యెహెజ్కేలు 46:1-24

  • ఆయా సందర్భాల్లో అర్పణలు (1-15)

  • ప్రధానుడి ఆస్తి వారసత్వం (16-18)

  • బలుల మాంసం ఉడకబెట్టే చోట్లు (19-24)

46  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘తూర్పు వైపున్న లోపలి ప్రాంగణ ద్వారం+ ఆరు పనిరోజులూ+ మూయబడే ఉండాలి;+ అయితే విశ్రాంతి రోజున, అమావాస్య రోజున అది తెరవబడాలి.  ప్రధానుడు బయటి ప్రాంగణం నుండి ద్వారం వసారా గుండా లోపలికి వచ్చి,+ ద్వారపు ద్వారబంధం దగ్గర నిలబడతాడు. యాజకులు అతని సంపూర్ణ దహనబలిని, సమాధాన బలుల్ని అర్పిస్తారు; అతను ద్వారం గడప దగ్గర వంగి నమస్కారం చేసి వెళ్లిపోతాడు. అయితే సాయంత్రం వరకు ఆ ద్వారాన్ని మూయకూడదు.  దేశంలోని ప్రజలు కూడా విశ్రాంతి రోజుల్లో, అమావాస్య రోజుల్లో ఆ ద్వార ప్రవేశం దగ్గర యెహోవా ముందు వంగి నమస్కారం చేస్తారు.+  “ ‘విశ్రాంతి రోజున ఆ ప్రధానుడు యెహోవాకు అర్పించే సంపూర్ణ దహనబలిలో, ఏ లోపంలేని ఏడు మగ గొర్రెపిల్లలు, ఏ లోపంలేని ఒక పొట్టేలు ఉండాలి.+  ధాన్యార్పణగా పొట్టేలుతో పాటు ఒక ఈఫా* పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటు అతను ఇవ్వగలిగింది ఇవ్వాలి; అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్‌* నూనెను ఇవ్వాలి.+  అమావాస్య రోజున అర్పించే అర్పణలో మంద నుండి ఏ లోపంలేని ఒక కోడెదూడ, ఆరు మగ గొర్రెపిల్లలు, ఒక పొట్టేలు ఉండాలి; వాటిలో ఏ లోపం ఉండకూడదు.+  అతను ధాన్యార్పణగా కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటేమో తాను ఇవ్వగలిగింది ఇవ్వాలి. అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్‌ నూనెను ఇవ్వాలి.  “ ‘ప్రధానుడు లోపలికి ప్రవేశించేటప్పుడు, ద్వారం వసారా గుండా రావాలి, అదే దారిలో బయటికి వెళ్లాలి.+  అయితే దేశ ప్రజలు పండుగలప్పుడు యెహోవాను ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు,+ ఉత్తర ద్వారం+ గుండా వచ్చేవాళ్లు దక్షిణ ద్వారం+ గుండా బయటికి వెళ్లాలి; దక్షిణ ద్వారం గుండా వచ్చేవాళ్లు ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్లాలి; ఎవ్వరూ తాము వచ్చిన ద్వారం గుండా బయటికి వెళ్లకూడదు, బదులుగా దానికి ఎదురుగా ఉన్న ద్వారం గుండా బయటికి వెళ్లాలి. 10  అయితే వాళ్ల మధ్య ఉన్న ప్రధానుడి విషయానికొస్తే, ప్రజలు లోపలికి వచ్చినప్పుడు అతను లోపలికి రావాలి, వాళ్లు బయటికి వెళ్లేటప్పుడు అతను బయటికి వెళ్లాలి. 11  పండుగలప్పుడు, పండుగ సమయాల్లో ధాన్యార్పణగా కోడెదూడతో పాటు ఒక ఈఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఈఫా పిండిని, మగ గొర్రెపిల్లలతో పాటేమో తాను ఇవ్వగలిగింది ఇవ్వాలి. అలాగే ప్రతీ ఈఫాకు ఒక హిన్‌ నూనెను ఇవ్వాలి.