తాను,+మనిషి కాలు గానీ, పశువు గిట్ట గానీ వాటిని మళ్లీ మురికి చేయదు.’+ 14  ‘అప్పుడు నేను ఆ దేశ జలాల్ని తేటగా చేస్తాను,వాళ్ల నదులు నూనెలా ప్రవహించేలా చేస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 15  ‘నేను ఐగుప్తును పనికిరాని నిర్జన స్థలంగా, సమస్తాన్ని కోల్పోయిన దేశంగా చేసినప్పుడు,+దాని నివాసులందర్నీ నాశనం చేసినప్పుడు,నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+ 16  ఇది శోకగీతం; ప్రజలు తప్పకుండా దీన్ని పాడతారు;జనాల కూతుళ్లు దీన్ని పాడతారు. ఐగుప్తు గురించి, దాని సైన్యాలన్నిటి గురించి వాళ్లు దీన్ని పాడతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” 17  12వ సంవత్సరం, నెల 15వ రోజున యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 18  “మానవ కుమారుడా, ఐగుప్తు సైన్యాల గురించి దుఃఖించు; గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు దాన్నీ, దానితోపాటు బలమైన జనాల కూతుళ్లనూ కిందవున్న దేశానికి పంపించు. 19  “ ‘అందంలో నువ్వు ఎవరికి సాటి? కిందికి దిగిపోయి, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుండు!’ 20  “ ‘వాళ్లు ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య పడివుంటారు.+ అది ఖడ్గానికి అప్పగించబడింది; దాని సైన్యాలన్నిటితో పాటు దాన్ని ఈడ్చుకెళ్లండి. 21  “ ‘సమాధి* లోతుల్లో నుండి అత్యంత బలమైన యోధులు అతనితో, అతని సహాయకులతో మాట్లాడతారు. వాళ్లు ఖచ్చితంగా కిందికి దిగిపోయి, ఖడ్గంతో చంపబడిన సున్నతిలేని వాళ్లలా పడివుంటారు. 22  అష్షూరు, దాని సమూహమంతా అక్కడే ఉంది. వాళ్ల సమాధులు అతని చుట్టూ ఉన్నాయి, వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు.+ 23  దాని సమాధులు గొయ్యి* లోతుల్లో ఉన్నాయి, దాని సమూహం దాని సమాధి చుట్టూ ఉంది; వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. ఎందుకంటే వాళ్లు సజీవుల దేశంలో భయం పుట్టించారు. 24  “ ‘అక్కడే ఏలాము+ ఉంది, దాని సైన్యాలన్నీ దాని సమాధి చుట్టూ ఉన్నాయి; వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. వాళ్లు సజీవుల దేశంలో భయం పుట్టించారు, వాళ్లు సున్నతి లేకుండా కిందవున్న దేశానికి దిగిపోయారు. గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతో పాటు ఇప్పుడు వాళ్లు తమ అవమానాన్ని భరిస్తారు. 25  చంపబడినవాళ్ల మధ్య దానికోసం ఒక పరుపు సిద్ధం చేయబడింది, దాని సైన్యాలన్నీ దాని సమాధుల చుట్టూ ఉన్నాయి. వాళ్లంతా సున్నతిలేని వాళ్లు, సజీవుల దేశంలో భయం పుట్టించినందుకు ఖడ్గంతో చంపబడినవాళ్లు; గోతిలోకి* దిగిపోతున్నవాళ్లతో పాటు వాళ్లు తమ అవమానాన్ని భరిస్తారు. అతను చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డాడు. 26  “ ‘అక్కడే మెషెకు, తుబాలు,+ వాళ్ల* సైన్యాలన్నీ ఉన్నాయి. అతని చుట్టూ వాళ్ల* సమాధులు ఉన్నాయి. వాళ్లంతా సున్నతిలేని వాళ్లు, సజీవుల దేశంలో భయం పుట్టించినందుకు ఖడ్గంతో పొడవబడినవాళ్లు. 27  చనిపోయి, తమ యుద్ధాయుధాలతో పాటు సమాధిలోకి* దిగిపోయిన సున్నతిలేని బలమైన యోధులతోపాటు వాళ్లు పడివుంటారు. వాళ్ల తలల కింద వాళ్ల కత్తులు,* వాళ్ల ఎముకల మీద వాళ్ల పాపాలు ఉంచబడతాయి; ఎందుకంటే ఈ బలమైన యోధులు సజీవుల దేశంలో భయం పుట్టించారు. 28  కానీ నువ్వు, సున్నతిలేని వాళ్ల మధ్య నాశనమౌతావు, ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు పడివుంటావు. 29  “ ‘అక్కడే ఎదోము,+ దాని రాజులు, దాని ప్రధానులందరూ ఉన్నారు. వాళ్లంతా బలవంతులే అయినా, ఖడ్గంతో చంపబడినవాళ్ల మధ్య ఉంచబడ్డారు; వాళ్లు కూడా గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు, సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటారు.+ 30  “ ‘అక్కడే ఉత్తర దిక్కు అధిపతులందరూ,* సీదోనీయులందరూ+ ఉన్నారు. వాళ్లు తమ బలంతో భయం పుట్టించినా, చంపబడినవాళ్లతో పాటు అవమానంతో కిందికి దిగిపోయారు. వాళ్లు ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు సున్నతి లేకుండా పడివుంటారు, గోతిలోకి* దిగిపోతున్న వాళ్లతోపాటు తమ అవమానాన్ని భరిస్తారు. 31  “ ‘ఫరో వీళ్లందర్నీ చూసి, తన సైన్యాలకు జరిగిన దానంతటి విషయంలో ఊరట పొందుతాడు;+ ఫరో, అతని సైన్యమంతా ఖడ్గం వల్ల చనిపోతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. 32  “ ‘ఫరో సజీవుల దేశంలో భయం పుట్టించాడు కాబట్టి, అతనూ అతని సైన్యాలన్నీ సున్నతిలేని వాళ్లతోపాటు, ఖడ్గంతో చంపబడినవాళ్లతో పాటు పడుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”

అధస్సూచీలు

అక్ష., “వాళ్ల నదుల్ని.”
లేదా “సమాధిలోకి.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “సమాధి.”
లేదా “సమాధిలోకి.”
లేదా “సమాధిలోకి.”
అక్ష., “దాని.”
అక్ష., “దాని.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
బహుశా తమ కత్తితోపాటు సైనిక లాంఛనాలతో సమాధి చేయబడిన యోధుల్ని సూచిస్తుండవచ్చు.
లేదా “సమాధిలోకి.”
లేదా “నాయకులందరూ.”
లేదా “సమాధిలోకి.”