యెహెజ్కేలు 47:1-23

  • ఆలయం నుండి వచ్చే ప్రవాహం (1-12)

    • నీళ్ల లోతు క్రమక్రమంగా పెరగడం (2-5)

    • మృత సముద్రంలోని నీళ్లు బాగవ్వడం (8-10)

    • చిత్తడినేలలు బాగవ్వవు (11)

    • ఆహారం, స్వస్థత కోసం చెట్లు (12)

  • దేశ సరిహద్దులు (13-23)

47  తర్వాత అతను నన్ను మళ్లీ ఆలయ ప్రవేశం+ దగ్గరికి తీసుకొచ్చాడు; ఆలయ గడప కింద నుండి తూర్పు వైపు నీళ్లు ప్రవహించడం నాకు అక్కడ కనిపించింది,+ ఎందుకంటే ఆలయ ముందుభాగం తూర్పు వైపుకు ఉంది. ఆ నీళ్లు ఆలయ కుడివైపు నుండి కిందికి, బలిపీఠానికి దక్షిణం వైపుగా ప్రవహిస్తున్నాయి.  తర్వాత అతను నన్ను ఉత్తర ద్వారం+ గుండా బయటికి తీసుకెళ్లాడు; అతను నన్ను బయటికి నడిపించి, చుట్టూ తిప్పి తూర్పు వైపున్న బయటి ద్వారం+ దగ్గరికి తీసుకొచ్చాడు; అక్కడ నేను కుడివైపు నుండి నీళ్లు కారడం చూశాను.  ఆ మనిషి కొలనూలు చేతపట్టుకొని+ తూర్పు వైపు నడుస్తూ 1,000 మూరలు* కొలిచాడు; తర్వాత నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి చీలమండ లోతున్నాయి.  తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచి, నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి మోకాలు లోతున్నాయి. తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచి, నన్ను ఆ నీళ్ల గుండా నడిపించాడు; అవి నడుము లోతున్నాయి.  తర్వాత అతను ఇంకో 1,000 మూరలు కొలిచాడు. అవి నేను నడవలేనంత పెద్ద ప్రవాహంలా ఉన్నాయి; ఆ నీళ్లు ఎంత లోతుగా ఉన్నాయంటే ఈత కొడితే తప్ప నడుస్తూ వాటిని దాటలేం.  అతను నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, ఇది చూశావా?” తర్వాత అతను నన్ను ఆ ప్రవాహంలో నుండి ఒడ్డుకు నడిపించాడు.  నేను తిరిగొచ్చినప్పుడు, ఆ ప్రవాహం ఒడ్డున రెండువైపులా ఎన్నో చెట్లు కనిపించాయి.+  అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: “ఈ నీళ్లు తూర్పు ప్రాంతం వైపు అరాబా*+ మీదుగా ప్రవహించి సముద్రంలో* కలుస్తాయి. అవి సముద్రంలో కలిసినప్పుడు+ అక్కడి నీళ్లు మంచినీళ్లు అవుతాయి.  ఈ నీళ్లు వెళ్లిన ప్రతీచోట జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు ప్రవహించడం వల్ల అక్కడ విస్తారంగా చేపలు ఉంటాయి. సముద్రంలోని నీళ్లు మంచినీళ్లు అవుతాయి, ఆ ప్రవాహం వెళ్లిన ప్రతీచోట అన్నీ బ్రతుకుతాయి. 10  “ఏన్గెదీ+ నుండి ఏనెగ్లాయీము వరకు జాలరులు ఆ సముద్రం ఒడ్డున నిలబడివుంటారు, అక్కడ వలలు ఆరబెట్టుకోవడానికి ఒక స్థలం ఉంటుంది. మహా సముద్రంలో*+ ఉన్నట్టు దానిలో రకరకాల చేపలు సమృద్ధిగా ఉంటాయి. 11  “అయితే దాని దగ్గర చిత్తడినేలలు, బురద స్థలాలు ఉంటాయి, అవి బాగవ్వవు. వాటిలోని ఉప్పు అలాగే ఉండిపోతుంది.