యెహోషువ 10:1-43

  • ఇశ్రాయేలీయులు గిబియోనును కాపాడడం (1-7)

  • యెహోవా ఇశ్రాయేలీయుల కోసం పోరాడడం (8-15)

    • పారిపోతున్న శత్రువుల మీద వడగండ్లు (11)

    • సూర్యుడు కదలకుండా నిలిచి​పోవడం (12-14)

  • దాడిచేస్తున్న ఐదుగురు రాజులు చంపబడడం (16-28)

  • దక్షిణాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (29-43)

10  యెహోషువ హాయి నగరాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని నాశనం చేశాడనీ, యెరికోకు, దాని రాజుకు చేసినట్టే+ హాయికి, దాని రాజుకు చేశాడనీ,+ గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని+ వాళ్ల మధ్య ఉంటున్నారనీ యెరూషలేము రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు  అతను ఎంతో భయపడ్డాడు.+ ఎందుకంటే గిబియోను పెద్ద నగరం, అది ఒక రాజనగరం లాంటిది. అది హాయి కన్నా గొప్పది,+ దాని మనుషులందరూ యోధులు.  దాంతో యెరూషలేము రాజైన అదోనీసెదెకు హెబ్రోను+ రాజైన హోహాముకు, యర్మూతు రాజైన పిరాముకు, లాకీషు రాజైన యాఫీయకు, ఎగ్లోను రాజైన దెబీరుకు+ ఈ సందేశం పంపాడు:  “మీరు వచ్చి నాకు సహాయం చేయండి. మనం గిబియోను మీద దాడి చేద్దాం. ఎందుకంటే వాళ్లు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు.”+  కాబట్టి, అమోరీయుల+ ఐదుగురు రాజులు అంటే యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు తమ సైన్యాలతో సమకూడి గిబియోను దగ్గరికి వెళ్లి, దానితో యుద్ధం చేయడానికి దాన్ని చుట్టుముట్టారు.  అప్పుడు గిబియోనీయులు గిల్గాలులోని పాలెంలో+ ఉన్న యెహోషువకు ఈ సందేశం పంపారు: “నీ దాసులమైన మమ్మల్ని విడిచిపెట్టకు.*+ త్వరగా వచ్చి మమ్మల్ని రక్షించు! మాకు సహాయం చేయి! కొండ ప్రాంతంలోని అమోరీయుల రాజులందరూ మూకుమ్మడిగా మా మీద దాడిచేయడానికి వచ్చారు.”  కాబట్టి యెహోషువ సైనికులందరితో, బలమైన యోధులందరితో కలిసి గిల్గాలు నుండి బయల్దేరాడు.+  అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్లకు భయపడకు,+ ఎందుకంటే వాళ్లను నేను నీకు అప్పగించాను.+ వాళ్లలో ఏ ఒక్కరూ నీ ముందు నిలవలేరు.”+  యెహోషువ గిల్గాలు నుండి రాత్రంతా నడిచి హఠాత్తుగా వాళ్ల మీద దాడిచేశాడు. 10  యెహోవా ఇశ్రాయేలీయుల ముందు వాళ్లను గందరగోళానికి గురిచేశాడు.+ దాంతో ఇశ్రాయేలీయులు వాళ్లను గిబియోను దగ్గర ఘోరంగా హతం చేశారు. వాళ్లను బేత్‌-హోరోనుకు ఎక్కే దారిలో తరుముతూ అజేకా, మక్కేదా వరకు వాళ్లను చంపుకుంటూ వెళ్లారు. 11  వాళ్లు ఇశ్రాయేలీయుల నుండి పారిపోతూ బేత్‌-హోరోను నుండి కిందికి దిగే మార్గంలో ఉన్నప్పుడు, ఆకాశం నుండి యెహోవా వాళ్ల మీద పెద్దపెద్ద వడగండ్లు కురిపించాడు. అలా అజేకా వరకు కురిపించాడు. దాంతో వాళ్లు చనిపోయారు. నిజానికి ఇశ్రాయేలీయులు కత్తులతో చంపినవాళ్ల కన్నా వడగండ్ల వల్ల చనిపోయినవాళ్లే ఎక్కువ. 12  యెహోవా ఇశ్రాయేలీయుల కళ్లముందు అమోరీయుల్ని పూర్తిగా ఓడించిన ఆ రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై+ కదలకుండా నిలిచిపో,+చంద్రుడా, అయ్యాలోను లోయపై ఆగిపో!” 13  కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల్ని ఓడించేంతవరకు సూర్యుడు అలాగే నిలిచిపోయాడు, చంద్రుడు కదలకుండా ఆగిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో+ రాయబడివుంది. సూర్యుడు ఆకాశం మధ్యలో కదలకుండా అలాగే నిలిచిపోయాడు, దాదాపు ఒక రోజంతా అస్తమించడానికి తొందరపడలేదు. 