యెహెజ్కేలు 4:1-17
4 “మానవ కుమారుడా, నువ్వు ఒక ఇటుక తీసుకుని నీ ముందు పెట్టుకో. దానిమీద యెరూషలేము నగరాన్ని చెక్కు.
2 దానికి ముట్టడి వేయి.+ దానికి ఎదురుగా ముట్టడిగోడ కట్టు,+ ముట్టడిదిబ్బ నిలబెట్టు,+ దాని ముందు శిబిరాలు వేయి, దాని చుట్టూ యుద్ధ యంత్రాలు ఉంచు.+
3 ఒక ఇనుప రేకు* తీసుకుని, దాన్ని నీకూ నగరానికీ మధ్య ఇనుప గోడలా నిలబెట్టు. దానివైపు నీ ముఖం తిప్పి ఉంచు, అది ముట్టడి కింద ఉన్నట్టు అవుతుంది; నువ్వు దాన్ని ముట్టడించాలి. ఇది ఇశ్రాయేలు ఇంటివాళ్లకు సూచనగా ఉంటుంది.+
4 “తర్వాత, నువ్వు నీ ఎడమపక్కకు తిరిగి పడుకుని ఇశ్రాయేలు ఇంటివాళ్ల దోషాన్ని నీ మీద* వేసుకోవాలి.+ నువ్వు ఎన్ని రోజులు ఆ పక్కకు తిరిగి పడుకుంటావో అన్ని రోజులు వాళ్ల దోషాన్ని భరిస్తావు.
5 వాళ్లు దోషం చేస్తూ వచ్చిన సంవత్సరాల ప్రకారం+ నేను నీకు 390 రోజులు నియమిస్తాను, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్ల దోషాన్ని భరిస్తావు.
6 నువ్వు ఆ రోజుల్ని పూర్తిచేయాలి.
“ఆ తర్వాత నువ్వు నీ కుడిపక్కకు తిరిగి పడుకుని, సంవత్సరానికి ఒక రోజు చొప్పున 40 రోజులు యూదా ఇంటివాళ్ల దోషాన్ని+ భరిస్తావు. సంవత్సరానికి ఒక రోజు చొప్పున నేను నీకు నియమించాను.
7 నువ్వు నీ చెయ్యి మీద ఉన్న చొక్కాను పైకి మడిచి, యెరూషలేము ముట్టిడివైపు+ నీ ముఖం తిప్పుకుని దానికి వ్యతిరేకంగా ప్రవచించాలి.
8 “ఇదిగో! నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నువ్వు ఒక పక్క నుండి మరో పక్కకు తిరగకుండా నేను నిన్ను తాళ్లతో కట్టేస్తాను.
9 “నువ్వు గోధుమలు, బార్లీ, పెద్ద చిక్కుళ్లు, చిక్కుడు గింజలు, సజ్జలు, పొడుగు గోధుమలు* తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసుకుని, వాటితో నీ కోసం రొట్టెలు చేసుకోవాలి. నువ్వు పక్కకు తిరిగి పడుకునే 390 రోజులూ వాటిని తింటావు.+
10 నువ్వు కొలత ప్రకారం రోజుకు 20 షెకెల్‌ల* ఆహారం తింటావు. నువ్వు దాన్ని నిర్ణీత సమయాల్లో తింటావు.
11 “అలాగే నువ్వు కొలత ప్రకారం ఒక హిన్‌లో ఆరో వంతు* నీళ్లు తాగుతావు. నువ్వు ఆ నీళ్లను నిర్ణీత సమయాల్లో తాగుతావు.
12 “నువ్వు దాన్ని గుండ్రటి బార్లీ రొట్టెను తిన్నట్టు తినాలి; నువ్వు మనుషుల మలాన్ని వంటచెరకుగా ఉపయోగించి వాళ్లు చూస్తుండగా ఆ రొట్టెను కాల్చాలి.”
13 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “నేను వాళ్లను చెదరగొట్టే దేశాల మధ్య ఇశ్రాయేలీయులు ఇలా అపవిత్రంగా తమ రొట్టెలు తింటారు.”+
14 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా, అలా కాదు! నేను చిన్నప్పటి నుండి చనిపోయిన జంతువు మాంసాన్ని గానీ, చీల్చబడిన జంతువు మాంసాన్ని గానీ తినడం వల్ల అపవిత్రుణ్ణి కాలేదు,+ అపవిత్రమైన మాంసమే ఎప్పుడూ నా నోట్లోకి వెళ్లలేదు.”+
15 అప్పుడు ఆయన నాతో, “సరే, మనుషుల మలానికి బదులుగా పశువుల పేడను ఉపయోగించుకో, దానిమీద నీ రొట్టెలు కాల్చుకో” అని అన్నాడు.
16 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇదిగో నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపేస్తున్నాను,*+ వాళ్లు ఎంతో ఆందోళనతో తమ ఆహారాన్ని కొలత ప్రకారం తింటారు,+ తమ నీళ్లను భయంభయంగా కొలుచుకొని తాగుతారు.+
17 రొట్టెలకు, నీళ్లకు కొరత ఏర్పడడం వల్ల వాళ్లు నిర్ఘాంతపోయి ఒకరినొకరు చూసుకుంటారు, తమ దోషంవల్ల కృశించిపోతారు.
అధస్సూచీలు
^ లేదా “ఇనుప పెనం.”
^ అక్ష., “దాని మీద,” అంటే యెహెజ్కేలు ఎడమవైపు మీద.
^ ఇవి ప్రాచీన ఐగుప్తులో పండే తక్కువ రకం గోధుమలు.
^ దాదాపు 230 గ్రాములు. అనుబంధం B14 చూడండి.
^ దాదాపు 600 మి.లీ. అనుబంధం B14 చూడండి.
^ అక్ష., “రొట్టెల కర్రల్ని విరగ్గొడుతున్నాను.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.