+ 12  “ప్రవాహం ఒడ్డున రెండువైపులా ఆహారం ఇచ్చే అన్నిరకాల పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు; ఆ చెట్లు ఫలించకుండా ఉండవు. అవి ప్రతీ నెల కాపు కాస్తాయి, ఎందుకంటే పవిత్రమైన స్థలం నుండి ప్రవహించే నీళ్లు+ వాటికి అందుతున్నాయి. వాటి పండ్లు ఆహారం కోసం, వాటి ఆకులు స్వస్థత కోసం ఉపయోగపడతాయి.”+ 13  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు ఇశ్రాయేలు 12 గోత్రాలకు స్వాస్థ్యంగా పంచి ఇచ్చే ప్రాంతం ఇదే, యోసేపుకు రెండు భాగాలు వస్తాయి.+ 14  మీరు దాన్ని స్వాస్థ్యంగా పొందుతారు, అందరికీ సమాన వాటాలు వస్తాయి.* నేను ఈ దేశాన్ని మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేశాను,+ ఇప్పుడది మీకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వబడింది. 15  “ఇది ఆ దేశం ఉత్తర సరిహద్దు: ఇది మహా సముద్రం నుండి హెత్లోను+ మార్గంలో, సెదాదు+ మీదుగా, 16  హమాతు,+ బేరోతా,+ దమస్కు-హమాతు ప్రాంతాల మధ్య ఉన్న సిబ్రయీము మీదుగా, హవ్రాను+ సరిహద్దు దగ్గర ఉన్న హాజేర్‌-హత్తికోను వరకు వెళ్తుంది. 17  కాబట్టి ఆ సరిహద్దు సముద్రం నుండి ఉత్తరం వైపు దమస్కు సరిహద్దు మీదుగా, హమాతు+ సరిహద్దు మీదుగా హసరేనాను+ వరకు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు. 18  “తూర్పు సరిహద్దు హవ్రాను, దమస్కుల మధ్యగా, అలాగే గిలాదుకు,+ ఇశ్రాయేలు దేశానికి మధ్య ఉన్న యొర్దాను మీదుగా సాగుతుంది. నువ్వు ఉత్తర సరిహద్దు నుండి తూర్పు సముద్రం* వరకు కొలవాలి. ఇది తూర్పు సరిహద్దు. 19  “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబాతు-కాదేషు నీళ్ల+ వరకు, అక్కడి నుండి వాగు* వరకు, అక్కడి నుండి మహా సముద్రం వరకు ఉంటుంది.+ ఇది దక్షిణ సరిహద్దు. 20  “పడమటి వైపు, దక్షిణ సరిహద్దు నుండి లెబో-హమాతు*+ ఎదురుగా ఉన్న చోటు వరకు మహా సముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు.” 21  “మీరు ఈ దేశాన్ని మీ మధ్య అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య పంచుకోవాలి. 22  మీరు దీన్ని స్వాస్థ్యంగా పంచుకోవాలి, అలాగే మీ మధ్య ఉంటూ పిల్లల్ని కన్న పరదేశులకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వాలి. మీరు పరదేశుల్ని కూడా మీ మధ్య పుట్టిన ఇశ్రాయేలీయుల్లాగే ఎంచాలి. వాళ్లు మీతోపాటు ఇశ్రాయేలు గోత్రాల్లో స్వాస్థ్యం పొందుతారు. 23  ఒక పరదేశి ఏ గోత్రంలో స్థిరపడ్డాడో ఆ గోత్రానికి చెందిన ప్రాంతంలోనే అతనికి స్వాస్థ్యం ఇవ్వాలి” అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.

అధస్సూచీలు

ఇవి పొడవైన మూరలు. అనుబంధం B14 చూడండి.
లేదా “ఎడారి మైదానం.”
అంటే, మృత సముద్రం.
అంటే, మధ్యధరా సముద్రం.
లేదా “ప్రతీ వ్యక్తి తన సహోదరుడిలాగే స్వాస్థ్యం పొందుతాడు.”
అంటే, మృత సముద్రం.
అంటే, ఐగుప్తు వాగు.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”