+ 12  “ ‘ఒకవేళ ప్రధానుడు యెహోవాకు స్వేచ్ఛార్పణగా సంపూర్ణ దహనబలిని+ గానీ సమాధాన బలుల్ని గానీ ఇస్తే, తూర్పు ద్వారాన్ని అతని కోసం తెరవాలి; అతను విశ్రాంతి రోజున ఇచ్చినట్టే తన సంపూర్ణ దహనబలిని, తన సమాధాన బలుల్ని ఇస్తాడు.+ అతను బయటికి వెళ్లిపోయిన తర్వాత, ఆ ద్వారాన్ని మూసేయాలి.+ 13  “ ‘ప్రతీరోజు ఏ లోపంలేని ఒక ఏడాది మగ గొర్రెపిల్లను యెహోవాకు సంపూర్ణ దహనబలిగా ఇవ్వాలి.+ ప్రతీ ఉదయం అలా చేయాలి. 14  దానితోపాటు, ప్రతీ ఉదయం ధాన్యార్పణగా ఈఫాలో ఆరోవంతు పిండిని ఇవ్వాలి; అలాగే ఆ మెత్తని పిండి మీద చల్లడానికి హిన్‌లో మూడోవంతు నూనెను ఇవ్వాలి; ఇది యెహోవాకు ఎప్పుడూ అర్పించే ధాన్యార్పణ. ఇది శాశ్వత శాసనం. 15  ఎప్పుడూ అర్పించే సంపూర్ణ దహనబలిగా ప్రతీ ఉదయం ఒక మగ గొర్రెపిల్లను, ధాన్యార్పణను, నూనెను ఇవ్వాలి.’ 16  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఒకవేళ ప్రధానుడు తన కుమారుల్లో ప్రతీ ఒక్కరికి భూమిని స్వాస్థ్యంగా బహుమతి ఇస్తే, అది అతని కుమారుల ఆస్తి అవుతుంది. అది వాళ్లకు వారసత్వ ఆస్తి. 17  అయితే ఒకవేళ అతను తన సేవకుల్లో ఒకరికి తన స్వాస్థ్యంలో నుండి బహుమతి ఇస్తే, అది విడుదల సంవత్సరం+ వరకే ఆ సేవకుడిది అవుతుంది; ఆ తర్వాత అది ప్రధానుడికి తిరిగొస్తుంది. అతని కుమారుల స్వాస్థ్యం మాత్రమే శాశ్వతంగా వాళ్లకు ఉండిపోతుంది. 18  ప్రధానుడు ప్రజల్లో ఎవ్వర్నీ వాళ్ల స్వాస్థ్యం నుండి బలవంతంగా వెళ్లగొట్టి దాన్ని సొంతం చేసుకోకూడదు. అతను తన ఆస్తిలో నుండే తన కుమారులకు స్వాస్థ్యం ఇవ్వాలి. అలా నా ప్రజల్లో ఏ ఒక్కరూ తమ స్వాస్థ్యం నుండి వెళ్లగొట్టబడకుండా ఉంటారు.’ ” 19  తర్వాత అతను నన్ను ఉత్తరం వైపు+ గుమ్మాలున్న యాజకుల పవిత్ర భోజనాల గదులకు వెళ్లే ద్వారం పక్కనున్న ప్రవేశ మార్గం+ గుండా లోపలికి తీసుకొచ్చాడు, అక్కడ పడమటి వైపు వెనక భాగంలో నాకు ఒక స్థలం కనిపించింది. 20  అతను నాతో ఇలా అన్నాడు: “యాజకులు ఇక్కడే అపరాధ పరిహారార్థ బలి మాంసాన్ని, పాపపరిహారార్థ బలి మాంసాన్ని ఉడకబెడతారు,+ ధాన్యార్పణను కాలుస్తారు. దానివల్ల వాళ్లు దేన్నీ బయటి ప్రాంగణంలోకి తీసుకెళ్లకుండా, అలా ప్రజల్ని పవిత్రుల్ని చేయకుండా ఉంటారు.”+ 21  అతను నన్ను బయటి ప్రాంగణంలోకి తీసుకొచ్చి, ప్రాంగణం నాలుగు మూలలకూ నడిపించాడు. అప్పుడు నాకు బయటి ప్రాంగణం నాలుగు మూలల్లో ప్రాంగణాలు కనిపించాయి. 22  ప్రాంగణం నాలుగు మూలల్లో నాలుగు చిన్న ప్రాంగణాలు ఉన్నాయి; వాటి పొడవు 40 మూరలు,* వెడల్పు 30 మూరలు. నాలుగు ప్రాంగణాల కొలతలు ఒక్కటే. 23  ఆ నాలుగు ప్రాంగణాల్లో చుట్టూ అరుగులు ఉన్నాయి, వాటి కింద అర్పణల మాంసాన్ని ఉడకబెట్టడానికి పొయ్యిలు కట్టబడివున్నాయి. 24  అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఇవి ఆలయ పరిచారకులు ప్రజల బలుల మాంసాన్ని ఉడకబెట్టే స్థలాలు.”+

అధస్సూచీలు

అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.