యెహెజ్కేలు 6:1-14

  • ఇశ్రాయేలు పర్వతాలకు వ్యతిరేకంగా (1-14)

    • అసహ్యమైన విగ్రహాలు అవమానాలపాలు అవుతాయి (4-6)

    • “నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు” (7)

6  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల వైపు నీ ముఖం తిప్పి వాటికి వ్యతిరేకంగా ప్రవచించు.  నువ్వు ఇలా అనాలి, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్పేది వినండి: పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఇదిగో! నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ ఉన్నత స్థలాల్ని నాశనం చేస్తాను.  మీ బలిపీఠాలు పడగొట్టబడతాయి, మీ ధూపస్తంభాలు విరగ్గొట్టబడతాయి,+ మీలో చంపబడినవాళ్లను నేను మీ అసహ్యమైన విగ్రహాల* ముందు పడేస్తాను.+  నేను ఇశ్రాయేలు ప్రజల శవాల్ని వాళ్ల అసహ్యమైన విగ్రహాల ముందు పడేస్తాను, మీ ఎముకల్ని మీ బలిపీఠాల చుట్టూ విసిరేస్తాను.+  మీరు నివసించే ప్రాంతాలన్నిట్లో నగరాలు పాడైపోతాయి,+ ఉన్నత స్థలాలు పడగొట్టబడి పాడుబడిన స్థితిలో ఉంటాయి.+ మీ బలిపీఠాలు పడగొట్టబడి ముక్కలుముక్కలు చేయబడతాయి, మీ అసహ్యమైన విగ్రహాలు నశించిపోతాయి, మీ ధూపస్తంభాలు విరగ్గొట్టబడతాయి, మీ చేతుల పనులు తుడిచిపెట్టుకుపోతాయి.  చంపబడినవాళ్లు మీ మధ్య పడివుంటారు,+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+  “ ‘ “అయితే నేను మీలో కొంతమంది మిగిలేలా చేస్తాను, మీరు ఆయా దేశాల్లోకి చెదిరిపోయినప్పుడు ఆ జనాల మధ్య మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.+  అలా తప్పించుకున్నవాళ్లు తాము బందీలుగా వెళ్లిన జనాల మధ్య నన్ను గుర్తుచేసుకుంటారు.+ నన్ను విడిచిపెట్టిన తమ వ్యభిచార హృదయాన్ని బట్టి, తమ అసహ్యమైన విగ్రహాల్ని ఎంతో కోరుకున్న తమ కళ్లను బట్టి+ నా హృదయం ముక్కలైందని+ వాళ్లు గ్రహిస్తారు. తాము చేసిన అసహ్యమైన చెడ్డ పనులన్నిటిని బట్టి వాళ్లు సిగ్గుపడతారు, వాటిని అసహ్యించుకుంటారు.+ 10  నేను యెహోవానని, వాళ్ల మీదికి ఈ విపత్తు తీసుకొస్తానని నేను చెప్పిన మాట వట్టి మాట కాదని వాళ్లు తెలుసుకుంటారు.” ’+ 11  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లు చేసిన అసహ్యమైన చెడ్డ పనులన్నిటిని బట్టి నీ చేతులు చరుచుకొని, నీ పాదంతో నేలను తన్ని, ఏడువు; ఎందుకంటే వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు.+ 12  దూరంగా ఉన్నవాళ్లు తెగులు వల్ల చనిపోతారు, దగ్గర్లో ఉన్నవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు; వీటిని తప్పించుకుని మిగిలినవాళ్లు కరువు వల్ల చనిపోతారు. వాళ్ల మీద నాకున్న ఆగ్రహాన్ని నేను పూర్తిగా వెళ్లగక్కుతాను.+ 13  వాళ్లలో చంపబడినవాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూ, ప్రతీ ఎత్తైన కొండ మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, పచ్చని ప్రతీ చెట్టు కింద, పెద్దపెద్ద చెట్ల కొమ్మల కింద పడినప్పుడు, అంటే తమ అసహ్యమైన విగ్రహాలన్నిటినీ సంతోషపెట్టడానికి వాళ్లు పరిమళ అర్పణలు+ అర్పించిన ప్రతీచోట వాళ్ల శవాలు పడినప్పుడు+ నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.+ 14  నేను వాళ్లకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, ఆ దేశాన్ని నిర్జనంగా చేస్తాను; వాళ్ల నివాస స్థలాలన్నీ దిబ్లా దగ్గరున్న ఎడారి* కన్నా నిర్మానుష్యంగా తయారౌతాయి. అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”

అధస్సూచీలు

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
పదకోశం చూడండి.