14  యెహోవా ఒక మనిషి మాట విన్న+ అలాంటి రోజు, దాని ముందుగానీ దాని తర్వాతగానీ ఇంకెప్పుడూ రాలేదు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున పోరాడాడు.+ 15  ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి గిల్గాలులోని పాలెంలోకి తిరిగొచ్చాడు.+ 16  ఈలోగా ఆ ఐదుగురు రాజులు పారిపోయి, మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.+ 17  అప్పుడు, “ఆ ఐదుగురు రాజులు మక్కేదాలో+ ఉన్న గుహలో దాక్కున్నారు” అని యెహోషువకు వార్త అందింది. 18  దాంతో యెహోషువ ఇలా చెప్పాడు: “పెద్దపెద్ద రాళ్లను దొర్లించి గుహ ద్వారాన్ని మూసేయండి, మనుషుల్ని కాపలా పెట్టండి. 19  అయితే మిగతావాళ్లు శత్రువుల్ని తరుముతూనే ఉండండి, వెనక నుండి వాళ్ల మీద దాడిచేయండి.+ వాళ్లను వాళ్ల నగరాల్లోకి వెళ్లనివ్వకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వాళ్లను మీ చేతికి అప్పగించాడు.” 20  తమ శత్రువులు సమూలంగా నాశనం అయ్యేంతవరకు యెహోషువ, ఇశ్రాయేలీయులు వాళ్లను ఘోరంగా హతం చేశారు. అయితే కొంతమంది తప్పించుకొని ప్రాకారాలుగల నగరాల్లోకి పారిపోయారు. 21  తర్వాత ప్రజలందరూ మక్కేదాలోని పాలెంలో ఉన్న యెహోషువ దగ్గరికి క్షేమంగా తిరిగొచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్కమాట అనడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాల్లేదు. 22  తర్వాత యెహోషువ ఇలా అన్నాడు: “గుహ ద్వారాన్ని తెరిచి, అందులో ఉన్న ఆ ఐదుగురు రాజుల్ని నా దగ్గరికి తీసుకురండి.” 23  కాబట్టి వాళ్లు ఆ ఐదుగురు రాజుల్ని, అంటే యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును+ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకొచ్చారు. 24  వాళ్లు ఆ రాజుల్ని యెహోషువ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అతను ఇశ్రాయేలీయులందర్నీ పిలిపించి, తనతోపాటు యుద్ధానికి వచ్చిన సైన్యాధికారులతో ఇలా అన్నాడు: “మీరు ముందుకు వచ్చి, మీ కాళ్లను ఈ రాజుల మెడల మీద పెట్టండి.” దాంతో వాళ్లు ముందుకు వచ్చి తమ కాళ్లను ఆ రాజుల మెడల మీద పెట్టారు.+ 25  అప్పుడు యెహోషువ వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు భయపడకండి, బెదిరిపోకండి.+ ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. ఎందుకంటే మీరు పోరాడుతున్న మీ శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తాడు.”+ 26  తర్వాత యెహోషువ ఆ రాజుల్ని చంపి, ఐదు కొయ్యల* మీద వేలాడదీశాడు. సాయంత్రం వరకు వాళ్ల శవాలు ఆ కొయ్యల మీదే వేలాడుతూ ఉన్నాయి. 27  సాయంత్రం కావస్తున్నప్పుడు యెహోషువ వాళ్ల శవాల్ని కొయ్యల మీద నుండి దించి+ అంతకుముందు వాళ్లు దాక్కున్న గుహలో పడేయమని ఆదేశించాడు. ఆ తర్వాత గుహ ద్వారానికి పెద్దపెద్ద రాళ్లను అడ్డంగా పెట్టారు. ఈ రోజు వరకు అవి అక్కడే ఉన్నాయి. 28  యెహోషువ ఆ రోజు మక్కేదాను+ స్వాధీనం చేసుకొని, దాని నివాసుల్ని కత్తితో చంపాడు. అతను దాని రాజును, దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని చంపాడు,+ అతను ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు, అతను యెరికో రాజుకు చేసినట్టే మక్కేదా రాజుకు కూడా చేశాడు. 29  అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి మక్కేదా నుండి లిబ్నాకు+ వెళ్లి, దానితో యుద్ధం చేశాడు. 30  యెహోవా దాన్ని, దాని రాజును కూడా ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వాళ్లు దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని కత్తితో చంపారు. వాళ్లు ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు. వాళ్లు యెరికో రాజుకు చేసినట్టే+ లిబ్నా రాజుకు కూడా చేశారు. 31  తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి లిబ్నా నుండి లాకీషుకు+ వెళ్లి, అక్కడ మకాం వేసి దానితో యుద్ధం చేశాడు. 32  యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వాళ్లు రెండో రోజు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు లిబ్నాకు చేసినట్టే, లాకీషులో ఉన్న ప్రతీ ఒక్కర్ని కత్తితో చంపారు.+ 33  అప్పుడు గెజెరు రాజైన+ హోరాము లాకీషుకు సహాయం చేయడానికి వచ్చాడు. అయితే యెహోషువ అతన్ని, అతని ప్రజల్ని చంపాడు; వాళ్లలో ఒక్కర్ని కూడా మిగలనివ్వలేదు. 34  తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి లాకీషు నుండి ఎగ్లోనుకు+ వెళ్లి అక్కడ మకాం వేసి దానితో యుద్ధం చేశాడు. 35  ఆ రోజు వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని, దాని నివాసుల్ని కత్తితో చంపారు. వాళ్లు లాకీషుకు చేసినట్టే ఆ రోజు ఎగ్లోనులో ఉన్న ప్రతీ ఒక్కర్ని చంపారు.+ 36  తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి ఎగ్లోను నుండి హెబ్రోనుకు+ వెళ్లి దానితో యుద్ధం చేశాడు. 37  వాళ్లు హెబ్రోనును స్వాధీనం చేసుకొని, దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని, దాని రాజును, దాని పట్టణాల నివాసులందర్నీ కత్తితో చంపారు. వాళ్లు ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు. ఎగ్లోను విషయంలో చేసినట్టే అతను దాన్ని, దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని నాశనం చేశాడు. 38  చివర్లో యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో కలిసి దెబీరు+ వైపు వెళ్లి దానితో యుద్ధం చేశాడు. 39  అతను దెబీరును, దాని రాజును, దాని పట్టణాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు; వాళ్లు దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని కత్తితో చంపారు.+ వాళ్లు ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు.+ హెబ్రోనుకు, లిబ్నాకు, లిబ్నా రాజుకు చేసినట్టే అతను దెబీరుకు, దాని రాజుకు చేశాడు. 40  యెహోషువ పర్వత ప్రాంతాలన్నిటినీ, నెగెబు, షెఫేలా+ ప్రాంతాలన్నిటినీ, ఏటవాలు ప్రాంతాలన్నిటినీ, వాటి రాజులందర్నీ జయించాడు. అతను ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు; ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టే+ అతను ప్రతీ ఒక్కర్ని* చంపాడు.+ 41  యెహోషువ కాదేషు-బర్నేయ+ నుండి గాజా+ వరకు, గోషెను+ దేశమంతటితోపాటు గిబియోను+ వరకు జయించాడు. 42  ఇశ్రాయేలీయుల కోసం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుద్ధం చేస్తున్నాడు+ కాబట్టి యెహోషువ ఆ రాజులందరితోపాటు వాళ్ల దేశాల్ని ఒకే కాలంలో స్వాధీనం చేసుకున్నాడు. 43  ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి గిల్గాలులో ఉన్న పాలెం+ దగ్గరికి తిరిగొచ్చాడు.

అధస్సూచీలు

లేదా “మా చెయ్యి విడవకు.”
లేదా “చెట్ల.”
అక్ష., “ఊపిరి పీల్చుకునే ప్రతీ ఒక్కదాన్ని.”